ఢిల్లీ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ వద్ద చుక్కెదురైంది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడంటూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందాడని నిర్ధారణ అయిందని హోం శాఖ పేర్కొంది. చెన్నమనేనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ విచారణ జరిపింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి చెన్నమనేని టీడీపీ అభ్యర్థిగా రమేష్ విజయం సాధించారు. అప్పుడు ఆయన పౌరసత్వంపై వివాదం చెలరేగింది. రమేష్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందాడని ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఆయన జర్మనీలో ఉంటున్నాడని ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వకూడదని పేర్కొన్నారు. 2010 సంవత్సరంలో హైకోర్టులో ఆయన కేసు వేశారు. నిజానికి చెన్నమనేని రమేష్ 1993 లో జర్మనీ పౌరసత్వం పొందారు. అప్పుడే ఆయన భారత పౌరసత్వం రద్దు చేసుకున్నారు. అనంతరం 2008లో తిరిగి భారత పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.