- ఎస్. వెంకట్రావు
ఎన్నికల ముందు 'అమెరికా ఫస్ట్' (అమెరి కాకే తొలిప్రాధాన్యత) అన్న నినాదంతో ప్రజల ఓట్లు కొల్లగొట్టిన మితవాద నాయకుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం క్రమంగా మారుతోంది. మన దేశంలో నరేంద్ర మోడీ చేసినట్టే ఆయనా ఎన్ని కల్లో ప్రజలకు చాలా వాగ్దానాలు చేసి ఇప్పుడు ప్లేటు ఫిరాయించడమే కాదు రోజుకో మాట చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నాడు. 'మేకిన్ అమెరికా' నినాదంతో వస్తూత్పత్తి రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకొస్తానని ట్రంప్ వాగ్దానం చేశాడు. ఈ నినాదం చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో అమెరికన్లనే తీసుకుంటానన్నాడు. ఇతర దేశాల నుండి అమెరి కాకు సాఫ్ట్వేర్ నిపుణుల వలసను అడ్డుకుంటా నన్నాడు. ఈ నినాదం భారత్‌కు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిందే. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే వచ్చేట్లు చూస్తానన్నాడు. అమెరికాలోకి వలస వచ్చేవారిపైనా, ముస్లింలపైనా ద్వేషం రెచ్చ గొట్టాడు. ఆర్థిక అంతరాలు, పేదరికం, నిరు ద్యోగం విపరీతంగా పెరిగిపోతున్న అమెరికాలో ప్రజలను ఈ నినాదాలు బాగా ఆకట్టుకున్నాయి.
వీటికన్నా మించి ఆయన సైనిక రంగంలో చేసిన నినాదాలు ప్రజలను మరింత ఆకర్షిం చాయి. నాటో కూటమికి అయ్యే ఖర్చు అమెరికా ఒక్కటే భరించకూడదు నాటో దేశాలన్నీ భరించా లన్నాడు. దక్షిణ కొరియాలోనూ, తూర్పు ఆసియాలోనూ అమెరికా సైనిక స్థావరాల ఖర్చులు అక్కడ లబ్ధి పొందుతున్న దేశాలు కూడా భరించాలన్నాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలుండడం దండగ అన్నాడు. ఆఫ్ఘన్ యుద్ధంలో బరాక్ ఒబామా విధానాన్ని దునుమాడాడు. పనికి మాలిన ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో మన సైనికులు చనిపోవడం తగ దన్నాడు. అక్కడ తిష్టవేసి ఉన్న 8000 మంది అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్నాడు.
ట్రంప్ తన 'అమెరికా ఫస్ట్' నినాదం ద్వారా వాల్‌స్ట్రీట్ బడా పెట్టుబడిదారీ కంపెనీల పట్ల, యుద్ధం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకున్నాడు. అమెరికాకు పూర్వ వైభవం తెస్తానన్న నినాదంతో ప్రజల సెంటి మెంటును అనుకూలంగా మలచుకున్నాడు. కానీ గద్దెనెక్కిన వెంటనే ఆయన ప్రజల ఆశలు వమ్ము చేయడమే కాదు, ఇంటా బయట మరింత ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒకవైపు దేశంలో పచ్చి మితవాద శక్తులను ఉపయోగించుకుని పార్లమెంటేతర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాడు మరోవైపు పరిపాలనలో సైనిక, ఫైనాన్స్ కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేసి ప్రపంచ వ్యాపితంగా ఉద్రిక్తతలు రెచ్చ గొడుతున్నాడు.
ఫాసిస్టు శక్తులకు ఊతం
అమెరికాలో నయా-నాజీలకు, పచ్చి మితవాద శక్తులకు ట్రంప్ మద్దతును ఇటీవల వర్జీనియా రాష్ట్రంలోని చార్లొట్టెస్విల్లెలో జరిగిన ఘటన వెల్లడిస్తోంది.
