ప్రజాశక్తి- అనంతపురం రూరల్:
ఆ మహిళ రైతు భూ తల్లినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తుంది. సాఫీగా సాగుతున్న ఆమె జీవితాన్ని వర్షాభావం మృత్యువు రూపంలో కబళించింది. నీటి జాడ కోసం బోర్లు వేయించడానికి, పంట సాగుకు సుమారు రూ.3.97 లక్షలు అప్పు చేసింది. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవ్వడంతో తనువు చాలించింది. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా రూరల్ మండలంలో గురువారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామానికి చెందిన మహిళా రైతు మమత(29) తనకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. ఇటీవల వర్షాభావంతో బోరు ఎండిపోయింది. మరో రెండు బోర్ల కోసం సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రెండు బోర్లలో ఒక్క చుక్కనీరు పడలేదు. మరోవైపు సిండికేట్ బ్యాంకులో రూ.1.47 లక్షల రూపాయల వ్యవసాయ రుణం, రూ.50 వేల బంగారు రుణం, ప్రయివేటు వ్యక్తుల వద్ద రూ.2 లక్షలు ఇలా మొత్తం 3.97 లక్షల రూపాయల అప్పు చేసింది. తీసుకున్న డబ్బు చెల్లించాలని అప్పులవారు ఒత్తిడి తెచ్చారు. అప్పులు తీరే మార్గం లేక, జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా రైతు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.రామాంజినేయులు ప్రభుత్వాన్ని కోరారు.