- సిపిసి 19వ మహాసభల దిశానిర్దేశం
అయిదేళ్లకొకసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) జాతీయ మహాసభలు అక్టోబర్ 18 నుండి 24వ తేదీవరకు దేశరాజధాని బీజింగ్ నగరంలో జయప్రదంగా జరిగాయి. దేశ వ్యాపితంగా 8 కోట్ల 90 లక్షల మంది పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 2,280 మంది ప్రతినిధులు మహాసభకు హాజరై నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సి జిన్‌పింగ్ ప్రవేశపెట్టిన నివేదికపై చర్చించి, ఆమోదించిన అనంతరం 205 మంది సభ్యుల నూతన కేంద్ర కమిటీని, మరో 171 మంది ప్రత్యామ్నాయ సభ్యులను మహా సభ ఎన్నుకుంది. కొత్త కేంద్ర కమిటీ ఈ నెల 25న సమావేశమై 25 మందితో నూతన పొలిట్ బ్యూరోను, ఏడుగురు సభ్యుల పొలిట్ బ్యూరో స్థాయీ సంఘాన్ని ఎన్నుకుంది. సి జిన్‌పింగ్ రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
చైనా పార్టీ మహాసభల గురించి ఈ సారి చైనా ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. సాధారణంగా కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరిగేటప్పుడు విపరీతమైన దుష్ప్రచారాలకు పాల్పడే పశ్చిమ దేశాల మీడియా కూడా ఈసారి చైనా కమ్యూ నిస్టు పార్టీ మహాసభలో ప్రధాన కార్యదర్శి నివేదికలోని అంశాల గురించి ఆసక్తిగా చర్చిం చడం విశేషం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు చైనా ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడంతో బాటు ఏకధృవ ప్రపంచం నుండి బహుళ ధృవ ప్రపంచంవైపు పయనిస్తున్న అంతర్జాతీయ రాజ కీయాల్లో చైనా ప్రముఖ పాత్ర నిర్వహించడం కూడా దీనికి కారణం.
గత అయిదేళ్ల కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చైనా ఆర్థిక, సామాజిక, శాస్త్ర- సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలపై వర్క్ రిపోర్టులను మహాసభలో ప్రవేశపెట్టారు. ఈ కాలంలో చైనా ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా రూపొందింది. మరో నాలుగేళ్లలో- 2021లో శతవసంతో త్సవాలు జరుపుకోబోతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ తన వందేళ్ల చరిత్రలో మార్క్సిజం - లెనినిజం సిద్ధాంతాన్ని చైనా నిర్ధిష్ట పరిస్థితులకు వర్తింపజేస్తూ విప్లవాన్ని సాధించింది, సోషలిజం నిర్మాణంలో చోదక శక్తిగా పనిచేసింది. ప్రస్తుత 19వ జాతీయ మహాసభ కొత్త పరిస్థితిని విశ్లేషిస్తూ ''కొత్త శకంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిజం'' అన్న కొత్త సూత్రీకరణ చేసింది. దీన్ని సి జిన్‌పింగ్ ఆలోచనా విధానం పేరుతో చైనా కమ్యూనిస్టు పార్టీ నిబంధనా వళిలో చేర్చారు. నిజానికి చైనా మహా నేత మావో సె టుంగ్ నాయకత్వంలో చైనాలో విప్లవం జయప్రదం అయినప్పటినుండి పార్టీ చేసిన వివిధ విశ్లేషణలను పార్టీ నిబంధనా వళిలో చేరుస్తూ వచ్చారు. ఇవి మార్క్సిస్టు- లెనినిస్టు సిద్ధాంతాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు వర్తింప జేయడంలో మరింత పరిపుష్టం గావించాయని పార్టీ పేర్కొంది. ఆవిధంగా చైనా కమ్యూనిస్టు పార్టీ 'మార్క్సిజం-లెనినిజం, మావో ఆలోచనా విధానం, డెంగ్ సియావో పెంగ్ సిద్ధాంతం, మూడు ప్రాతినిధ్యాల సిద్ధాంతం, అభివృద్ధికి సంబంధించిన శాస్త్రీయ దృక్పథం' అనే సైద్థాంతిక పునాదిమీద నడుస్తుంది. ఇప్పుడు 'నూతన శకంలో చైనా లక్షణాలతో సోషలిజంపై సి జిన్‌పింగ్ ఆలోచనా విధానం' అన్న దాన్ని కూడా చేర్చారు.
