- ఎస్.వీరయ్య
అధికార, ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేదు. వామపక్షేతర పార్టీలన్నీ సరళీకృత ఆర్థిక విధానాలకే అంటకాగుతున్నాయి. జనం ప్రత్యా మ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యా మ్నాయ విధానాలతో ప్రజలను సమీకరించగల రాజకీయ శక్తి నేటి అవసరం. అలాంటి ప్రత్యామ్నాయాన్ని కూడగట్టాల్సిన కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉన్నది. దాని ఫలితమే విధానాల్లో తేడా లేకపోయినా, ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ అధికారంలోకి వసు ్తన్నాయి. అధికార పార్టీ మీద పెరిగిన అసంతృ ప్తిని సమీప ప్రత్యర్థిగా ఉన్న మరొక పార్టీ సొమ్ము చేసుకుంటున్నది. ప్రజలు పదేపదే మోస పోతున్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిన బాధ్యత వామపక్షాలదే. సమా జంలో ఇప్పుడున్న పాలక పక్షాలకు వ్యతిరేకం గా గాని, వీరు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా గాని పనిచేయడానికి అనేక శక్తులు, వ్యక్తులు, సంస్థలు లేకపోలేదు. కమ్యూనిస్టులతో కలిస్తే ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజలను సమీకరించగలమన్న విశ్వాసం వారికి కలిగితే తప్పకుండా కలిసి వస్తారు. అలాంటి విశ్వాసం కలిగించాలంటే కమ్యూనిస్టు పార్టీ అన్ని మండలాల్లో పని చేయాలి. విస్తరిం చాలి. ప్రజలకు అందుబాటులోకి రావాలి. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లోనైనా బలమైన ప్రజాపునాది ఏర్పరచుకోవాలి. అప్పుడే కమ్యూ నిస్టుల స్వంత పునాది ఇతర శక్తులకు విశ్వాసం కల్పిస్తుంది. ఒకరి బలం ఒకరికి తోడవుతుంది. నూతన శక్తి ఆవిర్భవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే కమ్యూనిస్టు పార్టీ అన్ని మండలాలకు విస్తరించాలి. అవకాశం ఉన్నచో టల్లా ప్రజా పునాదిని బలోపేతం చేసుకోవాలి. ఇది ప్రణాళికాబద్దంగా జరగవలసిన పని. ఎన్నికల తేదీలతో నిమిత్తం లేకుండా జరగాలి. ప్రజల సమస్యలపై పనిచేయడం వల్లజరగాలి. ప్రజలకు చేరువ కావాలి.
కమ్యూనిస్టు పార్టీ లేనిచోట నిర్మించడం ఎట్లా అన్నదే సమస్య. కార్యకర్తలు లేరు, సభ్యులు లేరు, ఏతోడూ లేని ఒక్కగానొక్క కార్యకర్త ఏమి చేయగలరన్నది మనముందున్న సమస్య. ఒక్కరు కూడా లేని చోటికి కనీసం ఒకరిని పంపించ డమే మార్గం. ఒక కార్యకర్త ఉన్నప్పుడు చేయగ లిగిందేమిటన్నది పరిశీలించవలసిన సమస్య. ఒక్క కార్యకర్త ఉన్నచోట చేయగలిగిం దేమీ లేదనుకుంటే పార్టీ లేని చోట పార్టీని నిర్మిం చడం సాధ్యం కాదని భావించాలా? అంటే పార్టీ విస్తరణకు మార్గం లేదా? పార్టీ ఉన్నచోట పునాది బలపర్చుకోవడం సమస్యగా ఉన్నది. పార్టీ లేనిచోటికే గదా విస్తరించా ల్సింది. లేదు కాబట్టే కదా విస్తరించాల్సింది. పార్టీ ఆకాశం నుండి ఊడిపడదు. ఎవరో ఒకరు ప్రారంభించాల్సిందే. ఆ ఒక్కరు నేనే కావాలి గదా! జనం సమస్య మీద నేను పనిచేస్తే జనానికి నేను దగ్గరవుతాను గదా! ఆ జనం నా పార్టీకి దగ్గరవుతారు గదా! దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించింది కూడా ఒక్కరే. అమీర్ హైదర్ఖాన్ను ఈనాటికీ గుర్తుచేసుకుంటున్నాము. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీకి విత్తనం వేసింది కూడా ఒక్కరే. అందుకే కారల్ మార్క్స్‌ను ప్రపంచం మరువజాలదు. ఎవరో ఒక్కరు ప్రారంభిం చాల్సిందే. ఆ ఒక్కరు ఎవరో ఎందుకు కావాలి? అది నేనే కావాలని ప్రతీ కమ్యూనిస్టు భావిం చాలి. పార్టీ లేని చోట నేను నిర్మించాలని నిర్ణ యించుకోవాలి. ఆ బాధ్యత పార్టీ నాకు అప్పజెప్పితే అందుకు సిద్దపడాలి.
