- ఎస్. వెంకట్రావు
''సుదీర్ఘ కాలం నయా-ఉదారవాద సంక్షోభం ఒత్తిడి ప్రభావం కొనసాగుతుండడం వల్ల, 21వ మహాసభలో మనం గుర్తించినటు వంటి సామ్రాజ్యవాద శిబిరంలో ఐక్యత పెరగడం, వారి మధ్య వైరుధ్యాలు మొద్దుబారడం ఈ కాలంలో బలహీన పడి, సామ్రాజ్యవాద కేంద్రాల మద్య కొత్త ఘర్షణలు, వైరుధ్యాలు తలెత్తుతున్నాయి'' అని హైదరాబాదులో ఈ ఏడాది ఏప్రిల్ 18 నుండి 22 వరకు జరిగిన సిపిఐ(ఎం) 22వ మహాసభ ఆమోదించిన రాజకీయ తీర్మానం పేర్కొన్నది.
పార్టీ మహాసభ పరిశీలనను బలపరిచే పరిణామాలు ప్రపంచవ్యాపితంగా ఈ కాలం లో, ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో చాలా త్వరత్వరగా జరిగాయి. అందులో అమెరికాకూ, యూరోపియన్ యూనియన్, కెనడాల మధ్య, అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడం, కెనడాలో జరిగిన జి7 సమావేశం విఫలం కావడం ప్రధానమైన పరిణామాలు. ఈ వాణిజ్య యుద్ధాల మధ్య సైనిక నాదాలు కూడా వినిపించడం ప్రపంచానికి ప్రమాద సూచికలు.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వుతూనే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా తో దాదాపు అన్ని దేశాలూ అన్యాయమైన పద్ధతుల్లో వాణిజ్యం నెరుపుతున్నాయని, దాని వల్ల అమెరికాకు అన్ని దేశాల నుండి దిగుమతులు పెరిగిపోయి ఎగుమతులు తగ్గుతున్నాయని ట్రంప్ వాదిస్తూ వస్తున్నారు. అందువల్ల ఒక నాడు ఏ అమెరికా అయితే డంకెల్ ముసాయిదా అధారంగా అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)ను నెలకొల్పిందో ఆ సంస్థ నిబంధన లనే మార్చాలని, లేకుంటే అమెరికా బహుళపక్ష అంతర్జాతీయ వాణిజ్యం నుండి తప్పుకుంటుం దని హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలను మొదటిగా ప్రారంభించిందీ, ముందుకు నడుపు తున్నదీ అమెరికానే. తొలుత చైనా మీద ఎక్కుపెట్టిన వాణిజ్య సుంకాల అస్త్రాన్ని తరువాత ఆయన తన సామ్రాజ్యవాద మిత్రులైన ఇయు, కెనడా, జపాన్ల మీద, చివరికి ప్రపంచ దేశాల న్నిటిపైనా ఎక్కుపెట్టారు. చైనా, ఇతర దేశాల నుండి ఉక్కు దిగు మతులు అమెరికా దేశ రక్షణకు ప్రమాదకరంగా ఉన్నాయా అన్న అంశాన్ని దర్యాప్తు చేయాలని 2017 ఆగస్టులో ట్రంప్ ఆదేశించినప్పుడే ఆయన వాణిజ్య యుద్ధా లకు తెరతీస్తున్నారని అందరికీ అర్ధమైంది.
2018 జనవరిలో ఆయన చైనా, ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే సౌర ఫలకాలు, వాషింగ్ మెషిన్ల మీద దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా మొదటి తూటాను పేల్చి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు.
