అనంతపురం : స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని పలు విద్యాసంస్థలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు జవహర్ లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, భగత్ సింగ్, అంబేద్కర్, వివిధ జాతీయ నాయకుల వేషధారణలో వచ్చి చూపరులందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మార్జానియా శ్రీనివాసులు మాట్లాడుతూ... దేశం గర్వించదగ్గ వ్యక్తి జవహర్ లాల్ నెహ్రు అన్నారు. ఈయన ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. నెహ్రూ ముందుచూపు లో భాగంగా ఎన్నో ప్రాజెక్టులను రూపొందించి బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని అందుకోసమే నెహ్రూ జన్మదినాన్ని చిన్నపిల్లల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి నందకుమార్, హెచ్ఎం గాయత్రీ, ఏవో భాస్కర్, హెచ్ఎం లు విజయేంద్ర, శశికళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పట్టణంలోని లోటస్ ఎక్స్లెన్స్ స్కూల్, రేనాల్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వివేకానంద మిలీనియం పాఠశాలలతో పాటు పురపాలక ప్రభుత్వ పాఠశాలల్లో నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.