- ఆలీ అహమ్మద్
పౌర అధికారులకు అండగా సైన్యాన్ని తరలించినపుడు సైన్యం సకాలంలో సమర్ధవంతమైన చర్యలు చేపట్టగలిగితే పౌర కల్లోలాలను అరికట్టగలుగుతుంది. 2002 గుజరాత్ హత్యాకాండ సందర్భంగా సంక్లిష్టమైన మొదటి 24 గంటలు సైన్యానికి ప్రభుత్వం సహకరించలేదు.
'ద సర్కారీ ముసల్మాన్'-విద్యాధికుడైన ఒక సైనికుని జీవితంలో జ్ఞాపకాలు పేర ఈ గ్రంధం వెలువడింది. ఇది లెఫ్ట్‌నెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఆత్మకథ, జ్ఞాపకాల సమా హారం. సాధారణంగా ఇతర మిలిటరీ అధి కారుల ఆత్మకథల కంటే ఈగ్రంథానికి ఎక్కువ గుర్తింపు లభించింది. పలువురు మిలిటరీ వారి ఆత్మకథలకు కొద్దిగా భిన్నమైనది షా జీవిత గాథ. ప్రఖ్యాతిగాంచిన ఆలీఘర్ ముస్లిం యూనివర్శిటీ ఉన్నతాధికారిగా ఆయన బాధ్య తలు నిర్వహించటం కూడా అందుకు కారణం కావచ్చు. 'సర్కారీ' ముసల్మాన్ గ్రంథంలో 'ఆపరేషన్ పరాక్రమ్', 'ఆపరేషన్ అమన్' (2002 గుజరాత్ దారుణకాండ)ల గురించి పలు అంశా లను ప్రస్తావించటం ద్వారా కొన్ని ముఖ్యాం శాలను దేశ ప్రజల దృష్టికి తీసుకొని రావటానికి ఆయన ప్రయత్నం కృషి చేశారు.
గుజరాత్ పౌరఅధికారులకు తోడ్పడవల సిందిగా ఆ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు మిలిటరీ 'బీసన్ డివిజన్'కు నేతృత్వం వహిస్తున్న జమీరుద్దీన్ షా సానుకూలంగా స్పందించారు. విశ్వహిందూపరిషత్ అయోధ్యలో 'పూర్ణాహుతి' పేర 2002లో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగివస్తున్న హిందూ కరసేవకులు ప్రయాణిస్తున్న రైలు బోగీని 2002 ఫిబ్రవరి 27న గోద్రా వద్ద తగలబెట్టారు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను, గాయపడ్డవారిని అహ్మదాబాద్‌కు తరలించి విశ్వహిందూపరిషత్, బజరంగ్దళ్ సంస్థలకు అప్పగించారు. ఈ దుర్ఘటన గుజరాత్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించింది. నాటి నరేంద్రమోడీ నేతృత్వంలోని (బిజెపి) రాష్ట్ర ప్రభుత్వం మృతదేహాల అప్పగింతకు ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణ పరిస్థితుల్లో ఈ ఉదంతంలో షాకు ఇంతటి ప్రాధాన్యత లభించి ఉండేది కాదు. 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ సంఘటన అనంతరం 2002 జనవరి 12న అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల్లో అంగీకృత అంశాల అమల్లో పాక్ జాప్యం చేస్తున్నది. ఆ జాప్యాన్ని అరికట్టేందుకు, పాక్‌పై వత్తిడి పెంచేందుకు 'ఆపరేషన్ పరాక్రమ్' పేర భారత సైన్యం సరిహద్దుల్లో మోహరించి, తన విన్యాసాలను ముమ్మరం చేసింది. షా నేతృత్వంలోని పదాతిదళాన్ని హైదరాబాద్ నుండి తరలిం చారు. ఆ దళం జోధ్‌పూర్ సమీపంలోని ఎడారు ల్లో తన విధులను నిర్వహిస్తోంది. సైనికదాడుల్లో భాగంగా ముందుకు సాగేందుకు ఉత్తర్వుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఇదే కాలంలో అహమ్మదాబాద్ సైనిక శిబిరంలోని పదాతి దళాన్ని కూడా పాక్ సరిహద్దులకు తరలించారు.