మావో జీవించి ఉండగానే మావో ఆలోచ నా విధానం అన్న సూత్రీకరణను నిబంధనా వళిలో చేర్చారు. డెంగ్ చనిపోయిన తరువాత చైనా లక్షణాలతో సోషలిజం అన్న సిద్ధాంతాన్ని చేర్చారు. జియాంగ్ జెమిన్ ప్రధాన కార్యదర్శిగా ఉండగా మూడు ప్రాతినిధ్యాల సిద్ధాంతాన్ని చేర్చగా, హూ జింటావో హయాంలో అభివృద్ధికి సంబంధించిన శాస్త్రీయ దృక్పథం అన్న సూత్రీకరణను చేర్చారు. మావో తరువాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా సి జిన్‌పింగ్ జీవించి ఉండగానే ఆయన పేరుతో కొత్త సూత్రీ కరణను నిబంధనావళిలో చేర్చడం విశేషం.
కొత్త శకంలోకి చైనా లక్షణాలతో సోషలిజం
చైనా లక్షణాలతో కూడిన సోషలిజం కొత్త శకంలోకి ప్రవేశించిందని సి జిన్‌పింగ్ 19వ మహాసభలో ప్రవేశపెట్టిన నివేదికలో తెలియ జేశారు. ఈ కొత్త శకానికి అనుగుణంగా సోషలి జం నిర్మాణ వ్యూహాన్ని మహాసభ రూపొందిం చింది. ఇందులో రెండు దశలుంటాయి. మొదటి దశ 2021 (పార్టీ ఆవిర్భావ శతవార్షికోత్సవ సంవత్సరం) నుండి 2035 వరకు సుమారు 15 సంవత్సరాలు సాగుతుంది. రెండవ దశ 2035 నుండి 2049 (చైనా విముక్తి శతవార్షిక సంవత్సరం) వరకు మరో 15 ఏళ్ల పాటు సాగుతుంది.
1960వ దశకంలో సాంస్కృతిక విప్లవ కాలంలో 'మహా ముందడుగు' అన్న దుందుడుకు నినాదం నుండి చైనా కమ్యూనిస్టు పార్టీ బయట పడిన తరువాత డెంగ్ సియావో పెంగ్ చైనాలో సోషలిజం నిర్మాణానికి సుదీర్ఘకాలం పడుతుం దని చెప్పారు. ఉత్పత్తి శక్తులు అంతగా అభివృద్ధి కాని చైనాలో సోషలిజం ప్రాథమిక దశలో ఉందని చెపారు. ఈ దశలో సోషలిజం నిర్మాణా నికి ఆయన హయాంలో పార్టీ రూపొందించిన వ్యూహం 'చైనా లక్షణాలతో సోషలిజం నిర్మాణం' గా స్థిరపడింది. దేశంలో సంపద సృష్టించడం, పేదరికాన్ని నిర్మూలించడం, ప్రజల కనీసావస రాలు తీర్చడం ఈ దశ ప్రధాన లక్ష్యం. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఈ వ్యూహాన్ని వివిధ దశల్లో జయప్రదంగా అమలు పరచడం వల్ల చైనా ఆర్థికంగా శరవేగంతో అభివృద్ధి చెందింది. అత్యంత పేద దేశంగా, 'తూర్పున రోగగ్రస్థ దేశం'గా పేరు గాంచిన చైనా చారిత్ర కంగా అతి కొద్ది కాలంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. పారి శ్రామిక విప్లవ కాలం నుండి కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచాన్ని దోచుకుని అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలకు దీటుగా అనతి కాలంలోనే చైనా అభివృద్ధి సాధించిందంటే దానికి కమ్యూనిస్టు పార్టీ దూరదృష్టీ, కృషీ కారణం.
అయితే ప్రభుత్వ రంగంతోపాటుగా ప్రయి వేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్స హించడం ద్వారా సంపద పెంచుకునే కార్య క్రమం వల్ల దేశంలో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య అసమానతలు విపరీతంగా పెరిగాయి. పర్యావరణానికి తీవ్రమైన హాని జరిగింది. వినిమయ దారీ సంస్కృతి బాగా వ్యాపించింది. నూతన శకంలో ఈ రుగ్మతల నుండి బయట పడాలని సి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.