సమస్యలతో సతమతమవుతున్న జనం సహాయం కోసం నన్ను సంప్రదించాలా? లేక జనం దగ్గరకు నేను పోవాలా? రెండూ తప్పు కాదు. సాధారణంగా రెండూ జరుగుతూనే ఉంటాయి. జనం మన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే మన పని సులభతరం అవుతుంది కూడా. కానీ నీరు పళ్ళమెరుగునన్నట్లు జనం సహజంగా పోయేది అధికారపక్షం వైపు, పైరవీకారులవైపే. అధికారంలో ఉన్నవారు సమస్యను పరిష్కరించగలరన్న నమ్మకంతో పోతారు. అధికారులను ప్రభావితం చేసి పని చేసిపెట్టగలరన్న విశ్వాసంతో ప్రజా ప్రతినిధుల దగ్గరకు పోతారు. లంచం ఇస్తే పది రూపా యలు పోయినా పని అవుతుందన్న ఆశతో పైరవీకారులను ఆశ్రయిస్తారు. అందుకే జనం నా దగ్గరకు వస్తే సహాయం చేస్తానని అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. పార్టీ బలంగా ఉంటే నా దగ్గరకు కూడా వస్తారు. పార్టీ లేనప్పుడు, ఒకరిద్దరు కార్యకర్తలు మాత్రమే ఉన్నప్పుడు అధికారపక్షాన్ని లేదా దానికి చేరువగా ఉన్నవారిని వదిలి మన దగ్గరకు తమంతట తాము వస్తారనుకోవద్దు. మనం నిజాయితీగా సహాయం చేస్తామన్న విశ్వాసం కల్పించాలి. జనం దగ్గరికే మనం పోవాలి.
జనం సమస్యలను జనమే పరిష్కరించేట్లు చేయాలి. పరిష్కారంలో అవసరమైన సహా యాన్ని అందించాలి. జనాన్ని చైతన్యరహితు లను చేసి ఎప్పుడూ తనపైనే ఆధారపడేవారిగా చేసి తమ చుట్టూ తిప్పుకోవాలని ఇతర పార్టీలు, పైరవీకారులు ఆలోచిస్తారు. జనాన్ని చైతన్య పరిచి, ఐక్యపరిచి తమసమస్యల పరిష్కారం కోసం తామే పోరాడే విధంగా దారి చూపడమే కమ్యూనిస్టులు చేయవలసిన పని. అందుకనే జనం మన దగ్గరకు రావాలని ఎదురుచూ డవద్దు. జనం దగ్గరకు మనమే పోవాలి. సీపీఐ(ఎం) అఖిల భారత ప్లీనం చెప్పింది కూడా అదే. మాస్‌లైన్ అంటేనే అది. అందుకే అన్ని శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, సభ్యులు జనం దగ్గరకే పోవాలి.