షా తన గ్రంథంలో ఇలా పేర్కొన్నారు. ''ఫిబ్రవరి 28న సైనిక ప్రధానాధికారి సుందర రాజన్ పద్మనాభన్ నాతో ఫోన్లో మాట్లాడారు. మా పదాతి దళాన్ని వెంటబెట్టుకుని గుజరాత్ వెళ్లి అక్కడ జరుగుతున్న అల్లర్లను అరికట్టాలని ఆదేశించారు. అక్కడ మారణకాండ ఆరంభ మయిందని, 'ఆపరేషన్ అమాన్'ను ప్రారంభించి, పౌర అధికారులకు అండగా సైన్యాన్ని నిలిపి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
క్షమించరాని జాప్యం:
అదే రాత్రి షా నేతృత్వంలోని సైనిక డివిజన్‌ను విమానం ద్వారా అహమ్మదాబాద్‌కు తరలించారు. తీరా అక్కడకు చేరాక తన కర్తవ్య నిర్వహణకు అవసరమైన న్యాయమూర్తులు, వాహనాలు, స్థానిక పోలీసులతో సమన్వయం, గైడ్లు తదితరాలను సమకూర్చటంలో బాధ్యత తీసుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాం గం జాడే లేదు. గ్రంథంలో పేర్కొ న్నట్లు షా వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరు కున్నారు. అక్కడ ముఖ్యమంత్రి మోడీతోపాటు నాటి కేంద్ర రక్షణమంత్రి జార్జి ఫెర్నాం డెజ్ని కూడా కలుసుకోగలిగారు. అవసరమైన సహకారం అందించి, తమకు విధి నిర్వహణలో తోడ్పడాలని వారికి విజ్ఞప్తి చేశారు. తమ పౌర అధికార యంత్రాంగం ద్వారా అలాంటి సహ కారం అందిస్తామని కేంద్ర రక్షణమంత్రి సమక్షం లో మోడీ వాగ్దానం చేశారు. కానీ మరునాటి వరకూ ఆ వాగ్దానం అమలుకు నోచుకోలేదని షా తన పుస్తకంలో పొందుపరిచారు. జార్జి ఫెర్నాండెజ్ మాత్రం విమాన స్థావరంలో ఉన్న సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతిమంగా గుజరాత్‌కు చేరుకున్న తర్వాత 34 గంటల నిరీక్షణ అనంతరం అవసరమైన వాహనాలు సమకూరాయి. వాటిని వినియో గించుకుని సైన్యం రంగ ప్రవేశం చేసింది. 48 గంటల్లో మారణకాండను నిలుపుదల చేసింది.
సైనిక చర్య అనంతరం ఆపరేషన్ అమాన్ పై షా రూపొందించిన నివేదికపై సమాచార హక్కు కార్యకర్తలందరూ తమ దృష్టి సారించాల్సి వుంది. పౌర అధికార బృందం సహకారం తమ సైనిక విభాగానికి సకాలంలో అందకపోవటానికి కేవలం పౌర అధికారుల వైఫల్యమే కారణం కాదని షా తన పుస్తకంలో స్పష్టం చేశారు. గుజరాత్ లో ఈ సందర్భంగా జరిగిన మారణకాండ ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రభుత్వ సహకారంతో ఏకపక్షంగా జరిగిన దారుణ హింసాకాండ మాత్రమేనని షా ఎలాంటి పొరపాటు అవగాహ నలకు తావులేకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా పాఠకుల ముందుంచారు.
ఒక సైనిక ఉన్నతాధికారి సైతం 'కల్లోల జలాల్లో చేపలు పట్టినట్లు'న్న పరిస్థితులను శ్రద్ధగా గమనిస్తూ, తన విధి నిర్వహణ చేపట్టవలసిన పరిస్థితి రావటం నియంతృత్వ శక్తులు ఇష్టాను సారం బరితెగించిన కాలానికి సంకేతంగా నిలుస్తుంది.