2021 నాటికి చైనాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి ఆర్థిక వ్యవస్థను ఒక మోస్తరు సౌభాగ్యవంతమైన దేశంగా మార్చడం, ఆ ఆర్థిక పునాది మీద రాబోయే 30 ఏళ్లలో చైనాను 'మహత్తర ఆధునిక సోషలిస్టు దేశం'గా రూపొందించడం కొత్త శకంలో కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ శకంలో దేశం లో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య అసమాన తలు తగ్గించడానికి కృషి చేస్తారు. ప్రభుత్వ రంగా న్ని పటిష్ట పరుస్తారు. సోషలిజాన్ని సంపూర్ణ అభివృద్ధివైపు తీసుకుపోతారు. ఈ శకం మొదటి దశలో 2035 నాటికి ఆర్థిక వ్యవస్థ ఆధునీకర ణను పూర్తి చేస్తారు. రెండో దశ పూర్తయ్యేనాటికి చైనాను 'సౌభాగ్యవంతమైన, బలమైన, ప్రజా తంత్రయుతమైన, సాంస్కృతికంగా పురోగమిం చిన, సామరస్యపూరితమైన, సుందరమైన మహత్తర ఆధునిక సోషలిస్టు దేశంగా' రూపొం దించడానికి కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా కృషి చేయాలని మహాసభ నిర్దేశించింది.
ఈ లక్ష్యం సాధించాలంటే చైనా సమాజం లో నేడు నెలకొన్న ప్రధాన వైరుధ్యాన్ని పరిష్కరిం చడం అవసరం అని పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికలో పేర్కొన్నారు. దేశంలో 'అసమాన, అసంపూర్ణ అభివృద్ధికీ, ప్రజల్లో మంచి జీవనం కోసం పెరుగుతున్న అవసరాలకూ మధ్య ఉన్న వైరుధ్యం' ఇది. మరింత ఉన్నత జీవనం కోసం ప్రజలు కోరుకుంటున్న అవసరాలు ఈనాడు బాగా విస్తృత మవుతున్నాయి. వారి భౌతిక, సాంస్కృతిక అవసరాలు పెరగడమే కాదు, మరింత ప్రజాస్వామ్యం కోసం, చట్టబద్ధమైన పాలన కోసం, ధర్మం, న్యాయం, భద్రత, మరింత మెరుగైన వాతావరణం కోసం వారి డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి అని నివేదిక పేర్కొంది.
దీనిపై చైనా పార్టీ పత్రికల్లో ఈ క్రింది వివరణ ఇచ్చారు: చైనా యువకులు నేటికీ మరింత మంచి చదువుల కోసం అమెరికా, యూరప్ తదితర దేశాల్లోని మంచి విశ్వ విద్యా లయాలకు వెళుతున్నారు. అంటే అటువంటి చదువు కావాలని వారు కోరుకుంటున్నారు. అలాగే దేశంలో సుందర ప్రదేశాలను సందర్శిం చాలనీ, కొన్నాళ్లు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనీ కోరుకుంటున్నారు. కానీ వారి అవసరాలకు తగ్గ సదుపాయాలు దేశంలో లేవు. అత్యుత్తమ వైద్యం తమకు అందుబాటులో ఉండాలని కోరు కుంటున్నారు. ఇటువంటి సదుపాయాలన్నిటినీ దేశంలోనే నిర్మించినప్పుడు మాత్రమే పెరుగు తున్న ప్రజల అవసరాలను తీర్చగలం. కొత్త వైరుధ్యాన్ని పరిష్కరించగలం.
ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలంటే చైనా ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని సి జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా ఆర్థిక వ్యవస్థ శీఘ్రాభివృద్ధి దశ నుండి ఉన్నత ప్రమాణాలుగల అభివృద్ధివైపు పరివర్తన చెందాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో దేశం నిజ ఆర్థిక వ్యవస్థపై కేంద్రీకరించాలి. చైనా మరింత బలంగా మారాలంటే, మరింత పనితనం పెంచుకోవాలంటే, మరింత మెరుగైన అభివృద్ధి సాధించాలంటే దేశంలో ప్రభుత్వ పెట్టుబడిని ప్రోత్సహించాలి. చైనా సంస్థలను ప్రపంచ స్థాయిగల, ప్రపంచ స్థాయిలో పోటీపడగల సంస్థలుగా అభివృద్ధి చేయాలి. దేశ ప్రజల విని యోగంపై ఆధారపడి అభివృద్ధి సాధించడానికి చైనా ప్రాధాన్యత నిస్తుందని జిన్‌పింగ్ చెప్పారు. అదే సమయంలో చైనా ప్రపంచానికి తన తలుపులు మూసివేయబోదనీ, నిజానికి అది మరింత తెరుస్తుందనీ పేర్కొన్నారు.