చార్లొట్టెస్విల్లెలో 19వ శతాబ్దానికి చెందిన జాత్యహంకార నాయకుడు రోబర్ట్ ఇ. లీ విగ్రహం తొలగింపునకు నిరసనగా తెల్లజాతి దురహంకారులు ఆగస్టు 11వ తేదీన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలకు నిరస నగా అన్ని జాతుల వారు ఐక్యంగా అదేచోట ఆగస్టు 12 న శాంతి ప్రదర్శనకు పూనుకున్నారు. ఈ ప్రదర్శనకు నల్లజాతి, హిస్పానిక్స్, తెల్లజాతి వారు, ఇతర అనేక జాతులకు చెందిన వేలాది మంది హాజరయ్యారు. ప్రదర్శనపై తెల్లజాతి దురహంకారులు ఒక పథకం ప్రకారం దాడి చేశారు. ''మితవాదుల ఐక్యతా రాలీ'' పేరుతో దాడికి దిగిన వారు సైనిక దుస్తులతో ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు పట్టుకుని వచ్చారు. వారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్ ఫోటోలు పట్టుకున్నారు. ట్రంప్ ఇచ్చిన 'అమెరికా ఫస్ట్' నినాదాలు రాసిన ప్లకార్డులు, స్వస్తిక్ చిహ్నాలు పట్టుకుని జాత్యహంకార నినాదాలు చేశారు. యూదు, ముస్లిం, వలసవాదులను దూషిస్తూ శాంతి ప్రదర్శకులపై దాడికి దిగారు. వీరిలో నయా -నాజీలు, తెల్లజాతి దురహంకారులు, కు క్లక్స్ క్లాన్ సభ్యులు, వివిధ ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు ఉన్నారు. దాడిని పోలీసులు చూస్తూ ఉండిపోయారుగాని ఎటువంటి చర్యలు తీసుకో లేదు. ఈ లోగా ఒక తెల్లజాతి దురహంకారి శాంతి ప్రదర్శకుల మీదికి కారును వేగంగా పోనిచ్చాడు. అందులో హీదర్ హేయర్ అనే యువతి మృతి చెందగా 19 మంది గాయ పడ్డారు. ఇది అమెరికా అంతర్గత టెర్రరిస్టు చర్య అని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అభి వర్ణించాడు.
కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ టెర్రరిస్టు చర్యను ఖండించకపోగా 'రెండు వైపులా'' ఉన్న విద్వేషం, మూఢత్వం, హింసా కాండలను ఖండిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత తన ప్రకటనను సమర్ధించుకునే క్రమంలో కూడా ఆయన అన్ని జాతులతో కూడిన శాంతి ప్రదర్శకులనూ, తెల్లజాతి దురహంకార నయా-నాజీ ఉగ్రవాదులనూ ఒకే గాటన కట్టడంతో అమెరికాలోనూ, విదేశాల్లోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఆయన ప్రభుత్వం లోనే పలువురు ట్రంప్ వైఖరిని వ్యతిరేకించారు. తన సొంత రిపబ్లికన్ పార్టీలో అనేకమంది నాయ కులు ట్రంప్ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
టెర్రరిస్టు సంస్థలకు ట్రంప్ మద్దతు వెనుక వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన రెండు పార్టీల వ్యవస్థ ఉన్న అమెరికాలో తన దంటూ ఒక నిరంకుశ, పార్లమెంటరీయేతర సంస్థను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల వ్యవస్థలు ట్రంప్ నియంతృత్వ పోకడలకు అడ్డు వస్తున్నాయి. అలాగే పార్లమెంటులోని రెండు సభలు, కోర్టులు కూడా ఆయన నిరంకుశ పోకడలకు కళ్లెం వేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు ముస్లిం దేశాల నుండి ప్రజలెవ్వ రినీ అమెరికా రాకుండా వీసాలు తిరస్కరించా లని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇస్లామా ఫోబియాను అధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నాడని పలువురు పేర్కొన్నాడు. దీన్ని అమెరికా ఫెడరల్ కోర్టు, అనేక రాష్ట్రాలు తిరస్కరించాయి. దాంతో తన ఆదేశాన్ని అమలు చేయడానికి ఆయన కోర్టులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు.