మార్చి 1న ''ఆయన వాణిజ్య యుద్ధాలు మంచివే'' అని ట్వీట్ చేస్తూ ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకా లను చైనాపై ప్రధానంగా ఎక్కుపెట్టినప్పటికీ వాటి ప్రభావం భారత్, ఇయు ఇతర దేశాలపై కూడా పడింది. దాంతో ఇయు అధ్యక్షుడు జీన్-క్లాడే జుంకర్ మార్చి 3న ఒక ప్రకటన చేస్తూ ఉక్కుపై అమెరికా సుంకాలు విధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. దీనికి ప్రతీకారం గా ఇయు కెంటుకీ చికెన్, లెవీ జీన్స్, హార్లే డేవిడ్సన్ మోటారు వాహనాలపై సుంకాలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కాని ట్రంప్ ఆ హెచ్చరికలు లెక్క చేయ లేదు. ఇయు గనుక ప్రతీకార చర్యలకు పాల్పడితే ఆ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకా లు విధిస్తానని మరునాడే ప్రకటించారు. ఈ విధంగా ఒకరి వస్తువులపై మరొకరు సుంకాలు విధించుకుంటూ పోతే ప్రపంచ వ్యాపితంగా మాంద్యం సంభవిస్తుందని డబ్ల్యుటిఓ అధ్యక్షుడు హెచ్చరించారు. ట్రంప్ చర్య అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రమైన దాడి అని చైనా పేర్కొంది. చైనా తమ దేశం నుండి టెక్నాలజీని తస్కరి స్తోందని ట్రంప్ మార్చి నెల చివరిలో ఆరోపించారు. చైనా దానిపై తీవ్రంగా స్పందిం చింది. అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభింస్తే మేము ''చివరివరకు పోరాడతాం.. అన్ని రకాల చర్యలు తీసుకుంటాం'' అని పేర్కొంది. ''ఇటువం టి దుస్సాహసానికి పాల్పడవద్దని మేము అమెరికాను కోరుతున్నాం...అదే జరిగితే చివరికి దానివల్ల నష్టపోయేది అమెరికానే'' అని అమెరికాలో చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.
ఏప్రిల్ 2న చైనా ప్రతీకార చర్యలు ప్రకటించింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే పళ్లు, కాయలు, మద్యం, ఉక్కు గొట్టాలతో సహా 120 అమెరికా వస్తువులపై 15 శాతం సుంకా లు విధించింది. అమెరికా పంది మాంసం, రిసైకిల్డ్ అల్యూమినియంపై 25 సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
మరునాడు చైనాకు చెందిన 1,300 వస్తు వులపై 25 శాతం చొప్పున మొత్తం 3,50,000 కోట్ల రూపాయల సుంకాలను అమెరికా వాణిజ్య శాఖ విధించింది. దెబ్బకుదెబ్బ అంటూ అంతే విలువ మేరకు అమెరికా వస్తువులపై చైనా సుంకాలు విధించింది.
ఏప్రిల్ 16న చైనా టెక్నాలజీ కంపెనీ అమెరికాకు చెందిన కంపెనీ విభాగాలను కొను గోలు చేయకుండా ట్రంప్ ప్రభుత్వం 7 ఏళ్లు నిషేధం విధించింది. దీనికి ప్రతీకారంగా అమె రికా నుండి దిగుమతయ్యే జొన్నలపై చైనా 179 శాతం సుంకం విధించింది.
ఈలోగా ఇయు, కెనడా, మెక్సికోల నుండి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధించే తేదీని ట్రంప్ ప్రభుత్వం జూన్ 1 వరకు పొడిగిస్తూ ప్రకటించింది. ఈ సుంకాలపై అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లతో అమెరికా విడిగా ఒప్పందం చేసుకుంది. అమెరికా సుంకాల వల్ల తమ వస్తువుల ఎగుమతులు దెబ్బతింటా యని రష్యా, జపాన్ డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేశాయి. భారతదేశం కూడా ఉక్కు, అల్యూమిని యంపై అమెరికా సుంకాల విధింపుకు వ్యతిరేకం గా ఫిర్యాదు చేసినట్లు డబ్ల్యుటిఓ మే 23న తెలిపింది.
