ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా శుక్రవారం ఏలూరు నగరపాలక సంస్థ వద్ద కార్మికులు ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, మున్సిపల్‌ శాఖ మంత్రితో జరిగిన చర్చలు సఫలం కాలేదని, అందుకే మున్సిపల్‌ కార్మికులు తమకు ఇక ఉరే శరణ్యమంటూ ఉరితాళ్లతో తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌ బాబు నాయకత్వం వహించారు. మున్సిపల్‌ కార్మికులు తమ నిరసనలో భాగంగా ఉదయం నుండే మున్సిపల్‌ ఆఫీస్‌ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ అమరావతిలో మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో జరిగిన చర్చల్లో నిర్దిష్టమైన హామీలు లేవని తెలిపారు. అందువల్ల కార్మికుల సమ్మెను ఉధృతం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు సానుకూలంగా పరిష్కరించే వరకూ ఆందోళన ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, ఆటో డ్రైవర్ల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.గోపి, టిడిపి నగర నాయకులు చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్‌, రెడ్డి నాగరాజు, అమరావతి అశోక్‌, మారం అను తదితరుల బృందం సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి పి.పోతురాజు, పి.నాగరాజు, బి.వెంకటేశ్వరరావు, అర్లప్ప, దావీదు, బండి రాజు, రాము, మేతర పాప, మరియమ్మ, బండి భవాని, నాగమణి, రమణమ్మ, దుర్గ, భాగ్యలక్ష్మి నాయకత్వం వహించారు. చింతలపూడి:నగరపంచాయతీ కార్మికులు సమ్మె నాలుగోరోజూ కొనసాగింది. ఈనెల 31వ తేదీలోపు ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో అన్నివిభాగాల విధులను పూర్తిగాబహిష్కరిస్తామని చింతలపూడి నగరపంచాయతీ మున్సిపల్‌ కార్మికులు స్పష్టం చేశారు. వీరికి టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌, హెల్త్‌ అలవెన్స్‌లు అందించాలని, సిఎం జగన్‌ పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐటిడిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్‌కుమార్‌ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18500, మున్సిపల్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గౌరవవేతనం రూ.26వేలు ఇవ్వాలని, సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు డాక్టర్‌ మారుమూడి థామస్‌, టిడిపి టౌన్‌ ఉపాధ్యక్షులు పొదిలి రాయప్ప, రైతు అధ్యక్షులు రావెళ్ల హనుమంతరావు, వెంగళరావు, వనమాల శ్రీను, పూడి రమణ, మూజి చౌదరి, సూరిబాబు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సమ్మెలో వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది, స్వీపర్లు పాల్గొన్నారు.జంగారెడ్డిగూడెం : ఉరితాళ్లతో మున్సిపల్‌ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నాలుగో రోజు మున్సిపల్‌ కార్మికులు సమ్మె కొనసాగించారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు బర్రె బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి జి.లక్ష్మణ్‌, రాజు, వినోద్‌, పెంటయ్య, మంగమ్మ, మేరీ, తులసి పాల్గొన్నారు. నూజివీడు : మున్సిపల్‌ కార్మికుల సమ్మె నూజివీడులో నాలుగో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి జి.రాజు మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనమివ్వాలని, మున్సిపల్‌ కార్మికులకు నష్టం కలిగించే ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్‌ఆర్‌.హనుమాన్లు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జయలక్ష్మి, గోవిందు, రాణి, పద్మ, రజని, గాంధీ, సాయి, ఏడుకొండలు, రాజేంద్ర, చంద్రశేఖర్‌, జయరాం, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.

➡️