మెక్సికో నుండి అమెరికాకు ప్రజలు వలస రాకుండా రెండు దేశాల మధ్య 3,300 కిలోమీటర్ల పైన గోడ కట్టేస్తానని ట్రంప్ ఎన్నికల ముందూ, తరువాత ప్రకటించాడు. గోడకట్ట డానికి భారీగా నిధులు కావాలి. అసలే దివాళా స్థితిలో ఉన్న అమెరికా ఖజానా దానికి ఒప్పుకో వడం లేదు. అందుకని ఆయన నిర్ణయానికి అమెరికా పార్లమెంటు బ్రేకులు వేస్తోంది. దాన్ని సహించలేని ట్రంప్, అక్టోబర్ 1 తో ప్రారంభ మయ్యే ఆర్థిక సంవత్సరంలో గోడ నిర్మాణానికి పార్లమెంటు నిధులు మంజూరు చేయకపోతే ఫెడరల్ నిధుల బిల్లును వీటో చేస,ి మొత్తం పరిపాలననే స్తంభింపజేస్తానని బెదిరించాడు. ఆగస్టు 22న ఆరిజోనా రాష్ట్రంలోని ఫోరునిక్స్లో జరిగిన సభలో ఈ బెదిరింపులకు దిగడంతో పాటు అరగంట పాటు ఆయన చేసిన ప్రసంగంలో ఆగస్టు 12న చార్లొట్టెస్విల్లెలో జరిగిన ఉగ్రవాద దాడిపై తన వైఖరిని సమర్ధిం చుకోడానికే ఎక్కువ సమయం కేటాయించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాయని పత్రికలపై ధ్వజమెత్తాడు. వలసవచ్చిన ప్రజలను అనవస రంగా అరెస్టులు చేయిస్తున్నందుకు గాను కోర్టులు నేరస్తుడుగా ప్రకటించిన ఆరిజోనా షెరీఫ్ జోరు ఆర్పిర్పాయోకు తను క్షమాభిక్ష పెడతానని ప్రకటించాడు.
ఈ విధంగా పార్లమెంటునూ, కోర్టులనూ, చట్టాలనూ ధిక్కరిస్తూ పాలించాలనుకుంటున్న ట్రంప్ తన సొంత మితవాద సైన్యాన్ని సమ కూర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. చార్లొట్టెస్విల్లెలో సెమీ సైనిక దుస్తుల్లో తుపాకులు పట్టుకుని శాంతి ప్రదర్శనపై దాడికి దిగిన నయా-నాజీ, తెల్లజాతి దురహం కారులకు ఆయన బహిరంగంగా మద్దతు తెలపడం వెనుక ఈ వ్యూహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. నిజానికి ట్రంప్ ప్రభుత్వ వర్గాల మద్దతుతోనే చార్లొట్టెస్విల్లెలో ఫాసిస్టుల ప్రదర్శన జరిగిందని చెబుతున్నారు.
ప్రభుత్వంలో సైనిక, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు
ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలోని ప్రధాన స్థానాల్లోకి మాజీ సైనికాధికారులను తీసుకున్నాడు. రిటైర్డ్ జనరల్ జెమ్స్ మట్టిస్ను రక్షణ మంత్రిగా నియమించాడు. మట్టిస్ను అందరూ ''మాడ్ డాగ్'' (పిచ్చికుక్క) మట్టిస్ అంటారు. ఇరాక్‌లోని ఫల్లూజా నగరం లో వేలాది ప్రజలను పిచ్చికుక్కలా ఊచకోత కోయించాడాయన. రిటైర్డ్ మెరైన్ జెనరల్ జాన్ కెల్లీని ట్రంప్ అంతర్గత రక్షణ శాఖ మంత్రిగా నియమించాడు. జాతీయ భద్రత మంత్రిగా రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మైఖేల్ ఫ్లిన్‌ను నియమించాడు. ఈయన ముస్లిం వ్యతిరేకి. ఇస్లామ్‌ను కాన్సర్‌తో అభివర్ణించాడు. వీరితోబాటు ట్రంప్ మంత్రివర్గంలో 9 మంది రిటైర్డ్ సైనికాధికారులున్నారు.