అమెరికా గనక తమ సరుకులపై సంకాలు విధిస్తే తాను కూడా ప్రతీకారంగా అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తానని కెనడా ప్రకటిం చింది. అమెరికా చర్యకు ప్రతీకారంగా మెక్సికో జూన్ 5న అమెరికా నుండి దిగుమతయ్యే ఉక్కు, పందిమాంసం, చికెన్ ఇతర సరుకులపై భారీగా సంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
జులై 15న అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం చైనా నుండి దిగుమతయ్యే వస్తువులపై మరో రూ.2,30,000 కోట్ల సుంకా లు విధించింది. దీనికి ప్రతీకారంగా అమెరికాకు చెందిన 659 రకాల వస్తువులపై రూ. 3,50,000 కోట్ల సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. మరో 14 లక్షల కోట్ల రూపాయ ల విలువైన చైనా వస్తువులపై 10 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదించారు.
భారతదేశం కూడా ట్రంప్ వాణిజ్య యు ద్ధం వల్ల తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేం దుకు అమెరికా నుండి దిగుమతయ్యే ఆల్మాండోల పైనా, ఇతర వస్తువులపైనా దిగుమతి సుంకాలు పెంచింది. మరో 29 అమెరికా వస్తువులపై అదనపు దిగుమతి సుంకాలు ప్రకటించింది.
జూన్ 22వ తేదీన ట్రంప్ తన ఆస్త్రాన్ని ప్రత్యేకంగా ఐరోపా యూనియన్ మీదికి ఎక్కు పెట్టారు. ఇయు దేశాల్లో అసెంబుల్ అయ్యే కార్లపై 20 శాతం, ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తానని ఆయన ప్రకటిం చారు. దీనిపై ఇయు తీవ్రంగా స్పందించి, ప్రతీకార చర్యలకు సిద్ధపడింది.
కుప్పకూలిన జి7 శిఖరాగ్ర సభ
ట్రంప్ ప్రారంభించిన వాణిజ్యయుద్ధం వల్ల మొత్తం ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కుప్ప కూలుతుందన్న భయాలు ఏర్పడ్డాయి. అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కంపనలకు గురయ్యాయి. అనేక కంపెనీలు నష్టాల పద్దులు ప్రకటించాయి. ఉద్యోగితకు ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యం లో కెనడాకు చెందిన క్వెబెక్ రాష్ట్రంలోని చార్లెవోక్స్లో జరిగిన జి7 దేశాల వాణిజ్య మం త్రుల సమావేశం, అనంతరం జరిగిన శిఖరాగ్ర సభ అంతర్గత తగాదాలతో కుప్పకూలి పోయింది. సామ్రాజ్యవాద దేశాలతో 1975లో ఏర్పడిన జి7 తీవ్రమైన కలహాలతో ఉమ్మడి ప్రకటన కూడా చేయకుండా ముగియడం ఇదే ప్రధమం. శిఖరాగ్ర సభ చివరి రోజు ట్రంప్‌ను ఇతర దేశాల నేతలు చుట్టుముట్టడమే కాకుండా జర్మన్ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ట్రంప్ టేబుల్ పై వాలి ఆయనతో తీవ్రంగా వాదిస్తున్నట్లున్న ఫోటో ప్రపంచ మీడియాలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఈ దృశ్యమే సామ్రాజ్యవాద ప్రపంచంలో ట్రంప్ ఎంతగా ఒంటరి పాట య్యాడో తెలియజేస్తోంది.
