- స్పర్శతో గుర్తుపట్టలేక ఇక్కట్లు
ముంబయి : పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బిఐ ప్రవేశపెట్టిన కొత్త నోట్లతో అంధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పర్శతో వాటి విలువను గుర్తించలేక అనేక ఇక్కట్లు పడటమేగాక, చాలా చోట్ల తీవ్రంగా నష్టపోతు న్నారు. కొత్త నోట్లను ప్రింట్ చేసేటప్పుడు విలువను సూచించే అంకెలను కాస్త ఉబ్బెత్తుగా (అలా ప్రింట్ చేయడాన్ని ఎంబోసింగ్ అంటారు) ప్రింట్ చెయ్యట్లేదు. పాత నోట్లలో ఈ సౌకర్యం ఉండేది. దీంతో వాళ్లు రూ. 500, రూ. 2000 నోటు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నట్లు జాతీయ అంధుల సమాఖ్య(ఎన్ఎబి) గురువారం తెలిపింది. పాత నోట్లు రద్దు చేసినప్పుడే ఈ సమస్యను ఆర్బిఐ దృష్టికి తీసుకెెళ్లామని, అయిన ప్పటికీ ఇంతవరకూ ఎటువంటి మార్పులను కొత్త నోట్లలో గమనించ లేదని ఎన్ఎబి కార్యదర్శి జొవాకిమ్ రాపోజ్ తెలిపారు. దీంతో దేశవ్యాప్తం గా సుమారు 80 లక్షల మంది అంధులు పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. యూరోప్, అమెరికా దేశాల మాదిరిగా ఇక్కడ నోట్లను గుర్తించి వాటి విలువను బయటికి చదివి వినిపించే మెషీన్లు భారత్లో లేవని జేవియర్ అనే అంధుడు చెప్పారు. ''గత పదిహేనేళ్లుగా పాత నోట్లకు అలవాటు పడ్డాం. అకస్మాత్తుగా మా జీవితాల్లోకి ప్రవేశించిన కొత్త నోట్లతో ఇబ్బందులు పడుతున్నాం. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మా భయం వర్ణనాతీతం. కొత్త వారిని నమ్మలేకపోతున్నాం. ప్రభుత్వం మా గురించి ఆలోచించిందే లేదు'' అని మరో అంధుడు శ్రీకాంత్ జాధవ్ పేర్కొన్నారు. అయితే కొత్త పద్ధతుల్లో కొత్త నోట్లను గుర్తించే విధానాన్ని నేర్పుతున్నట్లు ముంబయిలోని ఓ అంధుల పాఠశాల ఉపాధ్యాయురాలు తెలిపారు.
అంధులకు 'కొత్త' నోటు ఇబ్బందులు