జనం కదలకపోతే ఏం చేయాలి? పోరాటం చేయాలనగానే ప్రజలు పోరాటాలకు సిద్ధపడతారనుకోలేము. పోరాడాలని మనం చెప్పినప్పుడు పోరాడరు. తాము పోరాడాల నుకున్నప్పుడు, తాము తీవ్రమైన అసంతృప్తితో ఉన్నప్పుడు మనం చెప్పకపోయినా పోరాడుతారు. కాకపోతే వారికి తోచిన పద్ధతుల్లో పోరాడు తారు. వారి నాడిని గమనించి సరైన పద్ధతిలో పోరాటం నడపడమే కమ్యూనిస్టులు చేయాల్సిన పని. ప్రజలు పోరాటాలకు ఇంకా సిద్దపడ నప్పుడు ఏంచేయాలన్నది మరోప్రశ్న. పోరాటమే మార్గమని నిరంతరం ప్రజల దృష్టికి తేవాలి. అందుకే ప్రజలను నిరంతరం కలవాలి. ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలి. వారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, పౌర సమస్యలు ఇంకా అనేక రకాల సమస్యలున్నాయి. అన్నీ పరిశీలించాలి. సమస్యలను అధ్యయనం చేయ డానికి ఎంతో మంది అవసరం లేదు. ఎంత మంది ఉంటే అంతమంచిదే. ఒక్కరే ఉన్నా సమస్యలను అధ్యయనం చేయవచ్చు. బస్తీలోకి లేదా గ్రామంలోకి పోతే, ప్రజలను కలిస్తే నోరువిప్పి వారితో చర్చిస్తే సమస్యలు అర్థం చేసుకోవచ్చు. బజారులో అడుగుపెట్టగానే ఎవరూ చెప్పకున్నా అర్థమయ్యే సమస్యలు కోకొల్లలు. కావాల్సిందల్లా నేను ఆ బజారులోకో, ఆ గ్రామంలోకో పోవాలి. ఆఫీసులోనో, ఇంట్లోనో కూర్చుంటే కనిపించదు. బజారులో అడుగుపెడితే రోడ్డు ఎట్లా ఉందో తెలుస్తుంది. మురికి కాలువ పరిస్థితి అర్థమవుతుంది. అంతేకాదు, ఉదయం తొమ్మిది గంటల తర్వాత తీరికగా పోతే అనేక సమస్యలు అర్థం కావు. అప్పటికే ఆడా-మగా ఇంటిల్లిపాది వ్యవసాయ పనులకు గాని, ఉద్యోగాలకు గాని వెళ్ళిపోతారు. ముసలీ ముతక మాత్రమే మిగులుతారు. జనం ఇంట్లో ఉన్నప్పుడే, బజారులో దొరికేటప్పుడే పోవాలి. ఉదయం ఆరు నుండి తొమ్మిదిగంటల మధ్య బజారులో అడుగు పెడితే వాకిలి ఊడ్చే మహిళలు సమస్యలు చెప్పగలరు. ఆ బజారులో నల్లా ఉన్నదా? లేదా? అర్థమవుతుంది. బోరు పనిచేస్తున్నదో, లేదో అర్థమవుతుంది. ఎన్ని కిలోమీటర్ల నుండి నీరు మోసుకొస్తున్నారో కనిపిస్తుంది. సమస్యలు చెప్పగలిగిన యువత అందుబాటులో ఉంటారు. సాయంత్రం ఆరు తర్వాత బజారులో అడుగు పెడితే లైటు వెలుగు తుందో, లేదో అర్థమవుతుంది. చీకట్లో ఆడ పిల్లలు పడుతున్న బాధలు, వారి భయాలు అర్థమవుతాయి. పాములు, తేళ్ళ గురించి పసి పిల్లల భయం అర్థమవుతుంది. రచ్చబండ మీద, టీ కొట్టు దగ్గర పది మంది దొరుకుతారు. కాసేపు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. నీవు పోయింది దళిత వాడైతే దళితుల సమస్యలు అర్థమవుతాయి. తండాకు పోతే లంబాడీల సమస్యలు అర్థమవుతాయి. అడవికి పోతే కొండ ప్రాంత గిరిజనుల