370 రద్దుకు సమర్థన

  • ప్రభుత్వ చర్యకు వంత పాడిన సుప్రీం
  • జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి
  • 2024 సెప్టెంబర్‌ 30 లోగా ఎన్నికలు జరపండి

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్ధించింది. ఈ అధికరణ తాత్కాలికమైనదేనని, దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని స్పష్టం చేసింది. జమ్ముకాశ్మీర్‌్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. రాష్ట్రపతి ఆదేశం పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఈ నిర్ణయం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సిపిఐ(ఎం) పిటిషన్‌తో సహా 23 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించి ఒక ప్రధానమైన తీర్పును, మరో రెండు ఉప తీర్పులను ఇచ్చింది. న్యాయమూర్తులు సంజరు కిషన్‌ కౌల్‌, సంజరు ఖన్నా, బిఆర్‌ గవారు, సూర్యకాంతతో కూడిన ఈ రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించే సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకాశ్మీర్‌కు అంతర్గత సార్వభౌమాధికారం లేదని, రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయలేరని చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే సమయంలో పొందుపరచిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 తాత్కాలిక నిబంధన అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొంది. ఏదైనా ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా? లేదా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమేమీ లేదని వ్యాఖ్యానించింది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీ లోగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్‌ ఐదవ తేదీన పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం ఆగస్ట్‌ 2 నుండి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్‌ 5న తీర్పున రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం సోమవారం దానిని వెలువరించింది.

సుప్రీం చారిత్రాత్మక తీర్పు : మోడీ

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది. ఆగస్టు 5, 2019న పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తుంది. జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌లోని మా సోదర సోదరీమణులకు ఒక ఆశను కల్పించింది. సర్వోన్నత న్యాయస్థానం అపారమైన జ్ఞానంతో భారతీ యులుగా మనం ఎంతో ప్రేమించే, గౌరవించే ఐక్యత యొక్క సారాంశాన్ని బలపరి చింది. అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు ప్రగతి ఫలాలు అందేలా చూస్తాం. ఈ తీర్పు ఒక ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తు యొక్క వాగ్ధానం. బలమైన, మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించాలనే మా సమిష్టి సంకల్పానికి నిదర్శనం.

రద్దుపై విభేదిస్తున్నాం : కాంగ్రెస్‌

ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఆర్టికల్‌ 370 అనేది గౌరవానికి అర్హమైనదిగా పేర్కొంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని కాంగ్రెస్‌ ‘గౌరవప్రదంగా’ అంగీకరించదని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పి చిదంబరం స్పష్టం చేశారు. ‘అలాగే, ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనూ మేం గౌరవపూర్వకంగా విభేదిస్తున్నాం. భారత రాజ్యాంగానికి అనుగుణంగా సవవరించబడే వరకు ఆర్టికల్‌ 370 గౌరవానికి అర్హమైనది’ అని చిదంబరం తెలిపారు. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రహోదా పునరుద్ధరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు చేసిన పరిశీలనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ పేర్కొంది.

➡️