యుటిఎఫ్‌ సీనియర్‌ నేత నరసింహమూర్తి మృతి

Jan 16,2024 22:53
యుటిఎఫ్‌ సీనియర్‌

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకుడు జుత్తుగ నరసింహ మూర్తి(79) మంగళవారం కాకినాడలోని ఆయన స్వగృహంలో వృద్ధాప్యంతో మృతి చెందారు. ఏడాదిగా ఆయన మంచానికే పరిమితమయ్యారు. కమ్యూనిస్టు భావ జాలం ఉన్న ఆయన అన్న నాగభూషణం చొరవతో నరసింహమూర్తి విద్యనభ్యసించారు. అనంతరం నరసింహమూర్తికూ కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందిన అనంతరం ఆయన యుటిఎఫ్‌లో చేరారు. పూర్తికాలం యుటిఎఫ్‌, ప్రజా సంఘాల పనికే వెచ్చించారు. యుటిఎఫ్‌ రాయవరం కమిటీ అధ్యక్షునిగా, కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. రాష్ట్ర కౌన్సిలర్‌గా బాధ్యతలు నెరవేర్చారు. అంనతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే సిపిఎం శాఖా కార్యదర్శిగా, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యునిగా సేవలందరించారు.

పలువురి నాయకుల నివాళి

జుత్తుగ నరసింహమూర్తికి సిపిఎం కాకినాడ రూరల్‌ కమిటీ నాయకులు నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై సిపిఎం మండల కన్వీనర్‌ తిరుమలశెట్టి నాగేశ్వరరావు అరుణపతాకాన్ని కప్పి నివాళులర్పించారు. పెద్దింశెట్టి రామకృష్ణ, సిహెచ్‌.విజరుకుమార్‌, జెఎస్‌కె సిహెచ్‌.అజరు కుమార్‌, సత్యనారాయణ రెడ్డి, సూర్యం, వి.చంద్రరావు, తటవర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం సంతాపం

జుత్తుక నరసింహమూర్తి మృతికి సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. నరసింహమూర్తి ఉపాధ్యా యునిగా పని చేస్తూ యుటిఎఫ్‌ నిర్మాణంలో చురుకైన పాత్ర నిర్వహించారన్నారు. యుటిఎఫ్‌ నాయకునిగా, సిపిఎం శాఖా కార్యదర్శిగా, ఆడిట్‌ కమిటీ సభ్యునిగా పని చేశారని తెలిపారు. నరసింహమూర్తి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

➡️