మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కి నితిన్‌ గడ్కరీ లీగల్‌ నోటీసులు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం కాంగ్రెస్‌ నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ని వక్రీకరించినందుకుగాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌లకి గడ్కరీ నోటీసులు పంపారు. ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన అసలు అర్థాన్ని, ఉద్దేశాన్ని దాచి 19 సెకన్ల వీడియోను కాంగ్రెస్‌ పోస్టు చేసింది. ఇది గందరగోళానికి గురిచేయడానికి, అపఖ్యాతిపాలు చేయడానికి కాంగ్రెస్‌ పాల్పడింది’ అని గడ్కరీ విమర్శించారు. ఈ లీగల్‌ నోటీసు అందిన 24 గంటల్లోగా సోషల్‌మీడియాలో ఆ పోస్టును తొలగించాలని కాంగ్రెస్‌ను కోరారు. దీనిపై మూడురోజుల్లోగా రాతపూర్వక క్షమాపణల్ని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

గడ్కరీ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. గ్రామాలు, పేదలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరు. గ్రామాలకు మంచి రోడ్లు లేవు. తాగడానికి నీరు లేదు. మంచి ఆసుపత్రులు, పాఠశాలలు లేవు.’ అని అన్నారు. కేవలం ఈ మాటలను మాత్రమే ఉన్న 19 సెకన్ల వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌పార్టీ సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోపై గడ్కరీ అభ్యరంతరం వ్యక్తం చేశారు.

➡️