యాపిల్‌ హెచ్చరికలు నిజమే 

amnesty india on pegasus

పెగాసస్‌తోపాత్రికేయులపై నిఘా

ది వైర్‌ వ్యవస్థాపక సంపాదకుడు సహా మరొకరి ఫోన్‌లో గుర్తింపు

మోడీ ప్రభుత్వ నిర్వాకంపై ఆమ్నెస్టీ నివేదిక

న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రయోగిస్తోందంటూ గతంలో తీవ్రమైన ఆరోపణలు రాగా, కేంద్రం తిరస్కరించింది. తాజాగా మరోసారి ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో బయటపడింది. ప్రజాదరణ కలిగిన ఇద్దరు పాత్రికేయులను పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నదని ఆ పరిశోధనలో తేలింది. పరిశోధనకు సంబంధించిన నివేదికను గురువారం విడుదల చేశాయి. ‘ది వైర్‌’ పోర్టల్‌ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌, ‘ది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌’ (ఒసిసిఆర్‌పి)కి చెందిన ఆనంద్‌ మంగ్నాలేలకు చెందిన ఐఫోన్లలో అక్టోబర్‌లో స్పైవేర్‌ను అమర్చారని, ఇందుకోసం గుర్తు తెలియని ప్రభుత్వ సంస్థను వాడుకున్నారని ఆమ్నెస్టీ తెలిపింది. ఇజ్రాయిల్‌లో రూపుదిద్దుకున్న పెగాసస్‌ను వరదరాజన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడం ఇది రెండోసారి. 2021లో సైతం పలువురు పాత్రికేయులతో పాటు వరదరాజన్‌పైనా ప్రభుత్వం నిఘా పెట్టి, ఆయన ఫోన్‌లో పెగాసస్‌ స్పైవేర్‌ను అమర్చింది. ప్రధాని మోడీకి సన్నిహితుడైన అదానీ వ్యాపార కార్యకలాపాలపై పరిశోధన జరుపుతున్నందునే మంగ్నాలేని లక్ష్యంగా చేసుకున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది.

  • ఆమ్నెస్టీ ఏం చెప్పింది?

ఆగస్ట్‌ 23న అదానీకి ఒసిసిఆర్‌పి ఒక ఈ-మెయిల్‌ పంపింది. భారతీయ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించి అదానీ గ్రూపు సంస్థలకు చెందిన కోట్లాది డాలర్ల విలువైన వాటాలను కొందరు వ్యక్తులు రహస్యంగా ట్రేడింగ్‌ చేశారని, అందులో ఆయన సోదరుడు కూడా ఉన్నాడని, ఈ ఉదంతంపై వారం రోజుల తర్వాత ఓ కథనాన్ని ప్రచురించబోతున్నామని, దానిపై అదానీ వివరణ కావాలని ఆ ఇ-మెయిల్‌ సారాంశం. ఈ నేపథ్యంలో మంగ్నాలే ఫోన్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ సంయుక్తంగా ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరిపాయి. అదానీని వివరణ కోరిన 24 గంటలలోనే దుండగులు మంగ్నాలే ఫోన్‌లో చొరబడి, అందులో పెగాసస్‌ను అమర్చారు. ఈ స్పైవేర్‌ను ఇజ్రాయిల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ అభివృద్ధి చేసింది. దానిని ప్రభుత్వాలకు మాత్రమే విక్రయించానని ఆ గ్రూప్‌ చెబుతోంది. పాత్రికేయులపై క్రూరమైన చట్టాలను ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడం, వారిపై విష ప్రచారం చేయడం, వేధించడం, భయపెట్టడం వంటి చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికితోడు చట్టవిరుద్ధమైన నిఘాతో జర్నలిస్టులకు ముప్పు కలిగిస్తున్నారని మా పరిశోధనలో తేలింది’ అని ఆమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్‌ అధిపతి డాన్‌ఛా ఓ సియర్‌భాయిల్‌ తెలిపారు. భారత్‌లోని కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని పెగాసస్‌ స్పైవేర్‌ను మరోసారి ప్రయోగించే అవకాశం ఉన్నదని సాంకేతిక పర్యవేక్షణ ప్రక్రియలో భాగంగా జూన్‌లోనే తమ సెక్యూరిటీ ల్యాబ్‌ గుర్తించిందని ఆమ్నెస్టీ తెలిపింది. కొన్ని నెలల తర్వాత కొత్తగా వాణిజ్య స్పైవేర్‌ వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు. రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ 2021లో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని కేంద్రం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

  • ఆనాడే హెచ్చరికలు

ప్రభుత్వ ప్రేరేపిత వ్యక్తులు లక్ష్యంగా ఎంచుకున్న ఐఫోన్‌ వినియోగదారులకు ఆపిల్‌ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వరదరాజన్‌, మంగ్నాలేతోపాటు భారత్‌లోని పలువురు పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలకు హెచ్చరిక నోటిఫికేషన్లు వచ్చాయి. అదానీ గ్రూపును తరచుగా విమర్శించే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, అదానీపై కథనం విషయంలో మంగ్నాలేతో కలిసి పనిచేసిన ఒసిసిఆర్‌పి పాత్రికేయుడు రవి నాయర్‌ ఈ విషయంపై బాహాటంగానే గళం విప్పారు. కొందరు భారతీయ రాజకీయ నాయకుల ఫోన్లను పరిశీలించిన న్యూయార్క్‌ సెక్యూరిటీ సంస్థ ‘ఐవెరిఫై’ కూడా ఈ ఆరోపణలు వాస్తవమేనని ధ్రువీకరించింది.

  • స్పైవేర్‌ అంటే…

ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తాను రూపొందించిన పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలకు విక్రయించింది. దీనిని ఎవరి ఐఫోన్‌లో అమరుస్తారో వారు పంపే ఫోన్‌ సందేశాలు, ఈ-మెయిల్స్‌, ఫొటోలు చూడవచ్చు. ఫోన్‌ సంభాషణలను సైతం వినవచ్చు. ఆయా వ్యక్తులు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తుల చిత్రాలను కెమేరాలో నిక్షిప్తం చేయవచ్చు.

➡️