- పాతూరి వెంకటేశ్వరరావు
10.04.1870న జన్మించిన సమ సమాజ ఆవిష్కర్త లెనిన్ 149వ జయంతిని జరుపుకుంటున్నాం. మానవ మహోపకారుల జయంతి, వర్థంతులను జరుపుకోవటం మానవాళికి శ్రేయోదాయం. ఏడాది కొకసారైనా వారి మాన వోత్తమ గుణగణాలను మననం చేసుకుంటూ, ఆ దిశగా మనల్ని మనం తీర్చిదిద్దుకునేందుకు అదొక సదవకాశం గదా!
''ప్రాణులన్నింటి కష్టనష్టాలను సుఖ సంతోషాలను తనవిగా భావించు వాడు శ్రేష్టుడు'' అంటున్నది భగవద్గీత! అట్టి ఉత్తమ శ్రేణికి చెందిన వారే మార్క్స్, లెనిన్ వంటి మహానీయులు. మానవాళిని వాళ్ళు అమితంగా ప్రేమించారు. అందుకనే అత్యధికులు, కష్టాల కడలిలో మునిగి తేలుతుంటే, కొద్దిమంది మాత్రం నవ్వుల నదిలో పువ్వుల పడవలో విహ రిస్తుండటం, అసహజం, అన్యాయం అనిపించి, పరిష్కారంగా సార్వజనీన, సుఖదాయక సమసమాజం కోసం అన్వేషణ ప్రారంభించారు.
ఆ క్రమంలోనేహెగెల్వంటి హేమహేమీల తత్వశ్రాస్తాలన్నింటినీ ఏళ్లతరబడి మదించి, కారల్‌మార్క్స్ గతితార్కిక సూత్రాలను ఆవిష్కరిం చాడు. - అలాగే ఒక దిశగా మార్క్సిజాన్నీ - మరోవైపు జారు పాలనలోని రష్యన్ల కడగండ్ల తీవ్రతనూ నిశితంగా పరిశీలిస్తున్నాడు లెనిన్. మార్క్సిజం సూచిస్తున్న విప్లవదశ కోసం, అంటే, ప్రజలందరి సుఖసంతోషార్థం పోరాడి, అట్టి రాజ్యాంగాన్ని రూపొందించుకునే సదవకాశం కోసం తపిస్తున్నాడు లెనిన్: ఆ తపనతోనే కమ్యూనిస్టుపార్టీని నిర్మించటం, పత్రికల ద్వారా కార్యకర్తలను చైతన్యవంతం చేయటం, అయోమయ స్థితిలో ''ఏం చేయాలి?'' 'రాజ్యం- విప్లవం' వంటి గ్రంథరచనల ద్వారా కర్తవ్య నిర్దేశం చేయటం, తమ ఉద్యమానికి ప్రమాద మనుకున్నవారికి దూరంగా, మిత్రులనుకున్న వారికి చేరువగా ఉంటూ సమ సమాజ నిర్మాణ లక్ష్యంతో సాగిపోతున్నాడు లెనిన్!
1897-1901 సంవత్సరాలలో కరువు కాటకాలు సంభవించడం కౌలురేట్లు పెరిగిపోవ టం- తిండి దొరక్కదేశ ప్రజలు మలమలమాడు తుంటే అధికలాభాల అత్యాశతో దేశం నుండి ధాన్యం ఎగుమతి కావటం - జారుప్రభుత్వం పాల్గొన్న యుద్ధంలో ఓడిపోవడం- నిరుద్యోగుల సంఖ్య కోటికి పెరగడం ఇట్టి అవకతవకల కారణంగా 1905 నాటికి రష్యాలో కొద్దిమంది భారీ ధనికులు తప్ప తక్కిన అన్ని వర్గాల వారూ ఏదో ఒక అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితులన్నింటినీ గతితార్కిక సూత్రాలతో బేరీజు వేసుకున్న లెనిన్ 14-1-1905న 'విపర్యాద్' అను పత్రికా ముఖ్యంగా ''రష్యాలో విప్లవం రాబోతున్నది. కామ్రేడ్స్ ఇక నుండి మనం వేసే ప్రతి అడుగూ, జారు నిరంకుశత్వా నికి వ్యతిరేకంగా, తమ విముక్తి కోసం శ్రామి కులు చేయబోయే మహాయుద్ధానికి చేరువగా తీసుకెళ్తుందన్న సృహతో పనిచేద్దాంగాక'' అంటూ 12 సంవత్సరాల ముందుగానే విప్లవ రాకడను గూర్చి జోస్యం చెప్పాడు లెనిన్! మానవాళిపట్ల ఆయనకు గల ప్రగాఢ ప్రేమ, వారికెలాగైనా సుఖసంతోషాల నందజేయాలన్న తపన, అవే లెనిన్ చేత అంతటి సునిశిత పరిశీలన చేయించాయన్నది వాస్తవం!