ట్రంప్ ప్రభుత్వాన్ని శతకోటీశ్వరుల ప్రభుత్వంగా అభివర్ణిస్తారు. వాల్‌స్ట్రీట్ శతకోటీశ్వరులతో ఆయన మంత్రివర్గాన్ని నింపేశాడు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి శతకోటీశ్వరుడైన అధ్యక్షుడు ట్రంప్. ఆయన తోబాటు మరో ఇద్దరు శతకోటీశ్వరులు, ఒక డజను మంది కోటీశ్వరులూ ఆయన మంత్రి వర్గంలో ఉన్నారు. అంతా కలిపి 6100 కోట్ల డాలర్ల (సుమారు 4.27 లక్షల కోట్ల రూపాయల) సంపద పోగుచేసుకున్న ధనికులు ట్రంప్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరిలో చాలా మందికి గతంలో ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు. ట్రంప్ మంత్రివర్గంలోని కోటీశ్వరుల్లో చాలా మందికి వాల్‌స్ట్రీట్ ఫైనాన్స్ పెట్టుబడితోనూ, కార్పొరేట్ అమెరికాతోనూ దగ్గరి సంబంధాలున్నాయి. అంతేకాదు ఆయన మంత్రివర్గం అత్యధికంగా తెల్లజాతీయుల తోనూ, పురుషులతోనూ నిండి ఉంది. ట్రంప్ మంత్రివర్గాన్ని ఇతర అధ్యక్షుల మంత్రివర్గాలతో పోల్చి చూపే కింది పట్టిక చూస్తే తేడా అర్థమవుతుంది:
మళ్లీ యుద్ధ నాదాలు
ఒకవైపు దేశంలో ఫాసిస్టు శక్తులకు ఊతమిస్తూ మరోవైపు సైనిక జనరల్స్, ఫైనాన్స్ కార్పొరేట్లతో కూడిన మంత్రివర్గంతో ట్రంప్ ప్రపంచ వ్యాపితంగా ఉద్రిక్తతలు రెచ్చగొడు తున్నాడు. గత అధ్యక్షుల హయాంలో కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధ నౌకలు, డబ్బు మూటలతోనే ప్రపంచ పెత్తనానికి తరలి వెళ్లింది. కానీ పౌర ప్రభుత్వానికీ, సైన్యా నిక-ఫైనాన్స్ వ్యాపారానికీ మధ్య చిన్న గీత ఉండేది. ట్రంప్ హయాంలో ఆ గీత కూడా చెరిగిపోయింది.
దేశంలో నిరుద్యోగం, దారిద్య్రం అనుభ విస్తున్న అమెరికన్లకు విలువైన వనరులను యుద్ధం మీద, సైనిక స్థావరాల మీద ఖర్చు చేయడం పట్ల యావగింపు ఉండేది. దీన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన ట్రంప్ త్వరలోనే తన స్వరం మార్చేస్తున్నాడు. ఆఫ్ఘని స్థాన్లో సుదీర్ఘ యుద్ధం చేస్తామని ఇటీవల ఆయన చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ఒకవైపు దేశంలో నయా-నాజీలకు మద్దతిస్తున్న సమయంలోనే ఆగస్టు 21నాడు ట్రంప్ జాతీయ టెలివిజన్‌లో మాట్లాడుతూ తన కొత్త ఆఫ్ఘనిస్థాన్ విధానాన్ని ప్రకటించాడు. 16 సంవత్సరాలుగా అమెరికా ఆయుధ దాడులతో తల్లడిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధాన్ని మరింత విస్తరిస్తామని ట్రంప్ ప్రకటించాడు. బరాక్ ఒబామా ఆ దేశం నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు ప్రక టిస్తే ట్రంప్ మరింత మంది అమెరికన్ సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించాడు. ఎన్నికల సమయం లో 'ఆఫ్ఘన్ యుద్ధం దండగ, అమెరికా దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి' అన్న తన విధానం నుండి ఆయన పూర్తిగా యు టర్న్ తీసుకున్నాడు. 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై దాడి అనంతరం నాటి అధ్యక్షుడు జార్జి బుష్ ఆఫ్ఘన్‌పై యుద్ధం ప్రకటించాడు. నాటి నుండి నేటి వరకు ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌లో 1.75 లక్షల మంది ప్రజలను చంపింది. పది లక్షల మంది ఇళ్లు విడిచి వలసలు పోయారు. వేల మంది అమెరికా సైనికులు కూడా చనిపోయారు. ఈ యుద్ధకాండ పట్ల దేశ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో అనంతమైన ఈ యుద్ధం నుండి బయటపడాలని చెబుతూ ఒబామా సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటామని ప్రకటించాడు. 