43,209 మందికి రూ.30.31 కోట్ల లబ్ధి

Mar 1,2024 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫీజుల చెల్లింపు కోసం జగనన్న విద్యాదీవెన పథకం కింద ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం నిధులు విడుదల చేశారు. కృష్ణా జిల్లాలోని పామర్రులో జరిగిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజుల నిధులు జమ చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జగనన్న విద్యాదీవెన కింద ఆయా విద్యార్థులు, వారి తల్లులకు ఫీజు మొత్తాలకు సంబంధించిన చెక్కును కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, డిసిసిబి ఛైర్మన్‌ వి.వి.చినరామునాయుడు అందజేశారు. జిల్లాలో మొత్తం 43,209 మంది కళాశాల విద్యార్థులు జగనన్న విద్యాదీవెన కింద లబ్ధిపొందుతున్నారని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. వీరికి రూ.30,31,38,187 జమ అవుతుందని చెప్పారు. జిల్లాలో 34,992 మంది బిసి, 3,846 మంది ఎస్‌సి, 2,535 మంది ఇబిసి, 915 మంది కాపు, 611 ఎస్‌టి, 266 ముస్లిం, 44 క్రిస్టియన్‌ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జిల్లా బిసి సంక్షేమ అధికారి కె.సందీప్‌, సాంఘిక సంక్షేమ అధికారి రామానందం, గిరిజన సంక్షేమ అధికారి చంద్రశేఖర్‌, మైనారిటీ సంక్షేమ అధికారి రుద్రపాటి శామ్యూల్‌ జాన్‌, సహాయ బి.సి.సంక్షేమ అధికారి యశోదనరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️