లెనిన్ విశిష్టత: మేధావులంతా మార్క్సి జాన్ని, విప్లవాన్ని చక్కగా నిర్వశిస్తూ సోదాహ రణంగా విశదీకరిస్తుంటే, లెనిన్ మాత్రం నిర్వచనాల కతీతంగా వాటిని ఆచరణాత్మకంగా ఆలోచిస్తూ, వాటి సత్తాను ప్రజల అనుభవంలోకి తెచ్చి వీలైనంత త్వరగా వాటి ఫలాలను ప్రజలకందించేందుకు తపించాడు. ఆ తపనే, మార్క్సిజాన్ని ఆచరణాత్మక శక్తిగా 20వ శతాబ్దంలోకి నడిపించిన లక్ష్య సాధకునిగా సమసమాజ ఆవిష్కర్తగా చరితార్ధునిగా లెనిన్‌ను నిలిపింది!
లెనిన్ దృష్టిలో విప్లవమంటే?: '' కొద్ది మందికి అర్థదాయకంగా, అనేకమందికి అనర్థదాయకంగా ఉన్న ఈ ప్రపంచాన్ని, సార్వజనీన సుఖదాయకంగా మార్చుకోవచ్చు అన్న ఊహతో ప్రజలు సార్వజనీనంగా సమా యత్తం కావటమే. న్యాయమైన ఈ భావాన్నే కీలకమైన ఆయుధంగా మలుచుకుని 1) బూర్జువాల నుండి అధికారాన్ని హస్తగతం చేసుకోవటంలోను 2) కఠోరశ్రమతో కూడిన సోషలిస్టు సామాజిక పునర్మిర్మాణంలోనూ ప్రజలను భాగస్వాములను చేయగలిగాడు లెనిన్. అదీ ఆయన కార్యదక్షతా రహస్యం!
లెనిన్ ప్రాప్త కాలజ్ఞత (సమయస్పూర్తి) : గతితార్కిక లేక చారిత్రక అనివార్యతరీత్యా విప్లవం వచ్చి తీరుతుంది. అలా దానంతటది వచ్చేదాకా, ఆ శుభతరుణంకోసం వేచియుండి అప్పుడు విప్లవ సాధనకుప్రమించడం సాధారణ పద్ధతి! అసాధారణ పరిస్థితులలో ముందుగానే వచ్చిన అవకాశాన్ని గుర్తించి, దాన్ని అంది పుచ్చుకుని త్వరితంగా విప్లవాన్ని సాధించు కోవడం అసాధారణ పద్ధతి లేక ప్రాప్తకాలజ్ఞతా పద్ధతి!
ఉపాయోపేతమైన, అట్టి ప్రాప్తకాలజ్ఞతా పద్ధతిని అనుసరిద్దామంటూ 1917 సంవత్స రం ఏప్రిల్ నెలలో, లెనిన్ బోల్షెవిక్ పార్టీ ముందుంచిన, సహేతుక విప్లవ సాధనా సిద్ధాం తమే 'ఏప్రిల్థీసిస్'గా చరిత్రకెక్కింది. దాన్ని ఏప్రిల్8న 13:2 ఓట్ల తేడాతో ఓడించింది బోల్షెవిక్ పార్టీ పోలిట్‌బ్యూరో. అది పిచ్చివాని ప్రేలాపనగా వ్యాఖ్యానించారు కొందరు. 'హమ్మో అప్పుడే శ్రామిక విప్లవమా? లెనిన్‌కు పిచ్చిగాని పట్టలేదుగదా'' అంటూ లెనిన్ భార్య సైతం వాపోయింది.
ఐనా జావగారి పోలేదు ధీరోదాత్త లెనిన్. పార్టీ నాయకులను, మేధావులనూ, వాళ్ల పాటికి వాళ్లనొదిలేశాడు. సాధారణ పార్టీ కార్యకర్తలను సమావేశపరిచి, తాను గుర్తించిన విప్లవ సాధనా అవకాశాన్ని గూర్చి, సహేతుకంగా, ఆత్మవిశ్వాస భరితంగా వివరించాడు. రష్యాలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా ముందుగానే విప్లవ దశ వచ్చేసింది. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని తక్షణం సమసమాజాన్ని నెలకొల్పు కోవటం పిచ్చౌతుందా? సమయస్పూర్తి ఔతుందా? అని లెనిన్ ప్రశ్నించగానే కార్యకర్త లకు జ్ఞానోదయమయ్యింది.