సమస్యలు అర్థమవుతాయి. ఊరవతల పూరి గుడిసెలను కదిలిస్తే సంచార జాతుల సమస్యలు తెలుస్తాయి. అత్యంత వెనుక బడిన తరగతుల బాధలు గమనిస్తాం. ఎవరి దగ్గరకు పోతే వారి సమస్యలు అర్థమవుతాయి. ఎవరిని సమీకరించాల నుకుంటున్నామో వారి దగ్గరకు పోవాల్సిందే. తీరికగా ఉదయం తొమ్మిది గంటలకు బయటకు వచ్చి, సాయం త్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకుంటే చేయగలిగిందేమీ ఉండదు. ప్రజలతో సంబం ధాలు ఏమీ రావు. జనం ఇళ్ళల్లో ఉన్నప్పుడు పోవడానికి సిద్ధపడితే ఒక్కరే పోయినా సమస్యలు తెలుస్తాయి. చూసిన సమస్యలు, విన్న సమస్య లన్నీ రాసుకోవాలి. వాటిలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్యలేమిటో గుర్తించాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ఆందోళనకు పూనుకోవాలి.
ఆందోళన రూపాలు కూడా అనేకం. సమయం, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తక్కువ శ్రమతో సులభంగా ప్రజలతో సంబం ధాలు పెట్టుకోవడానికి ఉపయోగపడే ఆందో ళనా రూపాలను ఎంపిక చేసుకోవాలి. పేపర్ ప్రకటన, వాల్‌పోస్టర్ కూడా ఆందోళనా రూపాలే. కానీ పత్రికా ప్రకటన ద్వారా నీవు చెప్పదలచుకున్న విషయాలకు పత్రికా దయాదా క్షిణ్యాల మీద ఆధారపడాలి. పత్రికా వివరంగా రాసినప్పుడు కూడా నీ సంబంధం ప్రజలతో ప్రత్యక్షంగా కంటే, పత్రికతోనే ఉంటుంది. గోడ పత్రికతో నీ ప్రత్యక్ష సంబంధం గోడతోనే ఉంటుంది. అది కరపత్రం అయితే నీవు జనం చేతికి ఇస్తావు. జనంతో ప్రత్యక్ష సంబంధం వస్తుంది. పది మంది కూడిన దగ్గర వారి సమస్యల గురించి, పోరాడవలసిన అవసరం గురించి నీవు మాట్లాడితే ప్రజలు ప్రత్యక్షంగా నీకు చేరువవుతారు. వ్యక్తిగత సమస్యల మీద అధికారులకు వినతిపత్రాలు రాసి, బాధితులను వెంటబెట్టుకుని వెళ్ళి మాట్లాడితే వారితో ప్రత్యక్ష బంధం ఏర్పడుతుంది. పేపర్లో పేరుకోసమో, ఫోటో కోసమో తాపత్రాయం కంటే ప్రజలతో సంబంధాల కోసం తాపత్రాయం అవసరం. అన్నీ చేయగలిగితే మంచిదే, కానీ నేను చేయవలసిన మొదటి పని ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఇచ్చేదే. నా పని ప్రారంభిం చాల్సింది అక్కడనే. అనేక సందర్భాల్లో పత్రికా ప్రకటనతో ప్రారంభిస్తున్నాం. ఆచరణలో అంతటితో ఆపివేస్తున్నాం. అందువల్ల పేపర్లో పేరు, ఫోటో వచ్చిందన్న ఆనందమే తప్ప ప్రజలతో సంబంధాలు బలపడడం లేదు. కార్యక్రమాల్లో కొనసాగింపు ఉండడం లేదు. అందుకే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరిచే ఆందోళనా రూపాలతోనే పని ప్రారం భించడం మంచిది. దాని వల్ల పేపర్లో పేరు రాకపోవచ్చు, కానీ నా ప్రజలతో నాకు సంబంధాలు ఏర్పడతాయి.
