* వామపక్షాల ఇసుక మార్చ్ విజయవంతం
* ఉద్రిక్త పరిస్థితుల మధ్య నాయకుల అరెస్ట్
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఇసుక సమస్యపై వామపక్ష నాయకులు ఇసుక మార్చ్ నిర్వహించారు. కృష్ణానదిలో ఇసుకను తెచ్చి ఉచితంగా పంపిణీ చేసి ప్రభుత్వానికి చూపించారు. అయిదు నెలలుగా ప్రభుత్వం చేయలేని పనిని వామపక్షాలు చేసి చూపించాయి. అడుగడుగునా పోలీసులు నిర్బంధాలు విధించినా వాటిని ఛేదించుకుంటూ కృష్ణానదిలోకి వెళ్లి ఇసుకను తెచ్చి సామాన్య ప్రజలకు ఇసుకను అందజేశాయి. అయిదు నెలలుగా ప్రభుత్వం ఇలాంటి పని చేయడంలో విఫలమయ్యిందని వామపక్షాలు ఇసుక మార్చ్‌తో నిరూపించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఇసుకను వ్యాపార సాధనంగా వినియోగించకుండా, ఉచితంగా పంపిణీ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గత అయిదు నెలలుగా నెలకొన్న ఇసుక కొరతపై.. మంగళవారం వామపక్ష పార్టీలు విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇసుక మార్చ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు.
ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసుల బలగాలు వందలాదిగా వారధి వద్ద మోహరించాయి. ఉదయం పది గంటల నుండి కనిపించినవారిని కనిపించినట్లు పోలీసులు అరెస్టు చేయడం ప్రారంభించారు. టీ షాపుల వద్ద ఇసుక మార్చ్‌తో సంబంధంలేని ప్రజలను సైతం అనుమానించి, వారిని కూడా పోలీసులు అరెస్టులు చేయడంతో అరెస్టయిన వారు పోలీసుల తీరుపై మండిపడ్డారు. కృష్ణలంక నెహ్రూనగర్ వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి, అటువైపు ఏ ఒక్కరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రజలు కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు.
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్లు ఒకేసారి ఇసుక మార్చ్‌కు తరలివచ్చారు. ఇసుక తెచ్చేందుకు కృష్ణానదిలోకి వెళుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు విధించిన నిర్బంధాలను నాయకులు దాటుకుని ఎట్టకేలకు నదిలోకి అడుగుపెట్టారు. ఇటీవల వచ్చిన వరదలతో ఏర్పడిన ఇసుక మేటల వద్దకు నాయకులు చేరుకుని, ఇసుకను తవ్వి ప్రజలకు ఉచితంగా అందించారు. ప్రకృతి ఉచితంగా ప్రసాదించిన ఇసుకతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ... వరదల పేరుతో ఇంకెంత కాలం ప్రభుత్వం ఇసుకను పంపిణీ చేయకుండా కార్మికులను ఇబ్బందిపెడుతుందని ప్రశ్నించారు. వరదలు లేకపోయినా, ప్రభుత్వం ఇసుక అందించే చర్యలను చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆత్మహత్యలు చేసుకున్న భవననిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం అందించాలని, భవన నిర్మాణ కార్మికులందరికీ రూ.20 వేలు భృతినిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ... వైసిపి నేతల జేబులు నింపేందుకే ప్రభుత్వం ఇసుక కొరతను సృష్టించిందన్నారు. వరదల పేరుతో ఇసుక తవ్వకాలను నిలిపేసి, రాత్రికి రాత్రి ఇతర రాష్ట్రాలకు వందల లారీలతో ఇసుకను తరలించే ఇసుక మాఫియాకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందన్నారు. పోలీసులు కూడా ఇసుక మాఫియాతో కుమ్మక్కై ఇసుక లారీలను వదిలేస్తున్నారని, ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ... ప్రభుత్వం ఇసుకను ఉచితంగా పంపిణీ చేయలేక, పిరికిపంద చర్యగా పోలీసుల నిర్బంధాన్ని విధించిందన్నారు. వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తన జేబులు నింపుకునేందుకే కృత్రిమ ఇసుక కొరతను సృష్టించిందని, ఇసుక సరఫరాలో వైసిపి ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి ఇసుక కొరతతో ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం పోలీసులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, సిహెచ్.బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, కె.పోలారి తదితరులను అరెస్టు చేసి కృష్ణలంక పోలీసు స్టేషనుకు తరలించారు. అంతకు ముందు అరెస్టయిన వారిలో సిపిఎం నాయకులు డివి కృష్ణ, బోజెడ్ల నాగేశ్వరరావు, నాగోతి ప్రసాద్, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్, ఎఐటియుసి ప్రధానకార్యదర్శి జి.ఓబులేశు, సిఐటియు నాయకులు పిల్లి నరసింహారావు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, తదితరులు ఉన్నారు.
అరెస్టులకు ఖండన :
రాష్ట్రంలో ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో ఈ రోజు తలపెట్టిన ''ఇసుక మార్చ్''ను పోలీసులు భగం చేయడాన్ని వామపక్షాలు ఖండించాయి. కనకదుర్గ వారధి వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన వామపక్షాల కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని వామపక్షాలు (సిపిఐ, సిపిఐ(యం), సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ(యంఎల్), యంసిపిఐ(యు), సిపిఐ(యంఎల్) లిబరేషన్, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ, యస్‌యుసిఐ(సి), ఫార్వర్డ్‌బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) ఖండిస్తున్నాయి. పోలీసు వలయాన్ని ఛేదించి కృష్ణా నదిలో ఇసుక తవ్వి బయటకు వస్తున్నప్పుడు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోలారి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, సి.హెచ్.బాబూరావులతోపాటు అనేకమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక మార్చ్ ప్రారంభానికి ముందే వారధి దగ్గరకు చేరుకున్న సిపిఐ నాయకులు ఓబులేశు, సిపిఐ(ఎం) నాయకులు డి.వి.కృష్ణ, బోజెడ్ల నాగేశ్వరరావు, నాగోతి ప్రసాద్, బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నర్సింహారావు తదితరులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ అరెస్టులను వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇసుక సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అఖిలపక్షాలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని, ఆన్లైన్ విధానం రద్దు చేయాలని, పనులు కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు రూ.25 వేలు ఇవ్వాలని, చనిపోయిన కార్మికులకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.