దేశంలో చట్టబద్ధ పాలనను మరింత బలపరచడం కోసం చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర స్థాయిలో ఒక నాయకత్వ గ్రూపును ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలూ నడుచుకునేట్లు ఇది చూస్తుంది.
చైనాను రెండు దశల్లో ఆధునికం చేసే క్రమంలో సుందరంగా తీర్చిదిద్దాలి, అంటే అర్థం మనిషికీ, ప్రకృతికీ మధ్య సామరస్యంతో కూడిన సహజీవనం నెలకొల్పడమేనని నివేదిక వివరణ ఇచ్చింది. వాతావరణ పరిరక్షణకు చైనా అధిక ప్రాధాన్యత నిస్తుంది. ప్రభుత్వ సహజ వనరులను నిర్వహించడానికీ, సహజ పర్యావరణ వ్యవస్థ లను అంటే అడవులు, నదులు, సముద్రాలను రక్షించడానికీ, రక్షిత అటవీ ప్రాంతాలను పెంపొందించడానికీ రెగ్యులేటరీ సంస్థలను నెలకొల్పుతుందని నివేదికలో పేర్కొన్నారు.
నిజానికి పర్యావరణ పరిరక్షణ కోసం చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఒకనాడు చైనా రాజధాని నగరం బీజింగ్‌లో వాతావరణ కాలుష్యంతో ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. గత అయిదేళ్ల కాలంలో బీజింగ్ చుట్టుపక్కల వేలాది కాలుష్యకారక పరిశ్రమలను తొలగించారు. ఉత్తర ప్రాంతంలో అనేక బొగ్గు గనులను మూసేశారు. పునరుత్పత్తి ఇంధన వనరులను ముఖ్యంగా సౌరవిద్యుత్‌ను వినియో గించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత నిస్తు న్నారు. ఎంతగానంటే ఇటీవలెనే సౌరవిద్యుత్ రంగంలోకి ప్రవేశించిన చైనా నేడు 130 గిగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2014 నాటికి ప్రపంచంలోని మొత్తం సౌర విద్యుత్తు స్థాపక సామర్ధ్యంలో 70 శాతం చైనాలోనే ఉంది. గత ఒక్క ఏడాదిలోనే దేశంలో ఈ విద్యుత్తు ఉత్పత్తి 81 శాతం పెరిగింది. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 20 శాతాన్ని పునరుత్పత్తి ఇంధనంతో పూరించాలని ప్రణాళిక వేసింది.
2035 నాటికి చైనా సైన్యం ఆధునీకరణ పూర్తి చేయాలని నివేదికలో నిర్దేశించారు. 2020 నాటికి సైన్యంలో యాంత్రీకరణను పూర్తి చేస్తారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. 2049లో చైనా విముక్తి శతవార్షికోత్సవం నాటికి చైనా ప్రజా సైన్యం ప్రపంచ స్థాయి సైనికశక్తిగా ఎదగాలని నిర్దేశించారు. చైనా ఏ స్థాయికి అభివృద్ధి చెందినప్పటికీ ఆధిపత్యానికీ, దురాక్రమణలకూ సంకల్పించదని సి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అవినీతిపై గత అయిదేళ్ల కాలంలో జరిపిన యుద్ధాన్ని విజయవంతంగా ముగిస్తామని నివేదికలో పేర్కొన్నారు.
గతంలో మాదిరిగానే కొత్త శకంలో చైనా లక్షణాలతో సోషలిజం నిర్మించడంలో కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ చోదక శక్తిగా పనిచేస్తుంది. ''దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కృషికి పార్టీ నాయకత్వం వహిస్తుంది'' అని జిన్‌పింగ్ నివేదికలో చెప్పారు. ''చైనా లక్షణాలతో సోషలిజాన్ని నిర్మించడంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అత్యంత ముఖ్యమైన ఆధారం, ఈ వ్యవస్థకు పార్టీయే మహత్తర బలం అని ఈ మహాసభ ఉద్ఘాటిస్తున్నది'' అని నివేదిక ప్రకటించింది. చైనా ప్రజా సైన్యం పైన పార్టీకి తిరుగులేని నాయకత్వం ఉంటుంది. కొత్త శకంలో కూడా వనరుల పంపిణీలో మార్కెట్ శక్తులకు ''నిర్ణయాత్మక పాత్ర'' ఉంటుంది. వీటితోబాటు అవినీతిపై యుద్ధం, ఒక బెల్టు, ఒక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం, సరఫరా వైపు సంస్కరణలు వంటి అంశాలను కూడా నివేదికలో పేర్కొన్నారు.