ఈ సభకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ మాట్లాడుతూ అవసర మైతే అమెరికా లేకుండా ''6 దేశాల తుది ప్రకటన'' విడుదల చేద్దాం అని ప్రకటించారు. ట్రంప్ వాణిజ్య రక్షణ విధానాలను, ఇయు, కెనడా, మెక్సికో వస్తువులపై విధించిన సుంకాలను మిగిలిన దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే సభ చివరిలో ఒక రాజీ ప్రకటన విడుదల చేసింది. అందులో ఒకవైపు వాణిజ్య రక్షణ విధానాలను ఖండిస్తూనే మరోవైపు అమెరికాను సంతృప్తి పరచడం కోసం డబ్ల్యుటిఓ నిబంధనలను కూడా విమర్శించింది. ఈ సంయుక్త ప్రకటనపై ట్రంప్ కూడా సంతకాలు చేయాల్సి ఉంది. కానీ శిఖరాగ్ర సభ తరువాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ ప్రకటనపై సంతకాలు చేయకుండానే సింగపూర్ బయలు దేరి వెళ్లిపోయారు. (అక్కడ ఉత్తర కొరియా నేత కిమ్ ఇల్ ఉన్‌తో ఆయన సమావేశ మయ్యారు.) పత్రికా గోష్టిలో ట్రూడూ అమెరికా వాణిజ్య రక్షణ విధానాలను ఖండించడం, అమెరికా వస్తువులపై కెనడా రూ. 1.12 లక్షల కోట్ల దిగుమతి సుంకాలు విధించి తీరుతుందని ప్రకటంచడం ట్రంప్‌కు కోపం తెప్పించింది. ''ఇతర దేశాలు అమెరికా వస్తువులపై సుంకాలు విధించానికి అనుమతించే ప్రసక్తే లేదు'' అని ట్రంప్ అహంకారంగా పేర్కొన్నారు.
యుద్ధ నాదాలు రాజీ యత్నాలు
ఒక వైపు అమెరికాకూ ఇతర దేశాలకూ మధ్య చర్యలు, ప్రతీకార చర్యలతో వాణిజ్య యుద్ధం సాగుతుండగానే మరోవైపు రాజీ యత్నాలు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వాణిజ్య యుద్ధం వల్ల ఇతర దేశాలతో పాటు అమెరికా కంపెనీలు, అమెరికా ఆర్థిక వ్యవస్ధ కూడా నష్టపోతుందని ఆ దేశంలోని మీడియా, రాజకీయ నాయకులు, వాణిజ్య సంస్థలు ఆందోళన ప్రారంభించాయి. చైనా నుండి దిగుమతులు ఆగిపోతే అమెరికాలో వస్తువుల ధరలు పెరగడమే కాదు వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. అమెరికా పోర్టుల్లో అధికభాగం కార్యకలాపాలు తగ్గిపోతాయి. పరిశ్రమలకు మూతపడతాయి. ఫలితంగా అమెరికాలో లక్షలాది ఉద్యోగాలకు ఎసరు వస్తుందని అనేక మంది నిపుణులు చెబు తున్నారు. ఒక్క అమెరికా మీదనే కాదు చైనా, ఇయు, భారత్‌తో సహా అనేక దేశాలపై దీని ప్రభావం ఉంటుంది. అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉందని డబ్ల్యుటివో అధినేత హెచ్చరించారు. చైనాపై ట్రంప్ వాణిజ్యయుద్ధం లో అమెరికా, ఐరోపాకు చెందిన అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు బాగా నష్టపోతాయని భయాలు వ్యక్తం అవుతున్నాయి. ''అమెరికాకు, ఇతర దేశాలకూ మధ్య వాణిజ్య యుద్ధం వల్ల వ్యాపార విశ్వాసం సన్నగిల్లుతుంది, ప్రపంచ ఆర్థికోత్పత్తి తగ్గిపోతుంది'' అని ఆస్ట్రేలియా పారిశ్రామిక విభాగానికి చెందిన ''ఇన్నొవేషన్ అండ్ సైన్స్'' అనే సంస్థ పేర్కొంది. ఈ రిపోర్టు ను ఆ దేశ వాణిజ్య మంత్రి స్టీవెన్ సియోబో సమర్ధిస్తూ ''పెరుగుతున్న వాణిజ్య ఘర్షణలు ప్రపంచాభివృద్ధికి నష్టం చేస్తాయి, ఎందుకంటే ప్రపంచాభివృద్ధికీ, ప్రపంచా వాణిజ్యానికీ మధ్య సంబంధం ఉంది'' అన్నారు.