సోహ్రబుద్దీన్ షేక్ పోలీస్ కస్టడీలోఉండగా హత్యగావించబడ్డాడు. ఈ ఘటనకు, గుజరాత్ హౌం మంత్రి హరేన్ పాండ్యన్ హత్యకు, గుజ రాత్ మారణకాండనుకప్పిపెట్టడానికి సంబంధం ఉన్నట్లు ఒక సాక్షి లిఖిత పూర్వక ప్రకటన స్పష్టం చేస్తోంది. అక్కడి పరిస్థితులను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్న షా ప్రకటనను బట్టి సత్యాన్ని అత్యంత నేర్పుగా కప్పిపుచ్చే ప్రయత్నం జరిగినట్లు అర్థం చేసుకోవచ్చు. మోడీ, అమిత్‌షా (ఆనాటి రాష్ట్ర హోం మంత్రి)తో సన్నిహిత సంబంధాలున్న గుజరాత్పోలీస్ అధికారి డి.జి. వంజరా హరేన్ పాండ్యా హత్యకు కుట్రపన్నినట్లు ఒక సాక్షి ప్రమాణపూర్వక ప్రకటన విదితం చేస్తోంది. గుజరాత్ మారణకాండలో రాష్ట్ర ప్రభుత్వం పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసినందుకు బిజెపిలో మోడీ ప్రత్యర్ధి హరేన్ పాండ్యాను హత్య చేశారు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదం, అనం తరం జరిగిన దాడులు ఈ రెండు నేరాలను ముస్లింలు ఒక పథకం ప్రకారం చేసిన హింసా కాండగా మితవాదులు అత్యంత విస్తృతంగా, పకడ్బందీగా ప్రచారం చేశారు. అల్ప సంఖ్యాకు లైన ముస్లింలనే కుట్రదారులుగా చిత్రించారు. తద్వారా ముస్లింలను ఆత్మరక్షణ స్థితికి నెట్టేయ గలిగారు.రాష్ట్ర ప్రభుత్వంలోని అసమ్మతివాదుల వాదన ఇలావుంది: 2002 ఫిబ్రవరి 27, తన అధికార నివాసంలో జరిగిన సమావేశంలో 'గత 72 గంటలుగా అధిక సంఖ్యాకుల కోపోద్రేకాలవల్ల జరిగిన ఘటనల్లో మీరు జోక్య చేసుకోవద్దు'అని పౌర అధికారులను, పోలీసులను మోడీ ఆదేశించారు. జకియా జాఫ్రి కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక పరిశోధనా బృందం (సిట్) బిజెపి అభిప్రాయాలనే అతి నాజూకుగా తన అర్ధరాత్రి మీటింగ్‌లో వండివార్చింది. (సెల్వాద్ 2018) గుజరాత్ మారణకాండలో మోడీ పాత్రపై సిట్ అంతిమ రిపోర్టులో సైన్యం మోహరింపుపై చేసి న ప్రస్తావనలను శుద్ధ అబద్దాలుగా పేర్కొంటూ వాటితో షా విభేదించారు. గుజరాత్‌కు సైన్యాన్ని రప్పించటంలో, సైన్యాన్ని కల్లోలిత ప్రాంతాలకు తరలించేందుకు ఫిబ్రవరి 28 మధ్యాహ్నం ఒంటి గంటను ఎంచుకోవటం లోను మోడీ చాలా మెళకువగా వ్యవహరిం చారని సిట్ కితాబునిచ్చింది. ఆ తరువాత 2.30 గంటలకు సైన్యానికి అవసరమైన వాహనాలు సమకూర్చి, సైన్యాన్ని పంపాల్సిన ప్రాంతాల ఎంపిక వంటి సహకారాలు అందిం చటంలో మోడీ నిర్ణయాలను సిట్ తెగ మెచ్చుకుంది. సైన్యం మోహరింపు మార్చి1న ఉదయం 11 గంటలకు ప్రారంభిం చినట్లు పొందుపరచిన సిట్ రిపోర్టులో షా తన పుస్తకంలో తప్పుబట్టారు. ఆయా సైనిక బృందాల యుద్ధ డైరీలు, రోజువారీ రికార్డులను పరిశీలిస్తే ఈ అంశంపై సులభంగా అంచనాకు రావచ్చునని షా అభిప్రాయపడ్డారు.
