Jan 7,2024 21:18

ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురంస్వాతంత్రం వచ్చి నేటికి 77 ఏళ్లు గడుస్తున్నా నేటికీ గిరిజన జీవితాల్లో సంక్రాంతులు కాన రావడంలేదు. అభివృద్ధికి నోచుకోక నిత్యం సమస్యలతో గిరిజనులు సహజీవనం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారుతున్నా గిరిజన జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. నేటికీ అనేక గిరిజన గ్రామాలకు రహదారి సాకర్యం లేని దుస్థితి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్యం నిమిత్తం డోలిమోతలే శరణ్యమయ్యాయి. అలాగే స్వచ్ఛమైన తాగు నీరందని పరిస్థితి. దీంతో చలములు, గెడ్డవాగులు నీటిపైనే ఆధారపడుతూ బతుకు జీవనం సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడ పుట్టి, వనకాబడి, జోగి పురం, శంభు గూడ, వాడ జంగి, ఇజ్జ కాయి, టంకు, గుల్ల లంక, మంత్ర జోల, చిన్న రావి కోన, కొండ బిన్నిడి, బయ్యాడ తదితర మారుమూల కొండ శిఖర గ్రామాల ప్రజలు నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రహదారి సౌకర్యం లేకపోవడంతో కాలిబాటే శరణ్యమవుతోంది. మరోవైపు పెద్దపెద్ద వాహనాలు గ్రామానికి వెళ్లలేక పోవడంతో తాగునీటి బోర్ల నిర్మాణం జరగలేదు. దీంతో గిరిజనులు చలమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం వాటిల్లితే అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందని పరిస్థితి. దీంతో తరచు మరణాల సంఖ్య కూడా అధికంగా నమోదు కావడం విచారకరం. గర్భిణీలు, వృద్ధులు వైద్యం కోసం రావాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. గిరిజన విద్యార్థులకు విద్య కూడా అందని ద్రాక్షగానే ఉంటుంది. కొండల మీద గ్రామాలకు అధికారులు పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో చాలా వరకు విద్యార్థులు డ్రాపౌట్‌ సంఖ్య కనిపిస్తోంది. పై గ్రామాల నుంచి గిరిజనులు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రానికి వెళ్లిరావాలంటే కనీసం ఒక రోజు పడుతుంది. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాతో నైనా తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుంటారని గిరిజనులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. వెనుకబాటు జీవితం… కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో నేటికీ గిరిజనులు వెనుకపడి జీవనం గడుపుతున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు మెరుగుపడలేదు. అధికారులు స్పందించి రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పువ్వల తిరుపతి రావు, ఎపి గిరిజన సంఘం మండల కార్యదర్శి, గుమ్మలక్ష్మీపురం. గిరిజనుల పట్ల చిన్నచూపు…ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజనుల పట్ల చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. గిరిజన అభివృద్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్న ఆచరణలో ఎక్కడ కాని రావడం లేదు.కోలక అవినాష్‌ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులునేడు ఐటిడిఎ డిఇ కార్యాలయం వద్ద ధర్నా గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ గ్రామా లకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం గుమ్మలక్ష్మీపురం మండల భద్రగిరి ఐటిడిఎ డిఇ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ధర్నా జరగనుంది. ఏజెన్సీలోని దేరువాడ నుండి వనకాబడి, దేరువాడ నుండి వండిడి, జర్న నుండి దిగువ చోరుపల్లి, బబ్బిడి నుండి ఎగువ చోరుపల్లి, నోండ్రుకోన నుండి శంభు గూడ, కుశబడి నుండి బబ్బిడి, గండపాక నుండి గుల్లలంక, కిత్త లంబ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ ధర్నా చేపట్టనున్నట్టు సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు ధర్నాకు గిరిజనులంతా అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.రోడ్డు లేదు.. తాగునీరు రాదు..

➡️