లఖ్‌నవూ : అయోధ్యలో వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. అభ్యంతరకర సందేశాలు పోస్ట్ చేసినందుకుగాను ముగ్గురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ముజఫర్‌నగర్‌కు చెందిన సాదిక్ మాలిక్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో అయోధ్యపై సుప్రీం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా శుక్రవారం అభ్యంతర పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు ఇద్దరు వ్యక్తులు లైకు కొట్టారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకుగాను ముగ్గురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ యశ్పాల్ధమ తెలిపారు.
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు పంచుతూ 2010 లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శనివారం తుది తీర్పు వెలువరించింది. ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని, ముస్లింలకు మరో చోట అయిదు ఎకరాలు కేటాయించామని తీర్పు వెలువరించింది.