* వెల్లువెత్తిన విమర్శలు
జెరూసలేం/వాషింగ్టన్ణ్ ఇజ్రాయిల్ తాను ఆక్రమించుకున్న వెస్ట్‌బ్యాంక్ భూభాగంలో నిర్మించిన సెటిల్మెంట్లు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకంగా వున్నాయన్న వాదనతో తాము ఏకీభవించటం లేదని అమెరికా ప్రకటించింది. ఈ సెటిల్మెంట్లను 'అక్రమ నిర్మాణాలు'గా తాము పరిగణించటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన ఈ ప్రకటనపై దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. వెస్ట్‌బ్యాంక్ సెటిల్మెంట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస, అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సులు ఆమోదించిన తీర్మానాలకు విరుద్ధంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవటంపై పెద్ద దుమారమే రేగింది. వెస్ట్‌బ్యాంక్ సెటిల్మెంట్ల నిర్మాణాల విషయంలో తాము 1978 నుండి అనుసరిస్తున్న వైఖరిని పున్ణసమీక్షించిన ఫలితంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాంపియో మీడియాకు చెప్పారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ నిర్మించిన సెటిల్మెంట్లు 'అంతర్జాతీయ చట్ట నిబంధనలకు లోబడే' వున్నాయని తాము భావిస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రకటనపై తీవ్రంగా స్పందించిన డెమొక్రాటిక్ నేత, వచ్చే అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వున్న వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికా ఇప్పటి వరకూ అనుసరిస్తున్న దౌత్య విధానాలకు భిన్నంగా తన తీవ్రవాద వైఖరిని ట్రంప్ నిస్సిగ్గుగా సమర్ధించుకున్నారని ఆయన ఒక ట్వీట్లో విమర్శించారు. ఇజ్రాయిల్ ఇప్పటికైనా వెస్ట్‌బ్యాంక్‌లో అక్రమ సెటిల్మెంట్ల నిర్మాణానికి తెరదించాలని ఐరోపా కూటమి విదేశీ వ్యవహారాల ఛీఫ్ ఫెడరికా మొఘెరిని తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ఇజ్రాయిల్ అక్రమ నిర్మాణాలపై అమెరికా చేసిన ప్రకటన మధ్యప్రాచ్యంలో శాంతికి విఘాతం కలిగించే ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని జోర్డాన్ విదేశాంగ మంత్రి అయిమన్ సఫాదీ హెచ్చరించారు. ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న నేరాలను గుడ్డిగా సమర్దించటం ద్వారా అమెరికా అంతర్జాతీయ చట్టానికి తూట్లు పొడుస్తోందని పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయిల్ నిర్మిస్తున్న సెటిల్మెంట్లు యుద్ధ నేరమే అవుతుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ నిర్మిస్తున్న అక్రమ సెటిల్మెంట్లు యుద్ధ నేరమేనని దశాబ్దాల క్రితమే ప్రకటించిన అంతర్జాతీయ చట్టాన్ని ట్రంప్ తన నిర్ణయం ద్వారా తుడిచివేయలేరని హ్యూమన్‌రైట్స్ వాచ్ సంస్థ కెన్నెత్ రోత్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
వెస్ట్‌బ్యాంక్ సెటిల్మెంట్లు 'అక్రమం'కాదన్న అమెరికా
