Jan 24,2024 00:40

డ్వాక్రా మహిళలకు నాలుగో ఏడాది ఆసరాప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మహిళలు ఆయా పథకాలను సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సూచించారు. మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి వరుసగా నాలుగవ ఏడాది వైయస్సార్‌ ఆసరా క్రింద స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని సభ్యుల ఖాతాల్లో బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని గుంటూరు కలక్టరేట్‌ నుండి నుండి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.పురుషోత్తం, కృష్ణ బలిజ, పూసల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కోలా భవాని మణికంఠ, ఎ.పి.విభిన్న ప్రతిభావంతులు, సీనియర్‌ సిటిజన్‌ సహాయ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, డీఆర్డీఏ, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు హరిహరనాథ్‌, వెంకట నారాయణ లబ్థిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గత మూడు విడతల్లో రూ.739 కోట్లు విడుదల చేసిందని, నాలుగో విడతలో 29,392 స్వయం సహాయక సంఘాల్లోని 2,86,466 మంది లబ్ధిదారులకు రూ.247.22 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. బ్యాంక్‌ లింకేజీ ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఆసరా 4వ విడత సంబరాలపై రూపొందించిన గోడ పత్రిక, స్టికర్లను ఆవిష్కరించారు.

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, లబ్ధిధారులు పాల్గొన్నారు. జిల్లాకు విడుదలైన నిధుల వివరాలను నియోజకవర్గాల వారీగా కలెక్టర్‌ వివరించారు. చికలకూరిపేట నియోజక వర్గంలో 44635 మందికి రూ.36.57 కోట్లు, గురజాల నియోజకవర్గంలో 39703 మందికి రూ.25.20 కోట్లు, మాచర్ల నియోజకవర్గంలో 47367 మందికి రూ.40.50 కోట్లు, నరసరా వుపేట నియోజకవర్గంలో 37190 మందికి రూ.29.87 కోట్లు, పెదకూరపాడు నియోజక వర్గంలో 40340 మందికి రూ.31.16 కోట్లు, సత్తెనపల్లి నియోజకవర్గంలో 44458 మందికి రూ.37.87 కోట్లు, వినుకొండ నియోజకవర్గంలో 43434 మందికి రూ.30.51 కోట్లు, జిల్లా మొత్తంగా 30,296 స్వయం సహాయక గ్రూపుల్లోని 2,97,127 మందికి రూ.231.69 కోట్లను జమ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదార్లకు మెగా చెక్కును అందించారు.

➡️