సమసమాజం కోసం తపిస్తున్న వారం దరికీ, దాన్ని సాధించి పెట్టే తండ్రిలా ఆగుపిం చాడు లెనిన్. అంతే తక్షణం నడుం బిగించారు. లెనిన్ బాటలో లెనిన్ భావజాలాన్ని సహేతుకం గా ప్రబోధిస్తూ, ప్రజామద్దతుకు, పార్టీ బలోపేతా నికి పూనుకున్నారు. సదరు కార్యకర్తలు. 1917 ఏప్రిల్ నాటికి కేవలం 24 వేలుగా వున్న పార్టీ సభ్యత్వం జులై నాటికి 2 లక్షల 20 వేలకు పెరిగి వటవృక్షంలా విస్తరించింది. అలా కొద్ది నెలలోనే పూర్తిగా పార్టీ మద్దతును, పార్టీకి ప్రజా మద్ధతును సమీకరించుకోవటంలో విజయు డయ్యాడు లెనిన్!
పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో 1917 ఆక్టో బరులో విప్లవానికి పిలుపిచ్చాడు లెనిన్. ఆ పిలుపు నందుకున్న కార్మికవర్గం కెరెన్స్కీ ప్రభుత్వాన్ని కూలదోసి పాలనాధికారాన్ని హస్త గతం చేసుకున్నది. అలా విజయవంతమైన అక్టో బరు విప్లవం చారిత్రాత్మకమై నాటికి నేటికి విప్లవ స్పూర్తి వెదజల్లుతున్నది. లెనిన్ విప్లవ సూర్యునిలాచరిత్ర పుటాకాశంలో భాసిస్తున్నాడు.
నాటి రష్యాలోని నాగరిక బూర్జువా వర్గం నుండి మిక్కిలి వెనకబాటు తనం గల కార్మిక వర్గం అధికారం తీసుకున్నా, ఆ స్థితిలో కార్మిక శ్రేయోరాజ్యాన్ని, సమసమాజ నిర్మాణాన్ని రూపొందించటం ఆషామాషీ వ్యవహారం కాదని లెనిన్‌కు తెలుసు. అందుకే విప్లవం దెబ్బమీద దెబ్బవేయాలని పిలుపునిచ్చాడు. నాడు రష్యన్లకు తక్షణ ఆవశ్యకాలైన 1) శాంతి నెలకొల్పటం 2) భూములను, బ్యాంకులను జాతీయం చేయటం 3) సార్వజనీన విద్య, వైద్యం 4) ఉండటానికి ఇల్లు 5) తినటానికి తిండి 6) చేయటానికి పని, 7) ఉత్పత్తుల పంపిణీ ఇవన్నీ విప్లవకర కార్మికవర్గం నాయకత్వంలో జరగా లని పిలుపునిచ్చాడు. అలా విప్లవం ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్న కార్మికవర్గం చేత అదే విప్లవ స్పూర్తితో కఠోర శ్రమతో కూడిన, సామాజిక పునర్మిర్మాణ కర్తవ్యాన్ని కూడ విజయవంతంగా నెరవేర్చగలిగాడు లెనిన్! విప్లవం దెబ్బ మీద దెబ్బ వేయటమంటే అదే!
మానవీయ లెనిన్ చేత 1917 అక్టోబరు లో ఆవిష్కరింపబడినట్టి సమసమాజం కోసం, విశ్వమంతటా విస్తరిస్తున్న కమ్యూనిజానికి 1990 వ దశకంలో ఎదురు దెబ్బలు తగిలా యి. ఇట్టి స్థితిలో లెనినిజం ఇస్తున్న భరోసా ఏమంటే? - కమ్యూనిజానికి ఇంతటితో నూక లు చెల్లాయిని జావగారిపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే? శ్రామిక విముక్తికీ, సమసమాజ ఆవిష్కరణకు కమ్యూనిస్టు పోరాటమే జగదేక ఆయుధం. కావున కమ్యూనిజానికి మరణ మన్నది లేదుగాక లేదు. ఐతే కమ్యూనిజాన్ని సజీవంగా, సార్వజనీనంగా నిలుపుకోవాలంటే, అదొక నిరంతర అన్వేషణా ప్రక్రియ అన్న వాస్తవాన్ని సదా గుర్తుంచుకొని కమ్యూనిస్టులు మసలు కోవాలి!
