4,04,031 మందికి వైఎస్‌ఆర్‌ ఆసరా

Jan 23,2024 18:03

  ప్రజాశక్తి-విజయనగరం :  వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంలో భాగంగా జిల్లాలోని 4,04,031 మంది డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి రూ.252.31 కోట్లు జమ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో, నాల్గవ విడత కింద జిల్లాలోని 36,507 సంఘాలకు నిధులు విడుదల చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మహిళా సంఘాల సభ్యులకు కలెక్టరేట్‌ విసి హాలులో అందజేశారు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఎంఎల్‌సి డాక్టర్‌ పి.సురేష్‌బాబు, ఎంఎల్‌ఎలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఆర్‌డిఎ పీడీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ తదితర సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న సొమ్ముతో స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించి, ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారని చెప్పారు. మూడు విడతలుగా కలిపి సుమారు రూ.754.13 కోట్లను ఇప్పటివరకు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారన్నారు. నాలుగో విడత కింద మరో రూ.252.31 కోట్లను ఈ రోజు సిఎం విడుదల చేశారని చెప్పారు. అన్ని మండలాల్లో వైఎస్‌ఆర్‌ ఆసరా ఉత్సవాలను నిర్వహించి ఈ నిధులను జమ చేస్తామని తెలిపారు.

➡️