524 సిమెంట్‌ బస్తాలు గోల్‌ మాల్‌

Jan 10,2024 21:19

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని తునివాడ గ్రామంలో పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాల నూతన నిర్మాణాలకు సిమెంటు పంపిణీ చేసినప్పటికీ అక్కడ నిర్మాణం జరగకపోయినా 1.52 లక్షల రూపాయల విలువ గల 524 బస్తాలు మాయం కావడంతో సామాజిక తనిఖీ ప్రజావేదికలో సిమెంట్‌ వ్యవహారం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో 1,778 పనులకు సంబంధించి 19.83 కోట్ల రూపాయలకు సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజా వేదికకు ప్రొసీడింగ్‌ డుమా అధికారి లక్ష్మణరావు, ఎపిడి ఎం శ్రీనివాసరావు, జిల్లా విజిలెన్స్‌ అధికారి పి. వెంకటరమణ హాజరై పరిశీలించారు. పంచాయతీరాజ్‌ 27 పనులు, ఆర్డబ్ల్యూఎస్‌ 11 పనులు, ఎస్‌ఎస్‌ఎ 3 పనులు, ఈజీఎస్‌ 1737 పనులకు రూ.19.83 కోట్లు ఖర్చు చేయడంపై ప్రజా వేదిక నిర్వహించారు. తునివాడ గ్రామానికి సంబంధించి హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలు చేపట్టకుండా సిమెంట్‌ పక్కదారి పట్టినట్టు తెలుగులోకి వచ్చింది. ఖండ్యాం పంచాయతీలో కన్య పంచాయితీలో 74 సిమెంట్‌ బస్తాల లెక్క తేలడం లేదని వెలుగులోకి వచ్చింది. పంచాయతీ రాజ్‌ జెఇ రామకృష్ణ మాట్లాడుతూ సిమెంటు ఒక పంచాయతీ నుంచి వేరొక పంచాయతీకి సర్దుబాటు అయిందని తెలిపారు. మస్టర్లలో సంతకాలు, నిశానీలు లేకుండా పేమెంట్‌ ఇచ్చినట్లు వెలుగు చూశాయి. లక్ష్యంపురం లో మీసాల వరలక్ష్మికి హాజరులో 6 రోజులు దిద్దుబాట్లు చేయడంతో అదనంగా 1,320 రూపాయలు చెల్లించినట్లు వెలుగులోకి వచ్చింది. చెరువు కొలతల్లో తేడాలు కారణంగా రెండు వారాలు నగదు జమమైనట్లు వెల్లడైంది. తునివాడ, కందిస, చాటాయివలస గ్రామాల్లో వేతన దారుల మస్టర్‌ సీట్లో సంతకాలు, నిసానీలు లేకుండా బిల్లులు చెల్లించడం పై అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కందివలసలో రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు లేకపోయినా బిల్లు డ్రా అయినట్లు తెలిపారు. సోమరాజుపేటలో రూ.25,400లకు సంబంధించి పని వర్కు బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఆ నగదు పరిస్థితి ఏంటని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇన్ని జరిగినా ప్రభుత్వ నిధులు ఎంతమేర అవకతవకలు జరిగాయో అధికారులు వెల్లడించెకపోవడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి వావిలాపల్లి జగన్‌ మోహన్‌ రావు, ఎంపిడిఒ శ్యామల కుమారి, ఎపిఒ సంకాబత్తుల హరినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️