Jan 3,2024 22:48

అనంతపురం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీల ఉద్యమ గర్జన

అనంతపురం కలెక్టరేట్‌ : పోరు ముగింట అంగన్‌వాడీలు పిడికిలి బిగించారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా మొద్దునిద్రను ప్రదర్శిస్తున్న ప్రభుత్వంపై నిరసన జ్వాలను తీవ్రతరం చేశారు. బెదిరింపులు, నిర్బంధాలకు ఐక్య పోరాటంతోనే సమాధానం చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం ఛార్జిమెమోల ద్వారా బెదిరించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల తీరును వ్యతిరేకిస్తూ అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట బుధవారం నాడు 4 గంటల పాటు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అంతకుమునుపు లలిత కళాపరిషత్‌ నుంచి వేలాది మంది అంగన్‌వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రజెండాలు, అంగన్‌వాడీల ఎర్రటి దుస్తులతో అనంత వీధులు ఎరుపెక్కాయి. ఎల్‌కెపి వద్ద ప్రారంభం అయిన ర్యాలీ సప్తగిరి సర్కిల్‌, సంగమేష్‌ సర్కిల్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరి వీడాలంటూ నినదించారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు కదంతొక్కారు. ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ ఆందోళనను ఉధృతం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు తెలంగాణా ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు పెంపుదల చేయాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం నాడు కలెక్టరేట్‌ను ముట్టడించారు. న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా నలమూలల నుంచి వేలాదిగా వచ్చిన అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. వీరికి సిపిఎం, సిఐటియు, ఐద్వా, రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, మున్సిపల్‌, ఆటో, మధ్యాహ్న భోజన పథకం, యుటిఎఫ్‌, జెవివి నాయకులు మద్దతు తెలిపారు. సిఐటియు జెండాలు చేతపట్టుకుని అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, తదితరులు మద్దతుగా హాజరయ్యారు.

ప్రభుత్వానికి పతనం తప్పదు

సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌

అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులకు దిగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ హెచ్చరించారు. అంగన్‌వాడీలు 23 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వహించడం దుర్మార్గంగా ఉందన్నారు. చర్చల పేరుతో రాష్ట్ర కమిటీ నాయకులను పిలిచి ఆర్థికేతర అంశాలపై మాత్రమే మాట్లాడాలంటూ హుకుం జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమ్మె చేస్తున్నదే ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించకుండా బెదిరింపు ధోరణులకు దిగడం ప్రభుత్వ దగాకోరు తనానికి నిదర్శనం అన్నారు. అంగన్‌వాడీలను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. అంగన్‌వాడీలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలన్నారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటూనే మహిళా కార్మికుల పట్ల కర్కశంగా వ్యవహరిచడం సిగ్గు చేటుగా ఉందన్నారు. హక్కుల కోసం కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగుళగొట్టి కేంద్రాలను ప్రారంభించి బెదిరింపులకు దిగుతోందన్నారు. ఇప్పుడు జనవరి 5వ తేదీ లోగా విధుల్లోకి చేరకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామనే పద్ధతుల్లో మంత్రులు మాట్లాడటం శోచనీయంగా ఉందన్నారు. ప్రత్యామ్నాయం ప్రభుత్వం కాదు, సమస్యలు పరిష్కరించకపోతే అంగన్‌వాడీలే ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని హెచ్చరించారు.

బెదిరింపులకు బెదరం

అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి

తాము న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నాం.. దీనిపై స్పందించకుండా ప్రభుత్వం మెమోలిస్తాం.. చర్యలు తీసుకుంటాం.. అంటే బెదిరేది లేదదని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి స్పష్టం చేశారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ జిల్లా వాసి అయిఉండి కూడా అంగన్‌వాడీలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయంగా ఉందన్నారు. సమస్యలు చెబుతామని ఆమె ఇంటివద్దకు వెళ్తే పోలీసులతో అరెస్టులు చేయించారన్నారు. ప్రభుత్వం దిగొచ్చి అంగన్‌వాడీలకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించకుండా మెమోలిస్తాం, అల్టీమేటం జారీ చేస్తాం, సమ్మె విరమించాలంటే తగ్గదే లేదన్నారు. న్యాయమైన హక్కుల కోసం నిరవధిక నిరాహార దీక్షలకైనా సిద్ధం అవుతామన్నారు.

వైసిపికి పోయే రోజులు దగ్గర పడ్డాయి

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌

వైసిపి ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులతో కయ్యానికి కాలుదువ్వతోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఆగ్రహిస్తే రాబోవు రోజుల్లో వైసిపి రాష్ట్రంలో గల్లంతు అవ్వడం ఖాయం అన్నారు. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు అడుగుతున్న న్యాయమైన వేతనాలు పెంపుదల చేసి సమ్మె విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి తలారి రామాంజినేయులు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, నాయకులు రమేష్‌, ఇర్ఫాన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌, నాయకులు శివ, గిరి, ఐద్వా జిల్లా అద్యక్షురాలు శ్యామల, జెవివి నాయకులు రామిరెడ్డి, సిఐటియు నాయకులు శివశంకర్‌, పోతులయ్య, కుళ్లాయప్ప, ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, మల్లికార్జున, జయమ్మ తదతరులు మద్దతుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు జయభారతి, జమున, నాయకులు అరుణ కాత్యాయని, రుక్మిణితో పాటు జిల్లాలోని అన్ని మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️