Jan 22,2024 23:01
స్పందనలో సమస్యలకు పరిష్కారం

స్పందనలో సమస్యలకు పరిష్కారం ప్రజాశక్తి-అమలాపురంజగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబుతో కలిసి జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యతా క్రమంలో వినతులను సకాలంలో పరిష్కరిస్తూ స్పందన పని తీరు పట్ల అర్జీదారులలో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, సామాజిక భద్రత పింఛన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి సుమారు 156 అర్జీలు వచ్చాయన్నారు. జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి వినతినీ పరిశీలించి అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ఒకసారి ఒక అంశంపై సమర్పించిన అర్జీ మరలా అదే అంశంపై రీ ఓపెన్‌కు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించా లన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, గ్రామ వార్డు సచివాలయ నోడల్‌ అధికారి కె.భీమేశ్వర్‌, డిపిఒ వి.కృష్ణకుమారి, డిఎం అండ్‌ హెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర డిఎస్‌ఒ ఎ.పాపారావు, డిఇఒ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️