అమెరికా అధ్యక్షుని వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా నుండి చైనాకు సోయాబీన్, జొన్న దిగుమతులు పడిపోవడంతో రైతాంగం దెబ్బ తింటోంది. ఉక్కుపై సుంకాల వల్ల అమెరికాలోని అనేక ఉక్కు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తులు దెబ్బతిని కార్మికులకు ఉపాధి పోతోంది. అమెరికాలో మధ్య తరహా, చిన్న వాణిజ్య వేత్తలు చాలా వరకు ఈ వాణిజ్య ఘర్షణలను వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో 900 సంస్థలు సభ్యత్వం కలిగిన పరికరాల ఉత్పత్తి దారుల సంఘం ఇప్పటికే ట్రంప్ వాణిజ్య యుద్ధానికి వ్యతిరేకంగా అడ్వర్టయిజ్మెంట్ క్యాంపెయిన్ ప్రారంభించింది. దేశంలో ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల అమెరికా కంపెనీలు ఇతర దేశాల కంపెనీలతో పోటీ పడడం కష్టమని వారు భయాలు వ్యక్తం చేస్తున్నారు. కార్లపై, ముఖ్యంగా కార్ల విడి భాగాలపై సుంకాల వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని కార్ల కంపెనీలు భయా లు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఫోర్డ్, జనరల్ మోటార్స్, ఫియట్ కంపెనీలు తమ లాభాల అంచనాలు తగ్గించుకుంటూ రిపోర్టులు ప్రకటించాయి.
అలాగే స్వేచ్ఛా వాణిజ్యాన్ని కోరుకునే రైతుల బృందం ఒకటి చైనా తమ వస్తువులపై విధించే ప్రతీకార సుంకాల వల్ల తమకు ఏటా రూ. 3,500 కోట్ల నష్ట వాటిల్లు తుందని, కాలిఫోర్నియా, ఐయోవా, మిస్సోరీ, ఉత్తర కరోలినా రాష్ట్రాల్లో రైతాంగం బాగా దెబ్బ తింటుందని ప్రకటించింది.
దేశ విదేశాల నుండి వస్తున్న విమర్శల వల్లనైతేనేమి, లేక వ్యూహాత్మక నిర్ణయాల వల్లనైతేనేమి ట్రంప్ ప్రభుత్వం ఇయు, కెనడా వంటి దేశాలతో కొంత వరకు రాజీ బేరాలు కుదుర్చుకోడానికి ముందుకొచ్చింది. ఇయు కార్లపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటిం చిన వెంటనే తామూ ప్రతీకారంగా రూ.21 లక్షల కోట్ల మేరకు అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తామని ఇయు ప్రకటించింది. దాంతో ట్రంప్ ప్రభుత్వం ఇయుతో మంత నాలకు దిగింది. జులై 25వ తేదీన ట్రంప్‌కూ యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జుంకెర్కూ మధ్య వాషింగ్టన్లో ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో ప్రధానంగా తన దేశం లోని సోయాబీన్ రైతులను కాపాడుకునేందుకు ట్రంప్ ప్రయత్నించాడు. చైనాకు సోయాబీన్ ఎగుమతులు తగ్గిపోయిన మేరకు ఇయు తమ దేశం నుండి వాటిని కొనేందుకు ఒప్పందం కుదిరింది. దానికి మారుగా ఇయు కార్లపై 20 నుండి 25 శాతం సుంకాలు విధిస్తామన్న ట్రంప్ నిర్ణయాన్ని సస్పెండ్ చేశారు. ఉక్కు, అల్యూ మినియం సుంకాలపై తదుపరి చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే చైనాపై విధించిన సుంకాలను మాత్రం తగ్గించే ప్రసక్తే లేదని అమెరికా వాణిజ్య మంత్రి కరాఖండిగా చెప్పారు. మొత్తం మీద చూసినప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఇయు, ఇతర సామ్రాజ్యవాద మిత్ర దేశాలతో కొంత మేరకు రాజీపడి తన యుద్ధాన్ని చైనాపై ప్రధానంగా ఎక్కుపెట్టడానికి ప్రయత్ని స్తున్నదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నా రు. అయితే ఈ తాత్కాలిక రాజీలు కూడా వాణిజ్య యుద్ధాన్ని పూర్తిగా అంతం చేశాయని చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ ప్రకటించిన సుం కాలను పూర్తిగా రద్దు చేయలేదు. కొంతకాలం వాయిదా వేశారంతే.
