- కొలంబో ఉగ్రదాడిపై అధ్యక్షుడు సిరిసేన
కొలంబో: క్రైస్ట్దాడి చర్చల నేపథ్యంలో ఉగ్రదాడి పొంచి వుందంటూ భారత్తో సహా అనేక దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ తమ దేశానికే ఈ ముప్పు పొంచివుందన్న విషయం తనకు ఏ మాత్రం తెలియదని శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన చెప్పారు. మంగళవారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడుతూ వివిధ దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థల నుండి అందిన సమాచారాన్ని సంబంధిత అధికారులు తనకు అందించలేదని చెప్పారు. అధ్యక్షుడు సిరిసేన ఆధీనంలోనే శాంతిభద్రతలు, దేశ రక్షణ మంత్రిత్వశాఖలున్న విషయం తెలిసిందే. తాను ఊహిస్తున్నదే నిజమైతే వారిపై తక్షణ చర్య తీసుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు. విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
359కి చేరిన మృతుల సంఖ్య, మరికొందరి అరెస్ట్
ఇదిలా వుండగా ఆదివారం నాటి పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరిందని, ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేశామని శ్రీలంక పోలీసులు చెప్పారు. మంగళవారం రాత్రి తాము 18 మంది అనుమానితులను అరెస్ట్ చేశామని, దీనితో అరెస్టయిన వారి సంఖ్య 58కి పెరిగిందని పోలిసు ప్రతినిధి రువాన్గుణశేఖర చెప్పారు.