నూతన ఎస్‌పిగా తుషార్‌ దూడి

Jan 30,2024 00:19

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు జిల్లా ఎస్‌పి ఆరీఫ్‌ హఫీజ్‌ బదిలీ అయ్యారు. ఇంటిల్‌జెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌కు ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా నూతన ఎస్పీగా కడప జిల్లా అదనపు ఎస్‌పిగా ఉన్న తుషార్‌ దూడి నియమితులయ్యారు. 2018 ఐపిఎస్‌ బ్యాచ్‌కు చెందిన తుషార్‌ శిక్షణ అనంతరం పలు జిల్లాల్లో పనిచేశారు. ఐఐటి చదివి ఆ తరువాత సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసిన తుషార్‌ 2018లో ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. గతరెండేళ్లుగా అదనపు ఎస్‌పి (అడ్మిన్‌)గా కడపలో పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో తుషార్‌ జిల్లా ఎస్‌పిగా నియమితులయ్యారు. రెండ్రోజుల్లో ఆయన బాధ్యతల స్వీకరిస్తారని తెలిసింది. మరోవైపు బదిలీ అయిన ఆరీఫ్‌ హఫీజ్‌ మూడేళ్లుగా జిల్లాలో పని చేస్తున్నారు. తొలుత ఎస్‌ఇబి అదనపు ఎస్‌పిగా, ఆ తరువాత అర్బన్‌ జిల్లా ఎస్‌పిగా, 2022 ఏప్రిల్‌ నుంచి విభజిత గుంటూరు జిల్లా ఎస్‌పిగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో మెతక వైఖరి అవలంభించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను కూడా ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నారు. టిడిపి కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపైనా వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధుల దాడి వ్యవహారాలపై ఉదాశీనంగా వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి చేసిన గంటల వ్యవధిలోనే 25 మందికి అదుపులోకి తీసుకున్న పోలీసులు, టిడిపి రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన వారి విషయంలో పూర్తిగా ఉదాశీనంగా ఉన్నారనే విమర్శలు ప్రభలంగా ఉన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కూడా ముందుచూపుతో వ్యహరించలేకపోయారు. ప్రజా ఉద్యమాలపై ముందుగానే ఉక్కుపాదం మోపడం, ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధంపై దృష్టి సారించే ఆయన కొంతమంది ఆందోళన కారులను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. సిఎం, ఇతర విఐపిలు అధికరగా ఉండే తాడేపల్లి ప్రాంతంలోనే నేరాల అదుపుపై దృష్టి సారించలేకపోవడం కూడా భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. పలుమార్లు సిఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చినా ఆందోళనకారులు అక్కడికి చేరువగా వెళ్లేవరకు నియంత్రించలేకపోయారని ఉన్నతాధికారుల నుంచి అసంతృప్తి గురయ్యారు. అవినీతి చేయకపోయినా కిందిస్థాయి అధికారుల అవినీతిని నియంత్రించలేకపోవడం పెద్ద వైఫల్యంగా నిలిచింది. ప్రధానంగా స్పెషల్‌ బ్రాంచిలో అవినీతి అక్రమాలపై మీడియాలో కథనాలు వచ్చిన తరువాత విచారణ చేసి చర్యలు తీసుకున్నారు.

➡️