అమరావతి : వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ఎపి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా రేపటి నుంచి రాష్ట్రంలో రైతు భరోసా పథకం ప్రారంభం కానుంది. ఈమేరకు సీఎం వైఎస్ జగన్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే, రైతు భరోసా కింది ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మిషన్పై ఇవాళ సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... వైఎస్సార్ రైతు భరోసా కింద అందజేసే సాయాన్ని రూ. వెయ్యి పెంచారు.. అంటే గతంలో రూ.12,500గా నిర్ణయించగా.. ఇప్పుడు రూ.13,500 ఇవ్వాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక, నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో జగన్ హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఐదేళ్ల పాటు రూ.13,500లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
రైతు భరోసా నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచడంతో.. రూ.50 వేలకు బదులుగా రూ.67,500 రైతులకు లబ్ధిచేకూరనుంది. ఇచ్చిన హామీ కంటే రూ.17,500 అధికంగా ఇస్తోంది వైసీపీ సర్కార్.. వ్యవసాయ మిషన్లో రైతు ప్రతినిధుల డిమాండ్ మేరకు ఏటా ఇచ్చే సహాయాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు కీలక సందర్భాల్లో పెట్టుబడి సహాయం చేయాలని రైతు ప్రతినిధులు సూచించారు. రైతులు, రైతు ప్రతినిధుల డిమాండ్లను సీఎంకు వ్యవసాయ మిషన్ సభ్యులు వివరించారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేయనున్నారు. మే నెలలో రూ.7,500, ఖరీఫ్ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు అందజేస్తారు.
