బ్లాగ్ జీవులకు సుపరిచతమైన పేరు టంబ్లర్. చాలా తేలిగ్గా బ్లాగ్‌లను నిర్వహించే వీలున్న ఈ వెబ్‌సైట్‌ను వాడుతున్నవారు 23 కోట్ల మంది వరకు ఉన్నారు. కొన్ని కోట్ల పోస్టులు రోజూ పుట్టుకొచ్చే ఈ సైట్ వెనుక ఉంది ఓ యువకుడు. 20 ఏళ్లకే దీనికి ప్రాణం పోసిన అతడి పేరు డేవిడ్ కార్ప్.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పెరిగి పెద్దవాడైన డేవిడ్ కార్ప్ తల్లిదండ్రులు బార్బరా యాక్కెర్మన్, మైకేల్ కార్ప్ టీచర్, టీవీ కంపోజర్లు. చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటల్ని ప్రదర్శిస్తోన్న కార్ప్ ఇష్టానుసారం వారు అతణ్ని పెంచారు. బడి చదువుల్లో ముందున్నా వాటి కంటే స్వయంగా నేర్చుకోవడానికే ప్రాముఖ్యతనిచ్చాడు డేవిడ్. తల్లి టీచర్‌గా చేస్తున్న కల్హౌన్ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన కార్ప్‌కు కంప్యూటర్‌పై మోజు పెరిగింది. ఆ వయసుకే వెబ్సైట్లను తయారుచేయడంలో మంచి పట్టు సాధించాడు. వాటిని నేర్పుగా తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు. ఇందులో అభివృద్ధి కనిపించడంతో బడిని వదిలేశాడు. పూర్తిగా వెబ్సైట్ల సృష్టికే అంకితమయ్యాడు. అవసరమైన చదువును లీగ్ యూనివర్సిటీల ద్వారా చదివాడు. అతడికి 14 ఏళ్ల వయసున్నపుడే చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంటర్న్‌గా పనిచేశాడు. అనూహ్యమైన మలుపు ఈ సందర్భంలో తిరిగింది. అర్బన్ బేబీ అనే పేరెంటింగ్ కంపెనీ తమ వ్యాపారానికి వెబ్‌సైట్‌ను రూపొందించమని అడిగింది. దాన్ని చాలా చక్కగా చేయడంతో అతడినే దానికి అధినేతను చేసిందా కంపెనీ. ఆ తర్వాత మెరుగైన అవకాశాలను వెతుక్కు ంటూ టోక్యో చేరుకున్నాడతడు. అక్కడ డేవిడ్విల్లే అనే కన్సల్టింగ్ కంపెనీ పెట్టాడు. అక్కడ పరిచయ మైన మార్కో ఆర్మెంట్ అనే ఇంజినీర్‌తో కొన్ని నెలల్లోనే టంబ్లర్కు ఓ రూపం తీసుకువచ్చాడు. ప్రపంచానికి తమ భావాలను వ్యక్తపరిచేందుకు ఓ వెబ్సైట్ కావాలని అర్థం చేసుకున్న వీరు ఈ కొత్త తరహా బ్లాగింగ్ సోషల్ నెట్‌వర్క్‌కు ప్రాణం పోశారు. అప్పుడు డేవిడ్ వయసు 20 ఏళ్లు. వారు ఊహించినట్టుగానే రెండు వారాల్లో అందులో 75 వేల మంది రిజిష్టరయ్యారు. అలా కొన్ని నెలల్లోనే ఖండాతరాలను దాటేసి కోట్ల మందితో బ్లాగింగ్ వ్యవస్థను రూపొందించింది. దీనిలోని ఫీచర్లే ఈ సైట్ విజయ రహస్యం. చాలా సులువుగా పోస్ట్‌లను చేయడం. ఇతర బ్లాగర్ల పోస్టులను షేర్ చేసే అవకాశం ఉండటం. డ్యాష్‌బోర్డ్‌లో మరిన్ని ఫీచర్లతో వీడియోలు, ఫొటోలు, కామెంట్లు వంటి వాటిని పొందికగా అమర్చుకోవడం, పంచుకోవడం చాలా తేలిక. ఆకట్టుకునే విధంగా పేజీ డిజైన్ ఉంటుంది. ఇలా టంబ్లర్ మంచి విజయాన్ని దక్కించుకుని యాహూ దృష్టిలో పడింది. 2013లో సుమారు 600 కోట్ల రూపాయల్ని చెల్లించి టంబ్లర్‌ను సొంతం చేసుకుంది. దాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 28 ఏళ్ల డేవిడ్‌నే సీయీవోను చేసింది. బిజినెస్ వీక్ పత్రిక 'బెస్ట్ యంగ్ టెక్ ఎంట్రిప్రిన్యూర్'గా ఎంపిక చేసింది. ఎంఐటీ రూపొందించిన ప్రపంచంలోనే 35 మంది మేటి ఎంట్రిప్రిన్యూర్ల జాబితాలో అతడికి చోటు దక్కింది. తల్లిదండ్రుల నుంచి సరైన ప్రోత్సాహం, ఆశావహ వాతావరణం ఉంటే చిన్న వయస్సులోనే ప్రజ్ఞావంతులు ఉన్నత శిఖరాల్ని అధిరోహించ గలరని డేవిడ్ నిరూపించాడు.
బ్లాగిస్తానుడు