నయా-ఉదారవాద ప్రపంచ వ్యవస్థ బద్దలవుతుందా?
అమెరికా ప్రారంభించి, ప్రపంచ వ్యాపితమవుతున్న ఈ వాణిజ్య యుద్ధాల్లో ఒక ముఖ్యమైన అంశం వాణిజ్య ప్రకటనలకు సైనిక నాదాలు తోడు కావడం. ట్రంప్ తన వాణిజ్య సుంకాల విధింపుకు ''జాతీయ భద్రత'' ప్రధాన కారణంగా చూపించాడు. 1962 వాణిజ్య విస్తర చట్టంలోని 232వ అధికరణ ప్రకారం ''జాతీయ భద్రత'' కారణంతో వాణిజ్య సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనించదగ్గ విషయం. అంటే అమెరికా భద్రతకోసం సైనిక యుద్ధాలతో పాటు వాణిజ్య యుద్ధాలకు కూడా దిగడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధ మవుతోంది.
ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఐరోపా దేశాధి నేతలు కూడా వాణిజ్య ప్రకటనలకు సైనిక భాషను జోడిం చారు. కెనడాలో జి7 శిఖరాగ్ర సభ కుప్ప కూలిపోయాక జర్మన్ విదేశాంగ మంత్రి హీకో మాస్ మాట్లాడుతూ ''యూరోపియన్ శక్తులన్నీ తమ ప్రయోజనాలను మరింత సమర్ధవంతంగా రక్షించుకోడానికి ఐక్యంగా ప్రతీకార చర్యలకు దిగాలి'' అన్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయం ''న్యాయ విరుద్ధమైనదే కాదు అనేక విధానాల తప్పు. ఆర్థిక జాతీయవాదం యుద్ధా నికి దారితీస్తుంది. 1930వ దశకంలో జరి గింది ఇదే'' అన్నాడు.
వాస్తవానికి 1930లో సంభవించిన మహా ఆర్థిక సంక్షోభం వాణిజ్య యుద్ధాలకూ, తదుపరి రెండవ ప్రపంచ యుద్ధానికీ దారితీసింది. ఇప్పు డు కూడా అటువంటి పరిస్థితులు దాపురిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు, మీడియా వ్యాఖ్యానిస్తున్నాయి. కెనడాలో జి7 శిఖరాగ్రసభ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ''సంయుక్త ఐరోపా రక్షణ సైన్యాన్ని నిర్మించాలి'' అని ప్రతిపాదించగా దానికి జర్మన్ ఛాన్సలర్ మద్దతు పలికారు. సంయుక్త ఐరోపా రక్షణ సైన్యంలో బ్రిటన్ను చేర్చుకోవాలి కాని అది నాటో (అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి)తో సంబంధం లేకుండా ఉండాలి అని మాక్రాన్ ప్రతిపాదించారు.
