* నిందితుడు అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
పశ్చిమ గోదావరి : తన తల్లిని కొట్టాడన్న ద్వేషంతో సొంత బావను హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఏలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వర్ధనపు అనీష్ (30) స్థానికంగా ఏ పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ గొడవలు పడుతూ ఉంటాడు. అతనిపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో రౌడీషీటు తెరిచారు. ఇప్పటికీ అతనిపై ఆ ప్రాంతంలో మూడు కేసులు నమోదయ్యాయి. దానితో పాటుగా రౌడీ షీటర్ కూడా తెరవబడింది. ఇదిలా ఉండగా పెదవేగి మండలం భోగాపురం శివారు ప్రకాష్ నగర్లో అనీష్ మేనమామ కోగట్టు చిట్టియ్య కుటుంబం ఉంది. తరచుగా అనీష్ తన మేనమామ ఇంటికి రావడం, వారి ఇంట్లోనే కొద్దిరోజులు ఉండడం చేస్తుండేవాడు. అక్కడితో ఆగకుండా స్థానికంగా గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ నెల 17 వ తేదీన అనీష్ అతని అక్క సుజాత ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన రోజు శనివారం సాయంత్రం పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో తన అక్క సుజాత పై గొడవకు దిగాడు దీనికి కారణం చెల్లెలు వివాహానికి సుజాత హాజరుకాకపోవడమే. తర్వాత అక్క ను గట్టిగా కొట్టాడు. ఆ సమయంలో అక్క కుమారులు ఇంటివద్ద లేరు. అక్కను కొట్టి బయటకు వెళ్లి తిరిగి రాత్రి సమయంలో అనీష్ ఇంటికి వచ్చాడు. తన కుమారులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను ఆమె తన కుమారులకు తెలిపింది. అప్పటికే అనీష్ చాలా సార్లు తమ కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండటంతో అంతకు ముందు నుండి అనీష్ పై ప్రశాంత్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17 వ తేదీ రాత్రి తమ బావ ఇంటికి వచ్చిన తర్వాత బావమరిది ప్రశాంత్ రాత్రి సమయంలో అతనితో మంచిగా ఉన్నట్లు నటించాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయం దాటిన తరువాత మద్యం మత్తులో నిద్రిస్తున్న వర్తనవు అనీష్ ని ప్రశాంత్ ఇనుప రాడ్డు తో తలపై గట్టిగా కొట్టి పరారయ్యాడు. అనీష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఈ ఘటనపై పెదవేగి ఎస్ఐ బండి మోహన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం నిందితుడిని పెదవేగి సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. అతని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ.. అనీష్ స్వభావం చెడుతనంగా ఉండడం నచ్చని ప్రశాంత్ ఈ దాడికి పాల్పడ్డాడని అంతేకాకుండా తమ తల్లిదండ్రులను నిత్యం వేధిస్తున్నాడన్న ద్వేషంతో అతని హతమార్చినట్లు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. చాలా కాలంగా అతని వేధింపులు చేస్తూ ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ఎంతగానో కృషి చేసిన పెదవేగి ఎస్సై బండి మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్ అమీర్, కానిస్టేబుల్ కిషోర్, సురేష్, నాగూర్, జయ కుమార్ లను డీఎస్పీ అభినందించారు. ఒక కుటుంబాలలో ఏవైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి తప్ప ఇలా దాడికి పాల్పడ్డ కూడదని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాస్ బండి మోహన్ రావు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సొంత బావను హతమార్చిన బావమరిది