తన నేతృత్వంలోని 3 వేలమంది సైనికులు 2002 మార్చి1న రోజంతా అహమ్మదాబాద్ వైమానిక స్థావరంలో చేతులు ముడుచుకుని కూర్చోవలసివచ్చిందని, హింసాకాండ సాగుతున్న ప్రాంతాలకు వేగంగా సైన్యాన్ని తరలించటంలో జరిగిన జాప్యానికి అక్కడి ప్రభుత్వ వైఫల్యమే కారణమని షా ఆరోపిస్తున్నారు. షా తన రాత పూర్వక ప్రకటనలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి పై అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. సైనిక బృందం ఫిబ్రవరి 27, మార్చి1వ తేదీల మధ్య 72 గంటలు బలవంతపు నిరీక్షణ అనంతరం మార్చి2న రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చర్యలకు ఉపక్రమించింది.
షా బహిర్గతం చేసిన అంశాలు గుజరాత్ మారణకాండ గురించి విస్తృతంగా ప్రచారం చేయబడిన కథనాలపై పలు అనుమానాలకు దారితీశాయి. రాజకీయంగా పరిశీలిస్తే ఒక శక్తి సంపన్నుడైన, తిరుగులేని నాయకుడిగా ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై ఉన్న నమ్మకంపై జాతీయస్థాయిలో నీలి నీడలు ఆవరించాయి. గుజరాత్ కార్యక్రమాన్నంతటినీ అత్యంత సాహసోపేతంగా నడిపిన ధీరుడిగా మోడిని సైద్ధాంతికంగా సమర్థించే హిందూత్వ అనుయాయులు ప్రచారం చేసుకొంటున్నారు. ఈ పరిస్థితిని ఆధారం చేసుకుని మరోసారి ప్రజలు తనకు కేంద్రంలో అధికారాన్ని కట్టబెట్టడం ఖాయమని మోడీ ధీమాగా ఉన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మోడీ నిజస్వరూపం బయటపడటం పట్ల బిజెపి ఆందోళన చెందుతున్నది. ఈ ప్రమాదాల నుండి బయటపడేందుకు ప్రజలను నమ్మించగలిగే ఏదో ఒక సైద్ధాంతిక పిలుపుతో ప్రజలముందుకు రావటం బిజెపికి అనివార్యమౌతుంది.
పెద్ద నోట్లరద్దు, ఉపాధి రహిత అభివృద్ధి, రైతాంగం ఆత్మహత్యలు, రూపాయి విలువ పతనం, కాశ్మీరీ యువత రాళ్లు రువ్వటంతో ఎదురయ్యే సవాళ్లు, పాకిస్థాన్, చైనాల పట్ల అవలంబిస్తున్న విదేశాంగ విధానంలోని పిల్లి మొగ్గలు తదితర అంశాల్లో వరుసగా పలు విధానపరమైన వైఫల్యాలు మోడీ ప్రభుత్వంలో బహిర్గతమౌతున్నాయి. వివిధ పరిణామాల వలన జరుగుతున్న విభజనలు తనకు ఉపకరిస్తాయన్న బిజెపి ఆశలను పై వైఫల్యాలు మింగేస్తాయి. రాజకీయ బలాబలాల్లో వస్తున్న మార్పుల ఫలితంగా తమ పార్టీ మరో 50 సంవత్సరాలు అధికారంలో కొనసాగటం ఖాయమని అమిత్‌షా అంచనా లేస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరో అడుగు ముందుకేసి దేశ భద్రతను పటిష్టపరచిన బలమైన నాయకత్వం (బహుశా మోడీ) మరో పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. మరోమారు మోడీ ప్రభుత్వం కొనసాగడమంటేే భారతీయ బహుళత్వ విలువలకు, ప్రజాస్వామ్య, రాజకీయ సంస్కృతికి, సామాజిక రంగంలో సమ్మిళిత పరిస్థితులకు తిరుగులేని ఎదురుదెబ్బ తగలటం ఖాయమని నిరూపితం కావటమే.
