* ఇంగ్లీషుమీడియంపై ముఖ్యమంత్రి
* ఒంగోలులో నాడు- నేడు ప్రారంభం
ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో:
ఇంగ్లీషు మీడియం చదువు విషయంలో వెనకడుగు వేసే ఆలోచనే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులో పివిఆర్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన నాడు-నేడు కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ నాడు-నేడు కార్యక్రమాన్ని చరిత్రను మార్చే తొలిఅడుగుగా అభివర్ణించారు, ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టడాన్ని విప్లవాత్మక చర్యగా పేర్కొన్నారు. 'ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సివస్తుంది. వాటిని అధిగమించాల్సిందే. ఎంతమంది విమర్శించినా ముందడుగే వేస్తాం' అని ఆయన అన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి నుండి ఆరోతరగతి వరకు ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 'ఆ తరువాత ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తాం' అని అన్నారు. పేద పిల్లలు ప్రైవేటు చదువులు చదవలేక, ఇంగ్లీషు రాక చివరకి కూలీలుగానూ, డ్రైవర్లుగానూ మిగులుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఇంగ్లీషుమీడియం నిర్ణయం తీసుకున్నామని, అయితే తెలుగు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందని చెప్పారు. పిల్లలు ప్రపంచజాబ్ మార్కెట్‌తో పోటీపడాల్సి వస్తోందని, ఇప్పటికే ఇంటర్నెట్ రాజ్యమేలుతోందని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చేసిందని, రానున్నరోజల్లో రోబోటెక్స్ కీలక పాత్ర పోషిష్తాయని అన్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డ రానున్న ఇరవై ఏళ్ల తర్వాత గ్రాడ్యుయేట్ పూర్తిచేస్తాడని, అప్పడు ప్రపంచంలో తలెత్తుకునేలా ఉండాలంటే ఇప్పుడే ఎలాంటి చదువులు కావాలో ఊహించాలని, తమ ప్రభుత్వం అదేచేస్తోందని అన్నారు. కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయాలా? ప్రభుత్వ బడులు బాగుచేయాలా? పోటీలో నిలిచే చదువులు చదివించాలా? వద్దా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలలున్నాయని, నాడుానేడు కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 17,715 పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలూ కల్పిస్తామని చెప్పారు. మొత్తంమీద మూడు దశల్లో అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, ఫర్నీచర్, బ్లాక్‌బోర్డులు, రంగులు, మరమ్మతులు, అదనపు గదులు, ప్రహరీ గోడలు, ఇంగ్లీషు ల్యాబ్ వంటి తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం పాఠశాలలకు కేవలం రూ.20 వేల కోట్లు కేటాయిస్తే తాము రూ.33 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరమ్మతులకే రూ.3500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మూడేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. జనవరి తొమ్మిదిన అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తామన్నారు. తను మాట ఇచ్చినట్లు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ కోర్సులు చదివే ప్రతి విద్యార్థికీ పూర్తిగా ఫీజురీయింబర్స్మెంటుతో పాటు అదనంగా రూ.20 వేలు ఇస్తామన్నారు.. సభలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలం సురేష్‌లు మాట్లాడారు.
వెనకడుగు వేయం : సిఎం జగన్