గ్రూపు మీటింగ్స్ నిర్వహించినప్పటికీ, కరపత్రాలు, పోస్టర్లు వేసినప్పటికీ, పత్రికల్లో ప్రకటనలు విస్తృతంగా ఇచ్చినప్పటికీ ప్రజలు కదలకపోవచ్చు. పోరాటాలకు సిద్దపడక పోవచ్చు. అప్పుడు కూడా ప్రజల దగ్గరకు మనమే పోవాలి. పోరాటాల్లోకి తొలి అడుగు మనమే వేయించాలి. వినతిపత్రంపైన సంతకం పెట్టడానికి వారు వెనకాడరు. డిమాండ్లతో కూడిన బ్యాడ్జీ గాని, నిరసనకోసమైతే ఒక నల్ల బ్యాడ్జీ గాని పెట్టుకోవడానికి సిద్దపడతారు. మనిషి మనిషిని కలిసి ఈ పనులు చేయించాలి. ఇవి పోరాట రూపాలే. ఒక సమస్యపై అధికారిని డిమాండ్ చేస్తూ సంతకం చేస్తున్నారంటే లేదా బ్యాడ్జీ ధరిస్తున్నారంటే పాలకులను డిమాండ్ చేస్తున్నారని అర్థం. అవి పోరాటాల ప్రాథమిక రూపాలే. అనేక సమస్యల మీద పదేపదే ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎన్ని సార్లు, ఎంత తరచుగా ప్రజలను కలవగలిగితే అంత మంచిది. ప్రజలకు విసుగొచ్చినప్పుడు ఇట్లైతే లాభం లేదు, కదులుదాం అని వారే అంటారు. ధర్నాలకు, ప్రదర్శనలకు, పికెటింగ్లకు వారే సిద్దపడతారు. వారు సిద్దపడ్డప్పుడు మన కార్యకర్త ముందు నిలబడాలి.
వినతిపత్రానికి కాగితం జనమే తెస్తారు. కరపత్రానికి డబ్బు లేదంటే తలా పది రూపాయ లు వారే వేసుకుంటారు. పదేపదే ప్రజల మధ్య ఉన్నప్పుడు కార్యకర్త బాగోగులు కూడా వారే చూసుకుంటారు. ఇక్కడ కార్యకర్తకు సామర్థ్యం ఉందా? లేదా? అన్నది కూడా ఒక సమస్య. జనాన్ని కలవడానికి పెద్ద సామర్థ్యం అవసరం లేదు. అది మానవ సహజ లక్షణం. మనిషి సంఘజీవి. సోమరిగా ఇంట్లోనో, ఆఫీసులోనో కూర్చోకుండా జనం మధ్యకు పోవడమే మంచి లక్షణం. మనుషులతో మాట్లాడడం కష్టమైందే మీకాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బ్రహ్మవిద్యలవసరం లేదు. వినతిపత్రం రాయ డం రాకపోతే నాయకుల సహాయంతో నేర్చుకో వచ్చు. కరపత్రం రాయడం రాకపోతే నాయకు లతో రాయించుకోవచ్చు. మిగిలినవన్నీ కార్యకర్త స్వయంగా చేయగలిగినవే. ఒక్కరైనా చేయగలి గినవే. సేవా కార్యక్రమాలు కూడా ప్రజలకు దగ్గర కావడానికి తోడ్పడతాయి. చెత్తను ఎత్తిపో యడం, వీధులు శుభ్రం చేయడం, పేద పిల్లలకు చదువు చెప్పడం, తెలిసిన డాక్టర్లతో మెడికల్ క్యాంపులు నిర్వహించడం వంటి అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ప్రతిదీ వ్యాపారమైన నేపథ్యంలో ఏ చిన్న సహాయం చేసినా ప్రజలకు ఆ మేరకు ఊరట కలుగుతుంది.
