పెట్టిబడిదారుల ప్రాపకంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ మన దేశంలో ఎంతగా కోరలు చాచిందో ఇటీవల బ్యాంకు కుంభకోణాలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. మద్యం వ్యాపారి విజరు మాల్యా స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో 9 వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టి ఎంచక్కా ఇంగ్లండ్ పారిపోయిన వైనం మరువక ముందే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 12 వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడు. ఈ కుంభకోణం పై చర్చ సాగుతుండగానే పెన్నుల వ్యాపారి విక్రమ్ కొఠారి, పంచదార వ్యాపారి గుర్మిత్ సింగ్ మన్ బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టారని వార్తలొచ్చాయి. సరికొత్తగా ఆర్పి ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ ఏకంగా 10 బ్యాంకులకు 500 కోట్లు, శ్రీలక్ష్మీ కొటిన్ సంస్థ 4000 కోట్లు ఎగ్గొట్టినట్లు వార్తలొచ్చాయి.
కార్పొరేట్ బడా సంస్థలు బ్యాంకులను ముంచేసేందుకు ఒక పద్ధతి అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా కనిపిస్తుంది. మొదటిగా కార్పొరేట్ సంస్థలు ఎటువంటి హామీలు లేకుండా లేక సరైన హామీలు లేకుండా బ్యాంకుల వద్ద అప్పు చేస్తాయి. రెండో దశలో అప్పులు చెల్లించకుండా ఎగనామం పెడతాయి. బ్యాంకులు వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తాయి. అప్పులు ఎగ్గొట్టే వారు కొందరు విదేశాలకు పారిపోతే మరికొందరు దేశంలోనే అధికార పదవుల్లో చివరికి కేంద్ర, రాష్ట్రాల మంత్రులుగా కూడా ఉంటారు. మూడో దశలో ప్రభుత్వం రంగంలోకి వస్తుంది. నిరర్ధక ఆస్తుల బారినుండి బ్యాంకులను రక్షించేందుకు బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయులు కేటాయిస్తుంది. ఈ ఏడాది రెరడున్నర లక్షల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కేటాయింది. ఈ విధంగా ప్రజల సొమ్మును ప్రభుత్వం ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోంది. ఇదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం యొక్క నగ రూపం.
పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిలో భాగమే ఈ క్రోనీ క్యాపిటలిజం. పెట్టుబడిదారులు సాధారణ పద్ధతిలో అయితే కార్మికుల అదనపు శ్రమను దోపిడీ చేసి బలుస్తారు. దీనివల్ల కార్మికులకు కనీసం ఉపాధి అయినా లభిస్తుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు సాధారణ అభివృద్ధి మార్గాలు మూసుకుపోయినప్పుడు పెట్టుబడిదారులు తమ లాభాలు మరింతగా పోగుచేసుకునేందుకు క్రోనీ క్యాపిటలిజాన్ని ఆశ్రయిస్తారు. ప్రభుత్వాలను అడ్డు పెట్టుకుని ప్రజా వనరులను - ప్రయివేటీకరణ ద్వారా, బ్యాంకుల్లోని సొమ్ము, భూములు, గనులు వగైరా నేరుగా దోచుకోవడం ద్వారా వీళ్లు పెట్టుబడి పోగేసుకుంటారు.
క్రోనీ పెట్టుబడిదారీ విధానాల వల్ల కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభాలు పెరుగుతాయి. కానీ కార్మికులకు ఉపాధి లభించదు. ప్రజల సంపద నేరుగా పెట్టుబడిదారుల పరం అవుతుంది. క్రోనీ క్యాపిటలిస్టు విధానాల అమలులో బిజెపి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దొందూ దొందే. కానీ బిజిపి ప్రభుత్వం ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది. గత ఎన్డీఎ ప్రభుత్వం (వాజ్పేయి) హయాంలో ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ కోసం ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రజల వనరులను ఆశ్రిత కార్పొరేట్లకు నగంగా దోచిపెడుతోంది. విశేషమేమంటే ప్రభుత్వ రంగ బ్యాంకులను దోచుకుంటున్న ఈ కార్పొరేట్ శక్తులే దొంగే దొంగ దొంగ అన్నట్లు దీనికి కారణాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులమీద నెట్టేసి వాటిని ప్రయివేటీకరించడమే పరిష్కారం అని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ బ్యాంకులను పూర్తిగా స్వాహా చేసే కుట్ర. ఈ కుట్రను సాగనిస్తే ప్రజల ధనానికి రక్షణ ఉండదు. అందుకని ఇది బ్యాంకుల సమస్య కాదు. ప్రజల సమస్య. బ్యాంకులను మింగేసేందుకు కార్పొరేటల్ సంస్థలు చేస్తున్న ఈ కుట్రలను తిప్పికొట్టాలి.
క్రోనీ క్యాపిటలిజం
