అది 1912వ సంవత్సరం. ఏప్రిల్ మాసం. అప్పుడే నిర్మాణం పూర్తయిన ఒక కొత్త భారీనౌక తన తొలి ప్రయాణానికి అట్లాంటిక్ సముద్రంలో శ్రీకారం చుట్టింది. అప్పట్లో అదే ప్రపంచంలోని అతి పెద్ద నౌక (ఇప్పుడున్న అతి పెద్ద నౌకల్లో అది కూడా ఒకటిగా నిలుస్తుంది). ఆ నౌకను 'అతి పెద్ద నౌక' అని 'ఎప్పటికీ మునిగిపోని నౌక' అని పిలిచేవారు. ఆ ఓడ మొత్తం 1348 మంది ప్రయాణీకులతో, 860 మంది సిబ్బందితో తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. వాళ్లంతా అద్భుతమైన అనుభవం కోసం అర్రుల చాస్తున్నారు. అయితే ఆ నౌక ప్రయాణం మొదలు పెట్టిన మూడవ రోజునే అంటే 14.9.1912న అకస్మాత్తుగా సముద్రంలోనే ఒక పెద్ద ఐస్‌బర్గును ఢకొీట్టింది.
నమ్మశక్యంగాని ఘోరం కనురెప్పపాటులో జరిగిపోయింది. 'ఎప్పటికీ మునిగిపోని నౌక' మంచుతో కూడిన అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడలో వున్న మొత్తం 2208 మందిలో 1503 మంది నీట మునిగిపోయారు. కేవలం 705 మంది మాత్రమే బయటపడ్డారు.
ఆ నౌక పేరే 'టైటానిక్'.
***
అప్పటికి 14 సంవత్సరాల క్రితం...
1898లో మార్గాన్ రాబర్ట్‌సన్ అనే జర్నలిస్టు 'ఫ్యుటిలిటీ' అనే నవల రాశాడు. అందులో ఆయన 'ఎప్పటికీ మునిగిపోని ఒక నౌక' సౌథాంప్టన్‌కు తొలి సముద్రయానానికి బయలుదేరినట్టుగా, ఆ నౌక నిండా ధనిక ప్రయాణీకులే వున్నట్టుగా, ఆ నావ సముద్రంలో ఒక ఐస్‌బర్గ్‌ను ఢకొీట్టి అనేక మంది దుర్మరణం పాలయినట్టుగా వర్ణించాడు చిత్రంగా. మరో చిత్రమేమిటంటే ఆ ఓడ పేరు 'టైటాన్' అని రాయడం.
***
'ఫ్యుటిలిటీ' నవలను ప్రచురించడానికి 6 సంవత్సరాల కిందటే అంటే 1892లో డబ్ల్యుటి స్టెడ్ అనే ఒక రిపోర్టర్ ఒక చిన్న కథ రాశాడు. ఆశ్చర్యకరంగా ఆయన కూడా షిప్ మునిగిపోవడం గురించి ముందుగానే రాశాడు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే నిజమైన టైటానిక్ షిప్ మునిగిపోయి మరణించిన 1503 మందిలో ఈ స్టెడ్ కూడా వున్నాడు.
***
టైటానిక్ షిప్ మునిగిపోయిన 23 సంవత్సరాల తర్వాత అంటే 1935లో ఏప్రిల్ నెలలో 'విలియం రీవ్స్' అనే ఒక నావికుడు ఇంగ్లాండ్ నుంచి కెనడాకు వెళ్తున్న ఒక ఓడలో ప్రయాణిస్తున్నాడు. ఆయన ఓడ డెక్ మీద నిల్చుని పరిసరాలను పరిశీలిస్తూ, ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. హఠాత్తుగా ఆయన మనసులో 'సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే టైటానిక్ షిప్ మునిగిపోయిన విషయాలు మెదిలాయి. దాంతో కలవరపడిపోయిన ఆయన గట్టిగా అరచి ఓడ కెప్టెన్‌ను అలర్ట్ చేద్దామనుకున్నాడు. కానీ మిగతా ప్రయాణీకులంతా తన ఆలోచనకు తనను గేలి చేస్తారేమోననే జంకుతో ఆ ప్రయత్నాన్ని బలవంతంగా విరమించుకున్నాడు. అకస్మాత్తుగా ఆయనకు ఆ రోజు ఏప్రిల్ 14 వ తేదీ అనే విషయం గుర్తొచ్చింది. అది అతని పుట్టిన రోజు. అంతేకాక టైటానిక్ షిప్ మునిగింది కూడా ఆ తేదీనే. అతనికి అంత బాగా ఎలా గుర్తుందంటే ఆయన టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజునే పుట్టాడు.దాంతో 'ఏమైతే అదే అవుతుంది' అనుకుని గట్టిగా కేక పెట్టాడు. ఆ కేక నౌక అంతటా ప్రతిధ్వనించింది. దాంతో నౌక వెంటనే ఆగిపోయింది. ...ఒక పెద్ద ఐస్‌బర్గ్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో...
ఆ నౌక పేరు 'ది టైటానియన్' కావడం ఇంకో విచిత్రం.