ప్రజా సమస్యల మీద అప్పుడప్పుడు కదిలితే ప్రజల నుండి అభినందనలు వస్తాయి. ప్రజలతో సంబంధాలు మాత్రం రావు. పార్టీని నిర్మించు కునే అవకాశం రాదు. ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేయాలి. ప్రతి రోజూ ప్రజలతో సంబంధాల్లో ఉండాలి. నీటికి నిరంతరం వేడి అందిస్తున్నప్పుడే ఒక డిగ్రీ నుండి రెండవ డిగ్రీకి, రెండవ డిగ్రీ నుండి మూడవ డిగ్రీకి వేడెక్కుతూ ఉంటుంది. తొంబైతొమ్మిది డిగ్రీలు దాటితే ఆవిరవుతుంది. మధ్య మధ్యలో విశ్రాంతినిస్తే ఉన్న వేడి చల్లారిపోతుంది. మళ్లా మొదటి కొస్తుంది. పొయ్యిమీద బియ్యం పెట్టి నిరంతరం తగిన మోతాదులో మంటనిచ్చినప్పుడే అన్నం ఉడుకుతుంది. మధ్యలో మంట తీసేసీ, కాసేపటి కి మళ్ళీ ఇస్తే తినడానికి పనికొచ్చే అన్నం కాదది. ప్రజా సమస్యల మీద మనం నిర్వహించే ఆందో ళనలు కూడా అంతే. విరామం లేకుండా నిరం తరం చేయవలసిందే. అప్పుడే ఫలితాన్నిస్తుంది. ప్రజలతో సంబంధాలు బలపడతాయి. ఏ ప్రజల మధ్య కార్యకర్త పనిచేయాలో, ఆ ప్రజల మధ్య తాను నివాసం ఉన్నప్పుడే ఇది కూడా సాధ్యపడుతుంది. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండి ప్రజల దగ్గరకు ఎంత తరచుగా వెళ్ళి వచ్చినా అతిథిగా వెళ్ళిరావడమే తప్ప ప్రజల మనిషిగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదు. ఏ సమయంలో సమస్య ఎదురైనా అందుబాటులో ఉంటావన్న విశ్వాసం ప్రజలకు కలగదు. అందుకే ప్రజల మధ్యనే ఉండాలి. పై నాయకత్వం సైతం గ్రామాలను, బస్తీలను సందర్శించినప్పుడు సమావేశం వరకు చూసుకుని రాకుండా రాత్రులు కూడా అక్కడే బసచేయడం ఉపయోగం. అనేక సమస్యలు ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.
