566 మంది వలంటీర్లు రాజీనామా

Apr 8,2024 22:33 #Resignations, #volunteers

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా 566 మంది వలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. ఎంపిడిఒ, సచివాలయ సెక్రటరీలకు తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల నేపథ్యంలో తాము విధులు నిర్వహించలేకపోతు న్నట్లు పలువురు వలంటీర్లు తెలిపారు. మరికొందరు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ సచివాలయం పరిధిలో 18 మంది వలంటీర్లు తమ రాజీనామా పత్రాలను సచివాలయ సెక్రటరీకి అందజేశారు. భోగాపురం మండలం గుడివాడ సచివాలయం పరిధిలో 18, కొత్తవలస మండల కేంద్రంలో 27 మంది, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మేజరు పంచాయతీ పరిధిలోని 1, 2 సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న 36 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా గంపలగూడెం మండలంలో 35 మంది, శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం లఖందిడ్డి, కోటబొమ్మాళి, హరిశ్చపురం, యలమంచిలి, ఎత్తురాళ్లపాడు పంచాయతీల్లో 60 మంది, రణస్థలం మండలం వల్లభరావుపేటలో పదిమంది, లావేరు మండలం గుమ్మడ పంచాయతీ లో17 మంది వలంటీర్లు రాజీనామా పత్రాలను అధికారులకు అంద జేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండల వ్యాప్తంగా 150 మంది, నంద్యాల జిల్లా వెలుగోడు లో 26 మంది రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మెల్లంపూడిలో 12 మంది, ఇప్పటంలో తొమ్మిది మంది, పెనుమాకలో 44 మంది, రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో 40 మంది, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకొడేరు గ్రామానికి చెందిన 14 మంది, ఏలూరు 16వ డివిజన్‌ అరుంధతిపేట 42వ సచివాలయానికి చెందిన 16 మంది, దెందులూరు మండలం పోతునూరులో 15మంది, నూజివీడు మండలం జంగంగూడెం గ్రామానికి చెందిన 16, ఉంగుటూరు మండలం బొమ్మిడిలో 12 మంది రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

➡️