* ప్రతి 1500 ఓటర్లకు ఒకటి చొప్పున 9 నియోజక వర్గాల్లో 2,304 పోలింగ్ స్టేషన్లు
* ప్రభుత్వం నిర్థేశించిన 1500 ఓటర్ల సంఖ్యను కుదించేందుకు ప్రభుత్వానికి నివేదిక
* జిల్లారెవిన్యూ అధికారి జె.వెంకట్రావు
* అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమావేశం
విజయనగరం: భారత ఎన్నిక సంఘం నిర్థేశించిన విధంగా 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున జిల్లాలో 2 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకట్రావు తెలిపారు. అయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరిని విధంగా ప్రతి పోలింగ్ స్టేషనల్లో 1500 ఓటర్ల సంఖ్యను తగ్గించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని ఆయన తెలిపారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ అంశంపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబరులో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది నియోజక వర్గాల్లో మొత్తం 18 లక్షల 42 వేల 802 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 2 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొమ్మిది నియోజకవర్గాల ఇ.ఆర్.ఓ.లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు చేసి మొత్తం పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారని ఆయన తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో 268, పార్వతీపురంలో 233, సాలూరులో 240, బొబ్బిలిలో 264, చీపురుపల్లిలో 257, గజపతినగరంలో 264, నెల్లిమర్లలో 248, విజయనగరంలో 260, ఎస్.కోట నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే జిల్లా స్థాయిలో కూడా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించిన తదుపరి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నిక సంఘానికి నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్బంగా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ, వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్లు అయితే ఓటింగ్ రోజు రద్దీగా ఉంటుందని, ఓటింగ్ సమయం కూడా చాలా ఎక్కువ పడుతుందని, ఈ సంఖ్యను కుదించాలని పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞాపనను ఎన్నిక సంఘం దృష్టికి తీసుకువెళతామని ఆయన తెలిపారు. డా.పి.వి.రమణ (బి.ఎస్.పి.), కె.దయానంద్ (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎస్.సతీష్ కుమార్ (ఐ.ఎన్.సి.), రొంగలి పోతన్న (వై.ఎస్.ఆర్.సి.పి.), పి.ఏ.మహేష్, వి.మల్లేశ్వరరావు (టి.డి.పి.), ఎ.జగన్మోహన్రావు (సి.పి.ఎం.), కలెక్టరేట్ ఎన్నిక విభాగం సూపరింటెండెంట్ అంజనీకుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.