సైన్యం స్పందనలు: తమ కృషికి అండగా నిలవాలన్న పౌర అధికారుల పిలుపులకు సైన్యం ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయన్న అంశాన్ని పున:పరిశీలించేందుకు ఇది సరైన సమయం. ఒక టౌన్ హాల్లో జరిగిన సైనిక సమ్మేళనంలో నాటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ పాల్గొ న్నారు. సైన్యంతో కలిసి రొట్టెలు భుజించారు (చార్‌ఖానా). గుజరాత్లో సైన్యం సేవల పట్ల తన పాత్ర గురించి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గుజరాత్ హింసాకాండను అరికట్టేం దుకు సైనిక సహకారం తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన నచ్చచెప్పగలిగారు. కానీ 'సాంస్కృతిక జాతీయవాదులు' అవిచ్ఛిన్నంగా, ఏకపక్షంగా కొనసాగించిన 72 గంటల రక్త పాతం అనంతరమే ఫెర్నాండెజ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తద్వారా ఈ 'జాతీయ వాదులు' తమ దుర్భలత్వాన్ని, భీరత్వాన్ని నిరూపించుకున్నారు. ఆ 72 గంటల వ్యవధిలో సైన్యం వైమానిక స్థావరంలో ఎదురుచూపులతో కూర్చుండి పోయింది. సామూహిక హత్యాకాండకు, తీవ్ర మైన నేరాలకు, శిక్షల నుండి తప్పించుకు పారిపోయేందుకు ఇదే సమయాన్ని 'అపర జాతీయవాదులు' వినియోగించుకున్నారు.
గుజరాత్ హింసాకాండను అరికట్టడంలో సైన్యం సాహసోపేత చర్యలను తన పుస్తకంలోని ఒక అధ్యాయంలో షా ఆసక్తికరంగా వివరిం చారు. మిలిటరీ నిబంధనల చట్టం చాప్టర్7లో, పౌర అధికార యంత్రాంగానికి అండగా బాధ్యతలు నిర్వహణ విభాగంలో 15 నుండి 20 పేరాల్లో (ఇండియన్ ఆర్మీ 1987:109) ఇలావుంది. సైన్యం అండతో కూడా పౌర అధికారులు ''తీవ్రమైన కల్లోల పరిస్థితుల''ను అదుపు చేయలేని పరిస్థితుల్లో సైనికపాలన (మార్షల్ లా) విధించే అధికారం సైన్యానికుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందేందుకు అవకాశం లేనపుడు, ఒక మిలిటరీ కమాండరు శాంతిభద్రతల పరి స్థితిని చక్కదిద్దేందుకు తన అధికారాలను ఉప యోగించుకునేందుకు ఆ చట్టం అవకాశమి స్తోంది. (ఇండియన్ ఆర్మీ-109). షా ఇలా పేర్కొన్నారు: ''మార్షల్ లా అమలు పరచాలన్న ఆలోచన నా మనసులో మెదిలింది. నాకప్ప గించిన బాధ్యతల పరిధిలో ఆ అంశం లేదు. శాంతిభద్రతలు అదుపు తప్పినపుడు మేజిస్ట్రేట్ లేకున్నా కాల్పులు జరిపే అధికారాన్ని ఆ చట్టం సైన్యానికిచ్చింది. కానీ పై అధికారి నాకప్పగిం చిన బాధ్యతల పరిధిని దృష్టిలో ఉంచుకొని అందుకు పూనుకోలేకపోయాను.
పోట్లగిత్త కొమ్ములు లంకించుకుని విచక్షణా జ్ఞానంతో దాన్ని అదుపులోకి తేవటం తనవంటి సైనిక జనరల్‌కు అసాధ్యమేమీకాదని షా తన గ్రంథంలో తెలిపారు. తన నేతృత్వంలోని పదాతి దళం లక్ష్యం కల్లోల ప్రాంతాన్ని చుట్టు ముట్టడం, పరిస్థితిని అదుపులోకి తీసుకోవటం, శతృవును నాశనం చేయటంగా ఉందని పేర్కొ న్నారు. కానీ ఈ సందర్భంగా శతృవులు సామూ హికంగా మారణకాండ సాగించి శిక్ష నుండి తప్పించుకున్నారని ప్రత్యేకంగా చెప్పారు. ''అహమ్మదాబాద్ వైమానిక కేంద్రంలో వేచివున్న సైనిక పటాలానికి దగ్గరగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవలసి వచ్చింది''అని షా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజు ముందుగా తమ బెటాలియన్‌కు నగరంలో ప్రవేశించే అవకాశం ఇచ్చివుంటే మృతుల్లో మూడోవంతు, అంటే కనీసం 300 మందికి పైగా కాపాడి ఉండేవారమని షా మననం చేసుకున్నారు.
