* నెహ్రూ కు నివాళులు.. అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
* రూ.130 కోట్లతో జిల్లాలో పాఠశాలల ఆధునీకరణ : మంత్రి శంకర్ నారాయణ
అనంతపురం : మనబడి - నాడు నేడు కార్యక్రమం కింద జిల్లాలో 130 కోట్ల రూపాయలతో పాఠశాలల ఆధునీకరణ చేపడుతున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని మహాత్మా గాంధీ పురపాలక ఉన్నత పాఠశాలలో గురువారం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మన బడి - నాడు నేడు (ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి) జిల్లా వ్యాప్త కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంజీఎం ఉన్నత పాఠశాలలో మన బడి - నాడు నేడు కార్యక్రమం శిలాఫలకాన్ని మంత్రి శంకర్ నారాయణ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు. అంతకుముందు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి, ఎమ్మెల్సీ, కలెక్టర్ లు నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.
ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ... మనబడి - నాడు నేడు కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న 3490 పాఠశాలల్లో మొదటి విడత కింద 1240 పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని పాఠశాలల దుస్థితిని గమనించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగు నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరి గోడల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, గ్రీన్ బోర్డ్ ఏర్పాటు, ఆహ్లాదకరంగా ఉండేందుకు చెట్ల పెంపకం లాంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ఫోటోలు తీసి, ఏడాది నాలుగేళ్ల తర్వాత ఎలా అభివృద్ధి చెందింది అనేది ఛాయా చిత్రాల ద్వారా ప్రదర్శన చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో కనీస వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు మరుగునపడ్డాయనీ, ఆయా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విద్యార్థుల్లో ఉన్నత ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసి విద్యార్థులకు సులభతరమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా విద్యా బోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రవేశపెట్టి, పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి బోధన ప్రవేశపెట్టి వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తామని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. ప్రతి ఒక్క పాఠశాలలో ఆంగ్ల విద్యా బోధన ద్వారా విద్యాప్రమాణాలను పెంచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. ఆంగ్ల విద్యా బోధన ద్వారా తెలుగు భాష కు ఎలాంటి హాని కలుగదని, ఖచ్చితంగా తెలుగును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తామని, ఉర్దూ భాషను కూడా బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి వారి తల్లిదండ్రుల అకౌంట్లో 15 వేల రూపాయల లబ్ధి అందజేస్తామని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆయా పాఠశాలల ఆధునీకరణ పనుల్లో ఎలాంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రస్తుతం అందుతున్నాయని, ప్రజల అభివృద్ధికి మరిన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన విధంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మన బడి - నాడు నేడు పథకం ద్వారా శ్రీకారం చుట్టారని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలకు పొందేందుకు ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలని సూచించారు. అయిదేళ్ల గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అటకెక్కిందనీ, తమ ప్రభుత్వం పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు, విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తోందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విద్యా బోధన పెంపొందించి పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన బడి - నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంచి, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మొదటి విడుదల 1240 పాఠశాలల్లో నాడు - నేడు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. మన బడి కింద నవంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జూన్ ఒకటి లోపు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడతామని, అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, బూట్లు, పుస్తకాలు అందిస్తామని, మంచి నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం, గ్రీన్ బోర్డులు, బెంచీల ఏర్పాటులాంటి 9 రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హిందూపురంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఒక కోటి 32 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి అవినీతి లేకుండా పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి, ఆయా కమిటీల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులంతా బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్రావు, ఎస్ఎస్ఎ పిడి.రామచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