ఒక మోస్తరు సౌభాగ్యవంతమైన దేశం
2020 నాటికి చైనాను ఒక మోస్తరు సౌభాగ్య వంతమైన దేశంగా అభివృద్ధిచేయడం కమ్యూనిస్టు పార్టీ తక్షణ లక్ష్యంగా 19వ మహాసభ నిర్ణయించింది. నిజానికి 2002లో జరిగిన పార్టీ 16వ మహాసభలోనే ఈ లక్ష్యం నిర్ణయించారు. తరువాత 17,18 మహాసభల్లో ఈ లక్ష్య సాధనకు కృషిని ముందుకు తీసుకు పోయారు. ఈ పునాది మీద ఆధారపడి తరువాతి మూడు దశాబ్దాల్లో దేశాన్ని మహత్తర ఆధునిక సోషలిస్టు దేశంగా నిర్మించాలనేది తదుపరి లక్ష్యం. 2020 నాటికి చైనాను ఒక మోస్తరు అభివృద్ధి చెందిన దేశం స్థాయికి... అంటే ఐరోపాలోని అనేక మధ్యస్థ దేశాల స్థాయికి తీసుకుపోవాలంటే శాస్త్ర- సాంకేతికా భివృద్ది, విద్య మీద కేంద్రీకరించాలని మహాసభ నిర్ధేశించింది. పరిశోధన, అభివృద్ధికి నిధులు మరింత పెంచడం, ఉన్నత సెకండరీ విద్యను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ కృషిలో భాగం. ఆవిష్కరణల ఆధార అభివృ ద్ధి, కార్మికుల నాణ్యత పెంచడం, గ్రామీణ ప్రాంతాలను పట్టణీకరించడం ఇందులో భాగం గా ఉంటుంది. మొత్తం మీద ప్రజల పెరుగు తున్న అవసరాలను తీర్చడం ద్వారా సమాజం లో ఏర్పడిన వైరుధ్యాన్ని పరిష్కరించాలన్నది ఈ కాలంలో పార్టీ అనుసరించే వ్యూహం.
గత అయిదేశ్లలో చైనా అభివృద్ధి
2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిన తరువాత అమెరికా, ఐరోపా దేశాలతో బాటు అనేక వర్థమాన దేశాల ఆర్థిక పురోగమనం తల్లకిందులైంది. ఎగుమతి ప్రధా నంగా నడుస్తున్న చైనా మీద కూడా దాని ప్రభా వం పడింది. అయితే చైనా ప్రభుత్వం మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక విధానాల్లో మార్పులు చేసుకుంది. ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచే ప్రత్యామ్నాయ విధానాల వైపు మళ్లింది. ఫలితంగా సంక్షోభ కాలంలోనూ దాని ఆర్థికాభివృద్ధి కొనసాగుతోంది. కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ మహాసభల తరువాత గడచిన అయిదేళ్ల కాలంలో చైనా సాధించిన అభివృద్ధి దీనికి నిదర్శనం.
ఆర్థికాభివృద్ధి: 2013 -2016 మధ్య నాలుగేళ్ల కాలంలో చైనా స్థూల జాతీయోత్పత్తి ఏటా 7.2 శాతం పెరిగింది. ఈ కాలంలో వర్థమాన దేశాల సగటు అభివృద్ధి 4 శాతం కాగా ప్రపంచ సగటు 2.6 శాతం. ఈ ఏడాది చైనా జిడిపి వృద్ధి 6.9 శాతం ఉంటుందని అంచనా. భారత దేశ వృద్ధి అంచనా 5.7 శాతం. వస్తూత్పత్తి రంగంలో చైనా నేటికీ ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్నప్పటికీ దాని సేవా రంగం జిడిపి కన్నా ఎక్కువగా పెరుగుతోంది. అందువల్ల 2012లో జిడిపిలో సేవా రంగం వాటా 45.3 శాతం ఉండేది. ఈ అయిదేళ్లలో అది 51.6 శాతానికి పెరిగింది. 2017 ప్రథమార్థంలో ఇది మరింత పెరిగి జిడిపిలో 54.1 శాతానికి చేరుకుంది.