జర్మనీ అధినేత మెర్కెల్ ఫ్రెంచ్ అధ్యక్షుని ప్రతిపాదనకు మద్దతిస్తూ ''ఐరోపా వాసులుగా మనం మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవాలి...అమెరికా మన సంగతి చూసు కుంటుందని మనం అనే దశాబ్దాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించాం. కాని ఇప్పుడా ఆశలు లేవు. దీనర్థం ఏమంటే జర్మనీ, ఐరోపాలు ముఖ్యంగా కెనడా, జపాన్‌లతో కలిసి మన సూత్రాలను, మన ఐరోపా విలువలనూ కాపాడుకోవాలి'' అన్నారు. అంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికా జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తుంటే, జర్మన్-ఐరోపా విలువల పేరుతో మెర్కెల్-మాక్రాన్‌లు ఐరోపా జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్నమాట.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మళ్లీ వాణిజ్య యుద్ధాల్లోకి వెళ్ల కూడదని సామ్రాజ్య వాద దేశాలు ఒక స్థూల అంగీకారానికి వచ్చా యి. 1975లో అయిదు సామ్రాజ్యవాద దేశా లతో - అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్‌లతో ఏర్పడిన జి5 కూటమి తరువాత కెనడా, ఇటలీలను చేర్చుకుని జి7గా మారింది. అప్పటినుండి ఇప్పటి వరకు అమెరికా నాయకత్వంలో ఈ దేశాల పాలక వర్గాలు ప్రపంచాన్ని దోచుకోవడంలో స్థూల అంగీకారాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. 1991లో సోషలిస్టు సోవియట్ యూనియన్ విశ్ఛిన్నం తరువాత ఈ దేశాలు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ప్రయోజనాల కోసం ప్రపంచంపై నయా-ఉదారవాద ప్రపంచీకరణ విధానాలు రుద్దాయి. ఈ నయా-ఉదారవాద ప్రపంచీకరణ వ్యవస్థలోకి అన్ని దేశలనూ తీసుకువచ్చాయి. దాన్ని అంగీకరించని దేశాలపై యుద్ధాలకు దిగాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియాల్లో యుద్ధాలు చేసి లక్షల మందిని పొట్టన బెట్టుకున్నాయి. ఈ మొత్తం దోపిడీ, యుద్ధాల్లో సామ్రాజ్యవాదులు తమ మధ్య వైరుధ్యాలు బయటకు రాకుండా కట్టడి చేసుకున్నారు. సైనికాధిపత్యంతో నెలకొల్పబడిన ఈ వ్యవస్థ నేడు బీటలువారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు వాణిజ్య యుద్ధాలు, సైనిక వ్యూహాల రూపంలో ముందుకొస్తున్నాయి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమ మధ్య వాణిజ్య యుద్ధాలకు దారితీయకుండా చూసుకోవాలని సామ్రాజ్యవాద దేశాలు నిర్ణయించాయి. కానీ ఇంతలోనే అవి వాణిజ్య యుద్ధాలకు దిగడం సంక్షోభం యొక్క ఒత్తిడి ఫలితమే.
జర్మన్ ఛాన్సలర్ రష్యాతో అంటకాగుతోందని ట్రంప్ బహిరంగంగానే విమర్శిస్తుంటే, కెనడా, జపాన్‌తో కలిసి ఐరోపా సైనిక కూటమి ఏర్పడాలని జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్ పిలుపునిస్తున్నారు. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లోనూ పాలక వర్గాలు ప్రజల్లో జాతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నాయి. విఫలమయిన ప్రపంచీకరణ ప్రజల్లో సృష్టించిన అసంతృప్తిని జాత్యహంకారంవైపు, వలసల వ్యతిరేకతవైపు ఇతర అనేక మితవాద ధోరణులవైపు మళ్లిస్తున్నాయి. ట్రంప్ ప్రారంభించి, విశ్వవ్యాపితం చేస్తున్న వాణిజ్య యుద్ధాలు అందులో భాగమే.