2010-11 నాటికి ఆ దేశంలో లక్షమంది అమెరికా సైన్యం ఉండేది కాస్తా ఒబామా హయాం చివరి నాటికి 8500 మందికి తగ్గిపోయింది. ఈ సైన్యం కూడా నేరుగా తిరుగుబాటుదారులతో తలపడకుండా ఆఫ్ఘనిస్థాన్ సైన్యానికి శిక్షణ, మద్దతు ఇచ్చేందుకే ఉంచు తున్నట్లు ప్రకటించారు. ఆ సైన్యాన్ని కూడా వెనక్కి పిలవాలని ఎన్నికల ముందు పదే పదే పిలుపునిచ్చిన ట్రంప్ ఇప్పుడు కొత్త విధానం మరింత మంది సైన్యాన్ని ఆ దేశంలోకి పంపుతున్నట్లు తెలిపాడు. గత ప్రభుత్వాల్లాగా ఎంత సైన్యాన్ని పంపుతున్నదీ తెలపనన్నాడు. ఆ సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌లో ఎంతకాలం ఉంటుందో చెప్పనన్నాడు. గత అధ్యక్షులు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసమే సైన్యాన్ని పంపుతున్నట్లు చెప్పేవారు. ట్రంప్ ఆ ముసుగు కూడా తొలగించి ''ఆఫ్ఘన్ నిర్మాణం కోసం కాదు ఉగ్రవాదులను చంపడం కోసమే మన సైన్యం అక్కడుంటుంది'' అని ప్రకటించాడు. యుద్ధానికి ''అవసరమైన అన్ని రకాల పరికరాలనూ, నిబంధనలనూ మీకు తోడుగా'' ఇస్తానన్నాడు. రక్షణ మంత్రికి, సైనిక జనరల్స్‌కు ''అపరిమిత అధికారాలు'' ప్రకటించాడు. ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌పై చేసిన యుద్ధ ప్రకటన ఒక్క ఆఫ్ఘనిస్థాన్‌ను ఉద్దేశించిందే కాదు. దీనిలోకి ఆయన భారత్ పాకిస్థాన్‌లను లాగాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌కు ఆఫ్ఘన్ యుద్ధంలో అవకాశాలు తగ్గించి భారత్‌కు ఎక్కువ పాత్ర ఇస్తానని ప్రకటించాడు. మన దేశ పాలక వర్గాలు దీనికే చాలా సంబర పడుతున్నాయి.
కానీ ఆఫ్ఘనిస్థాన్ సమస్యకు సైనికంగా పరిష్కారం కుదర్చాలంటే మరో 16 ఏళ్లకు కూడా సాధ్యం కాదన్న విషయం ఈ నేత లందరికీ తెలియంది కాదు. అక్కడి ప్రజల్లోని జాతుల విభజన, వారి మధ్య వైరం దీనికి కారణం. దేశంలోని ప్రజల్లో 40 శాతం మంది ఫస్తూన్ తెగలకు చెందిన వారు. వీరు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. తాలిబాన్ రిక్రూట్‌లలో వీరే ప్రధానమైన వారు. 30 శాతంగా ఉన్న తజక్ తెగలవారు పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. చదువు సంధ్యలు కలిగి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. ఆఫ్ఘన్ సైన్యంలో ఎక్కువ మంది వీరే. 20 శాతం వరకు హజారా షీతేలు, 10 శాతం మంది ఉజ్బెక్ తెగలు ఉన్నారు. అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌కు అందిస్తున్నట్లు చెబుతున్న నిధులన్నీ ఆ దేశం మీద బాంబులు వేయడానికే సరిపోతున్నాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందే నిధులు ప్రధానంగా ప్రభుత్వంలో ఉండే తజక్లకు చేరుతున్నాయి. ఇక్కడ విపరీతమైన అవినీతి జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ ప్రభువుల మాటే చెల్లుతుంది. తాలిబాన్లు స్థానిక ప్రజలకు రక్షణ కల్పిస్తారు కాబట్టి వారి మాటే వేదంగా సాగుతుంది. ప్రభుత్వంలో ఉండే తజక్ రాజకీయ వేత్తలు భారత్‌కు అనుకూలంగా ఉంటారు. ఫస్తూన్ నాయకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటారు. నిజానికి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులా ఫస్తూన్ల బంధుత్వాలుంటాయి. ఈ ప్రాంతాన్ని కలిపి ఫస్తూనీస్థాన్ ఏర్పాటు చేయాలనేది వీరి కోరిక. తెగల మధ్య సామరస్యం కుదర్చడం ద్వారా, తాలిబాన్లను ప్రభుత్వంలోకి తీసుకు రావడం ద్వారా ఆఫ్ఘన్లో శాంతి సాధించాలన్న ప్రయత్నాలు ఒబామా హయాం నుండీ సాగుతు న్నాయి. అమెరికా నాయకత్వంలో జరిగే ఈ శాంతి చర్చల్లో పాల్గొనే తాలిబన్ల కోసం కతర్ లో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతుండగానే ట్రంప్ యుద్ధం ద్వారా - అది కూడా ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని యుద్ధం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సమస్యకు పరిష్కారం చేకూరుస్తానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి?