ఉద్యోగ కల్పన: ఈ కాలంలో చైనా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి 1 కోటి 30 లక్షలు చొప్పున ఉద్యోగాలు సృష్టించింది. 2017 తొలి ఎనిమిది మాసాల్లో 97 లక్షల ఉద్యోగాలు కల్పించారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణా లకు వచ్చి ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఈ కాలంలో ఏడాదికి 1.8 శాతం చొప్పున పెరిగిం ది. ఉద్యోగ కల్పనలో గణనీయమైన అభివృద్ధి సాధించింది కాబట్టే ఈనాడు చైనాలో నిరుద్యో గం ప్రపంచంలోనే తక్కువగా ఉంది. యువత లో నిరుద్యోగం-అభివృద్ధి చెందిన ఓఇసిడి దేశా ల్లో 14.6 శాతం, భారత్‌లో 31 శాతం ఉండ గా చైనాలో 11.22 శాతం మాత్రమే ఉంది.
ప్రజల ఆదాయం: 2012 -2016 మధ్య అయిదేళ్ల కాలంలో చైనా ప్రజల తలసరి ఆదాయం ఏడాదికి 7.4 శాతం చొప్పున పెరి గింది. 2012లో తలసరి వార్షిక ఆదాయం 7,311 యువాన్లు (సుమారు 73,000 రూపా యలు) నుండి 2016 నాటికి 23,821 యువా న్లకు (సుమారు 2 లక్షల 30 వేల రూపాయ లకు) పెరిగింది. 2016లో భారత తలసరి వార్షికాదాయం రూ. 93,000 తో పోల్చినప్పు డు చైనీయుల ఆదాయం రెండున్నర రెట్లు ఎక్కువ.
ఈ కాలంలో చైనాలో గ్రామీణ పేదరి కాన్ని గణనీయంగా తగ్గించారు. మారుమూల గ్రామీణ ప్రజల తలసరి ఆదాయాన్ని ఏటా 10.7 శాతం పెంచుతూ గ్రామీణ పేదల సంఖ్యను అయిదేళ్లలో 10 కోట్ల నుండి నాలుగు కోట్లకు తగ్గించారు. 2020 నాటికి దేశంలో అసలు పేదరికం లేకుండా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కమ్యూనిస్టుపార్టీ కృషి చేస్తోంది.
పరిశోధన, అభివృద్ధి: చైనా ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధి రంగంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అయిదేళ్ల కాలంలో ఈ రంగంపై ఖర్చును 52.2 శాతం పెంచింది. జిడిపిలో పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు వాటా అయిదేళ్ల క్రితం 1.91 శాతం ఉండేది కాస్తా 2016 నాటికి 2.11 శాతానికి పెరిగింది.
రానున్న అయిదేళ్లకు ప్రజా సంక్షేమ లక్ష్యాలు
సిపిసి 19వ మహాసభ రానున్న అయి దేళ్లకు గాను ప్రజా సంక్షేమానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది. అవి:
2020 నాటికి దేశంలో పేదరికం లేకుం డా చేయాలి. అలా చేయాలంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చిట్టచివరి వ్యక్తిని కూడా పేదరికం నుండి బయట పడేయడం లక్ష్యంగా పనిచేయాలి.
సీనియర్ సెకండరీ విద్య అందరికీ అందు బాటులో ఉండేట్లు చేయాలి. దేశంలో మారు మూల గ్రామాలతో సహా అందరికీ తప్పని సరి విద్య గరపాలి. ప్రీ స్కూల్ విద్య, ప్రత్యేక అవస రాలకు విద్య, ఆన్లైన్ విద్యను ప్రోత్సహించాలి. ఉన్నత ప్రమాణాలు గల వైద్యం అందించేందుకు చైనా విలక్షణ వైద్య సేవలను రూపొందించాలి. ఆసుపత్రుల యాజమాన్యాన్ని ఆధునీకరించాలి.
రానున్న తరాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ నాగరికతను నిర్మించాలి. నదులు, పర్వతాలు, అడవులు, సముద్రాలు ఇతర పర్యా వరణ వ్యవస్థలను కాపాడుకుంటూ 'సుందర మైన' చైనాను నిర్మించుకోవాలి.