దేశవ్యాపితంగా, ప్రాంతీయంగా సైనిక ప్రధాన కేంద్రాలు, ఉప కేంద్రాలున్నాయి. గుజరాత్ సమీపంలోని నాగపూర్‌లో కూడా ఒక ప్రాంతీయ సైనిక కేంద్రం ఉంది. ఈ కేంద్రాలు తమ పరిధిని పౌర అధికారులకు అవసరమైన పుడు తోడు కావలసివుంది. నాగపూర్ బెటాలి యన్ కూడా ఆపరేషన్ పరాక్రమ్‌కు తరలించ బడింది. కానీ సరిహద్దు నుండి గుజరాత్‌కు తరలించబడిన షా బెటాలియన్‌కు సహకరించేం దుకు అవసరమైన కమాండర్స్ను, ఆపరేషన్ స్టాఫ్ అధికారులను కేటాయించకపోవటం సైనిక పరంగా జరిగిన లోపం. కల్లోలిత ప్రాంతాల్లోని పరిణామాలను సైన్యంతో సంభాషించగల సివిల్, పోలీస్ అధికారుల సహకారం తగువిధంగా లభించకపోవటం మరో సమస్య.
పశ్చిమ సరిహద్దులోని తన పైఅధికారి, జోధ్‌పూర్ సైనిక బృందం కమాండెంట్ పర్య వేక్షణలో షా పనిచేశారు. ఆవిధంగా సదరన్ కమాండ్ సైనిక కేంద్రం కూడా ఈ వైఫల్యంలో తనవంతు బాధ్యతల నుండి తప్పుకోజాలదు.
ప్రభుత్వ సంస్థలు గతంలో ఏనాడూ లేనివిధంగా వత్తిడికి గురిచేయబడ్డాయి. భారత్‌లో పోలీస్ కస్టడీ మరణాల కేసులు పెరుగుతున్నాయి. ''చట్టవిరుద్ధమైన ఆదేశాలతో పోలీస్ వ్యవస్థను కట్టడిచేస్తున్నట్లు ఈ సందర్భంగా హషింపురా కోర్టు వ్యాఖ్యానించడాన్ని గమనంలో ఉంచుకోవాలి. పాలనా యం త్రాంగం కాషాయ శక్తుల ప్రభావంలో నడుస్తున్న దనేందుకు ఉత్తరప్రదేశ్, సజీవ ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఎన్నికల కోణంలో ప్రాధాన్యతగల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మైనారిటీ వ్యతిరేకత ను నరనరానా జీర్ణించుకున్న ఒక మతాధిపతి (మహంత్)గా మనకు తెలుసు. రామమందిరం సమస్య, జాతీయ పౌర రిజిష్టరు, చేజారుతున్న కాశ్మీరు సమస్య, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు, ఇలాంటి కీలక రాజకీయ సమస్యలతో దేశం రక్తమోడుతోంది.
షా రాతపూర్వక ప్రకటనల నుండి సైన్యానికి సంబంధించి ముందు జాగ్రత్తపరంగా నేర్చుకో వలసిన గుణపాఠాలేమిటి? సైనిక నిబంధనల చట్టం (ఎం.ఎం.యల్.) చాప్టర్ 7ను అనుస రించి సైన్యానికున్న అధికారాలను, గుజరాత్లో షా సైనిక బృందం చొరవను కట్టడి చేసి గందరగోళానికి దారితీసిన కారణాలను స్పష్టంగా పునఃపరిశీలించాలి. ఈ ప్రక్రియను ఎంత త్వరగా చేపడితే అంతగా మేలు జరుగుతుందని దేశ రాజకీయాల్లో నెలకొన్న సైద్ధాంతిక అస్థిరత ను బట్టి అర్థమౌతోంది.
- (అనువాదం: వై సిద్ధయ్య)