ఈ ఆందోళనా కార్యక్రమాలు గాని, సేవా కార్యక్రమాలు గాని ఎంత కాలం చేయాలి? జనం పోరుబాట పట్టేదాకా చేయవలసిందే. పోరాట కాలంలోనూ చేయవలసిందే. మరో పోరాటానికి సన్నద్దం చేయడం కోసమూ చేయాల్సిందే. నిరంతరమూ చేయవలసిందే. సమాజం మారెంతవరకూ చేయవలసిందే. ఏం చేయాలో తోచకపోతే జనాన్ని కలవాలి. ఏం చేయాలో జనమే చెబుతారు. నీరసం వస్తే జనాన్ని కలవాలి. జనంలోంచి ఉత్సాహం వస్తుంది. ఒకరిద్దరూ తోడుంటే వారితోనూ సంప్రదించాలి. శాఖ ఉంటే దానితోనూ చర్చించాలి. మండల కమిటీ ఉంటే ఇంకా మంచిదే. ఇంకా చాలా చేయవచ్చు. ఆందోళన ప్రారంభించినప్పుడే పార్టీ నిర్మాణానికి అవసర మైన ప్రయత్నాన్ని కూడా ప్రారంభించాలి. ప్రజా సమస్యల మీద ఆందోళనతో పాటు, ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకునే సమయంలోనే పార్టీని నిర్మించేందుకు జరిగే కృషి సమాంత రంగా జరగవలసిందే. చురుకుదనం ప్రదర్శించే చదువుకున్న యువతీ యువకులకు పోరాటాల అవసరాలను అర్థం చేయించాలి. పరిష్కార మార్గాలు సూచించాలి. సమాజ మార్పు కోసం చేయవలసిన కృషిని అర్థం చేయించాలి. నవతెలంగాణ, ప్రజాశక్తి, మార్క్సిస్టు, పీపుల్స్ డెమోక్రసీ వంటి పత్రికలు చదివించాలి. స్టడీ సర్కిళ్లు నిర్వహించాలి. కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయంతో ఏకీభవించే వారితో ఆగ్జిలరీ శాఖలు ఏర్పాటు చేయాలి. నెలలో ఒకట్రెండు సార్లైనా సమావేశపర్చాలి. పార్టీ శాఖను నిర్వహించిన పద్ధతిలోనే ఆగ్జిలరీ శాఖను నిర్వహించవచ్చు. పార్టీ తరపున నిర్ణయాలు చేసే అవకాశం తప్ప మిగతావన్నీ ఆగ్జిలరీ శాఖ కూడా చేయగలుగుతుంది. కనీసం ఆరు మాసాలు ఆగ్జిలరీ శాఖను రెగ్యులర్‌గా నడిపితే పార్టీలో చేరడానికి సిద్ధపడినవారిని చేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పార్టీ శాఖను ఏర్పాటు చేయవచ్చు. ఒకేఒక్క కార్యకర్త ఉన్నప్పటికీ ఇవన్నీ చేయవచ్చు. ఇప్పుడింకా ఏమాత్రం ఒక్కరుగా మిగలరు. తన చుట్టూ తోడుగా ఆగ్జిలరీ శాఖ సభ్యులుంటారు. ఆరు మాసాలు దాటితే తనకు తోడు పార్టీ శాఖ ఉంటుంది. మరో ఆరు మాసాలు దాటితే తనకు తోడు కొన్ని శాఖలు ఏర్పడతాయి. ఒక కమిటీ కూడా ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే నిర్ధిష్ట కాల పరిమితిలో కార్యకర్త ఒక్కరే అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. బృందం ఏర్పడుతుంది. ప్రారంభ దశలో చేసిన పనికి అనేక రెట్లు ఎక్కువ కృషి చేయడానికి ఆరు మాసాలు తిరిగే లోపు అవకాశం ఏర్పడుతుంది. కనీసం ఒక సంవత్స రంలో బృందం ఏర్పడుతుంది. ఏర్పడాలి. ఇంకా ఏర్పడకపోతే ఆ కార్యకర్త పనిలో ఏదో లోపం ఉన్నదని గ్రహించాలి. పనిని సమీక్షించి లోపాన్ని గుర్తించాలి. సరిదిద్దుకోవాలి. తద్వారా రెండవ సంవత్సరంలోనైనా ఫలితం సాధించ గలిగే అవకాశం ఏర్పడుతుంది. మొదటి సంవ త్సరంలోనే తరచూ తన పనిని సమీక్షించు కోగలిగితే సంవత్సరాంతంలో ఫలితం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఒక్కరే ఉన్నారన్న ఆందోళ న అవసరం లేదు. ఒక్కరే ప్రారంభించాలన్న అవసరాన్ని గుర్తించాలి. అది పార్టీ విస్తరణకు తోడ్పడుతుంది.
ఒక్కరున్నా చాలు....