పౌరుల ఉపాధి, వేతనాలు క్రమంగా పెరిగేట్లు చూడాలి. నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడం, ఉత్పాదకతకూ, ఆర్థికాభివృద్ధికీ అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలి.
పౌరులందరికీ మరింత మెరుగైన గృహాలు సమకూర్చాలి. దేశంలో స్పెక్యులేషన్ కోసం కాకుండా ప్రజల నివాసం కోసం గృహనిర్మాణం జరగాలి అని 19వ మహాసభలో సి జిన్‌పింగ్ ప్రవేశపెట్టిన నివేదిక పేర్కొంది.
చైనా ప్రజల అభివృద్ధికి చోదక శక్తి
19వ మహాసభలు జరుపుకొనే నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీలో 8.9 కోట్ల మంది సభ్యులున్నారు. దేశ జనాభాలో వీరి సంఖ్య 6.8 శాతం. 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఆ సంవత్సరం తొలి మహాసభ జరుపుకొన్నప్పుడు పార్టీలో సభ్యుల సంఖ్య కేవలం 50 మంది. నాటి నుండి నేటివరకు దాదాపు శతాబ్ద కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అనేక ఒడిదుడుకుల నెదుర్కొంది. అశేష త్యాగాలు చేసింది. ఫ్యూడల్ బంధనాలనుండి, విదేశీ ఆధిపత్యం, దురాక్రమణల నుండి, కొమిం టాంగ్ సైనిక నియంతృత్వం నుండి చైనా ప్రజల ను విముక్తి గావించే క్రమంలో జరిగిన వీరోచిత పోరాటాల్లో అనేక లక్షల మంది పార్టీ సభ్యులు ప్రాణాలు త్యాగం చేశారు. ఈ పోరాటానికి నాయకత్వం వహించి చైనా ప్రజల విముక్తికి చోదక శక్తిగా పనిచేసింది చైనా కమ్యూనిస్టు పార్టి. మావో నాయకత్వంలో పార్టీ మార్క్సిజం- లెనినిజాన్ని చైనా పరిస్థితులకు సృజనాత్మకంగా వర్తింప చేయడం ద్వారా విప్లవాన్ని జయప్రదం చేసింది. 1949లో చైనా విముక్తి చెందింది. అప్పటికి దేశం అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనుకబడి ఉంది.
విప్లవ ప్రభుత్వం దున్నే వారికి భూమి పంచింది. భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు నెలకొల్పింది. ప్రజలకు ప్రాథమిక విద్య, వైద్యం సమకూర్చింది. ఈ చర్యలు చైనా సమాజంలో కొత్త జవసత్వాలు నింపాయి. కానీ పార్టీలో తలెత్తిన దుందుడుకు వాదం సమాజాభివృద్ధి స్థాయితో నిమిత్తం లేని నినాదాలు ఇవ్వడం వల్ల 1966 నుండి ఒక దశాబ్దం పాటు చైనా సమాజం తీవ్రమైన సమస్యల నెదుర్కొంది. 1978లో డెంగ్ సియావో పింగ్ నాయకత్వంలో ఈ తప్పిదాలను దిద్దుకుంటూ 'చైనా లక్షణాలతో కూడిన సోషలిజం' నినాదం కింద అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. 1982లో జరిగిన 12వ మహాసభ ఈ నినాదాన్ని, ఆర్థిక సంస్కరణ లను ఆమోదించింది మొదలు వివిధ మహా సభల్లో నాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థి తులకు అనుగుణంగా అభివృద్ధి వ్యూహంలో మార్పులు చేసుకుంటూ వస్తోంది.