ఉదాహరణకు గుండె కిడ్నీ వంటి కీలక అవయవాలు నిరంతరం పనిచేస్తుంటేనే ప్రాణి మనగలుగుతుందన్నది ఎంత వాస్తవమో, కమ్యూనిస్టులు నిరంతర అన్వేషణా కార్య క్రమంలో అప్రమత్తులై ఉంటేనే, సమసమాజం సజీవంగా మనగల్గుతుందన్నది అంతే వాస్తవం!
గుండెకు వాల్వు దెబ్బతిన్నా, కొలెస్ట్రాలు అడ్డుపడినా దానిపని ఐపోయినట్లు కాదుగదా, వాల్వు మార్చో, బైపాస్ సర్జరీ చేసో తిరిగి పనిచేయిస్తున్నాం గదా? అలాగే 1990 వ దశకంలో కమ్యూనిజం గుండెకు ఏర్పడిన పెను ఆటంకాన్ని తొలగించుకుని తిరిగి మనం ముందుకు సాగాలంతేసుమా!
అందుకు లెనిన్ చెప్పినట్లు తిరిగి మొదలెత్తుకుందాంగాక! ప్రస్తుత అయోమయ స్థితిలో ఏం చేయాలి? 'రాజ్యము - విప్లవం' మొదలగు గ్రంథాలతో సహా లెనినిజాన్ని సరళీకరించి, అంటే సూర్యకాంతిని తనలో నింపుకొని చంద్రుడు మన కందిస్తున్న వెన్నెలలా గన్నమాట, కార్యకర్తలకు విస్తృతంగా అందిం చాలి! లెనినిజంలోని కీలక నిర్దేశమేమంటే? - ఈ పెట్టుబడిదారీ సామ్రాజ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పిలకలుతొడిగి విజృంభిస్తున్న ఉగ్రవాదం- తీవ్రవాదం- మతోన్మాదం, వర్ణ, జాతి, కుల, స్త్రీ, వివక్ష- మద్యం, మాదక ద్రవ్యాలు, మాఫియా, ప్రాంతీయ కల్లోలాలు- అవినీతి, కల్తీ, క్లబ్బులు, పబ్బులు, జూదం, వ్యభిచారం, హత్యలు, యుద్ధాలు- ధనంతో అధికారం అధికారంతో ధనం కుట్రలు, కుతం త్రాలు ఇదీ, అదీ అననేల విశ్వంలో చెలరేగు తున్న సమస్త సామాజిక రుగ్మతలన్నింటికీ కుదరు పెట్టుబడిదారీ వ్యవస్థే. కావున దాన్ని కూకటివేళ్లతో పెకలించి, ఆస్తిహక్కును రద్దుచేసే దాక ఈ రుగ్మతలు తేనెటీగల బారి నుండి మానవాళిని కాపాడలేం గాక కాపాడాలేం. అందుకు రాజీలేని కమ్యూనిస్టు పోరాటానికి మించిన ఆయుధం లేదంటున్నది లెనినిజం.
ఈ స్థితిలో లెనిన్ సందేశాన్నందుకుని, 'గతంగత: ఇక ముందు ఏ పార్టీతోనూ అంట గొక్కండా స్వీయవ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ప్రజా పునాది సుధృడపరుచుకుంటూ, లెనిన్ చెప్పినట్లు 'మళ్లీ మొదలెత్తుకోవాలి' అని సిపిఐఎం తీసుకున్న నిర్ణయం సర్వత్రా అభినందించబడుతున్నది. అదే నిర్ణయంతో ఆసేతు హిమాచల పర్యంతం వటవృక్షంలా విస్తరించటానికి కమ్యూనిజానికెంతో సమయం పట్టదని రాజకీయ మేధావులు చర్చించు కుంటున్నారు. ఆ శుభ తరుణం కోసం సార్వజ నీనంగా ఎదురుచూస్తున్నది భారతదేశం!
ఇక లెనిన్‌కు గల 1) మానవాళిపట్ల ప్రగాఢప్రేమ 2) సునిశిత సామాజిక పరిశీలిన 3) సంక్షోభ సమయాల్లో దీరోదాత్తత 4) ప్రాప్త కాలజ్ఞత 5) దీర్ఘదర్శిలను అందిపుచ్చుకోవడం ద్వారా, మన మాయనకు ప్రియమైన జన్మదిన కానుకను సమర్పించుకుందాం. ఓ ప్రియతమ మానవీయ,మహనీయ వ్లదిమిర్ ఇల్యిచ్ ఉల్యానోవ్! లెనిన్! సమస్త మానవుల, సమసమాజ నిర్మాణ కృషీవలురందందరి తరపునా నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! నీవంటి మానవ మహోపకారిని ప్రపంచానికందించిన మీ అమ్మానాన్నలకు సర్వదా కృతజ్ఞతలు!!
లెనిన్ బాటలో ముందుకు