1989లో చైనా సోషలిస్టు వ్యవస్థ 'ప్రజా స్వామ్య ఉద్యమం' రూపంలో సోషలిస్టు వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కొంది. అమెరికా సామ్రాజ్య వాదుల దర్శకత్వంలో బీజింగ్‌లోని తియా న్మెన్ చౌక్‌లో జరిగిన ఈ తిరుగుబాటును పార్టీ జయప్రదంగా ఎదుర్కొంది. తరువాత 1990 దశకం ప్రారంభంలో సోషలిజానికి తగిలిన ఎదురుదెబ్బలను కాచుకుంది. చరిత్ర అంతమైందనీ, కమ్యూనిజానికి కాలం చెల్లిం దన్న నినాదాలు, సిద్ధాంతాలను తిప్పికొట్టింది. మార్క్సిజం లెనినిజాన్ని కాలమాన పరిస్థితులకు సృజనాత్మకంగా వర్తింపజేస్తూ ప్రపంచంలో అత్యంత వెనుకబడిన చైనాను నేడు ఆర్థిక, సామాజిక, శాస్త్ర-సాంకేతిక, సైనిక రంగాల్లో శక్తివంతమైన దేశంగా మార్చింది. నిజానికి 30 ఏళ్ల కాలంలో 80 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి విముక్తిగావించి సోషలిస్టు చైనా ప్రపంచ చరిత్రలోనే ఒక మహాద్భుతం చేసిందని ప్రపంచ బ్యాంకు ఒక సర్వే నివేదికలో పేర్కొంది. సోషలిజానికి నూకలు చెల్లాయనీ, కమ్యూ నిజానికి కాలం చెల్లిందనీ సామ్రాజ్యవాదులు ఒక వైపు ప్రచారం చేస్తూ వుంటే కమ్యూనిజమే ప్రజలను పేదరికం నుండీ, ఆకలి, అవిద్య, అనారోగ్యాలనుండీ విముక్తి గావించే ఏకైక సిద్ధాంతమనీ, సోషలిజంలో మాత్రమే ప్రజలు నిజమైన అభివృద్ధి సాధిస్తారనీ చైనా నిరూపించింది. అందుకే చైనా కమ్యూనిస్టు పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్లు 1921లో పుట్టినప్పుడు 50 మంది సభులతో ఉండేది నేడు 9 కోట్ల మందితో జర్మనీ జనాభాను మించిపో యేంత ఎదిగింది. సోషలిజానికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుల సంఖ్య సుమారు 4.6 కోట్లు. ఈ పాతికేళ్లలో అది రెట్టింపైంది.
అయితే చైనా సమాజానికి సమస్యలు లేవ ని కాదు. సోషలిస్టు సమాజంలో పెట్టుబడిదారీ సంస్కరణలు తెచ్చినప్పుడు ఆ వ్యవస్థకు సంబం ధించిన అనేక రుగ్మతలు కూడా వచ్చి చేరాయి. గాలికోసం కిటికీలు తెరిచినప్పుడు ఈగలు కూడా వస్తాయి, వాటిని జాగ్రత్తగా నిర్మూలిం చడం మినహా మరో మార్గం లేదని డెంగ్ సియావో పెంగ్ చెప్పారు. సమాజంలో ప్రవేశిం చిన రుగ్మతలు కమ్యూనిస్టు పార్టీలోకి కూడా వస్తాయి. చైనా పార్టీ ఇటీవలి కాలంలో ఎదు ర్కొంటున్న పెద్ద సమస్య అవినీతి. పార్టీలోనూ, అధికారుల్లోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయి చివరికి పార్టీ జవసత్వాలనే తినేసే స్థితికి చేరుకుందని చైనా పార్టీ నాయకత్వం గుర్తించింది. 18వ మహాసభలో సి జిన్‌పింగ్ ప్రధాన కార్యదర్శి అయ్యాక అవినీతిపై పార్టీ యావత్తూ పెద్ద యుద్ధం చేసింది. పార్టీ కేంద్ర కమిటీ కింద 'క్రమశిక్షణా పర్యవేక్షణ కోసం కేంద్ర కమిషన్' ను నియమించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు 12 లక్షల మంది సభులపై చర్యలు తీసుకున్నట్లు, 2.4 లక్షల మంది పార్టీ నాయకులకు శిక్ష విధించినట్లు కమిషన్ తన నివేదికలో తెలిపింది. అనేక మంది అవినీతి అధికారులను జైలుకు పంపారు, తీవ్రమైన అవినీతికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించారు. అవినీతిపై యుద్ధంలో పూర్తి విజయం సాధించాలని జిన్‌పింగ్ మహాసభలో ప్రకటించారు.
ఇటువంటి సమస్యలను అధిగమిస్తూనే 140 కోట్ల మంది చైనా ప్రజలను పేదరికం నుండి విముక్తి చేసి, చైనాను అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్ది, సోషలిజం ఔన్నత్యాన్ని విశ్వమంతటా వ్యాప్తి చేస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీకి 19వ మహాసభల సందర్భంగా జేజేలు.
- ఎస్. వెంకట్రావు