వాస్తవానికి ఆఫ్ఘనిస్థాన్‌లో ట్రంప్ కొత్త విధానం వెనుక 'ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్' పేరుతో చైనా ఈ ప్రాంతంలోని దేశాలమధ్య వాణి జ్యాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకునే వ్యూహం దాగుందనేది విశ్లేషకుల అభిప్రాయం. చైనా నాయకత్వంలోని షాంఘై సహకార సంస్థలో చైనా, రష్యాతో బాటు మధ్య ఆసియాలోని పలు దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం పరిశీలకుని హోదాలో ఉంది. త్వరలోనే దానికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ఆసియా, ఐరోపాలను కలిపే సిల్క్ రోడ్ ప్రాజెక్టులో ఆఫ్ఘనిస్థాన్ చేరితే దానిపై అమెరికా పట్టు జారిపోతుంది. అందుకే ఆఫ్ఘనిస్థాన్ స్థావరంగా ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. ట్రంప్ ఆఫ్ఘన్లో యుద్ధాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తానని ప్రకటించడానికి కారణం ఇదే. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఎక్కుపెట్టేందుకు ఆయన కొత్త ఆఫ్ఘన్ విధానంలో పాక్‌ను తప్పించి భారత్‌కు పెద్ద భాగస్వామ్యం కల్పిస్తు న్నాడని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో తిష్టవేసి ఉన్న 12,000 మంది నాటో దళాలకు తోడు మరిన్ని మంది దళాలు, వనరులను పంపాలని ట్రంప్ నాటోను కూడా డిమాండ్ చేశాడు.
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత
ఉత్తర కొరియాపై యుద్ధానికి ట్రంప్ చేస్తున్న సన్నాహాలు తూర్పు ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. ఉత్తర కొరియా అణు కార్య క్రమాన్ని రద్దు చేసుకుంటే దానిపై ఆంక్షలు ఎత్తివేయాలని గతంలో అమెరికా-ఉ.కొరి యాల మధ్య 6 దేశాల కూటమి సమక్షంలో కుదిరిన ఒప్పందం నుండి అమెరికా వైదొ లగంతో ఈ ప్రారతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అమెరికా నిత్యం ఈ ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు చేపట్టడం, దానికి ప్రతిగా ఉ. కొరియా క్షిపణు లను పరీక్షించడం, అణు పరీక్షలు జరపడంతో కొరియా ద్వీపకల్పం ఉద్రిక్తమయంగా మారింది. ఉల్చి-ఫ్రీడమ్ గార్డియన్ యుద్ధ విన్యాసాల పేరుతో అమెరికా, ద.కొరియాలు సరికొత్తగా భూమి మీద, సముద్రంలో, గాలిలో పెద్ద ఎత్తున యుద్ధ క్రీడలు ప్రారంభించాయి. 30,000 మంది అమెరికా సైన్యం, 50,000 మంది ద.కొరియా సైన్యం పాల్గొంటున్న ఈ విన్యాసాలు మొత్తం ఉ.కొరియా, చైనాలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవే కావడం గమనార్హం. ఉద్రిక్తతలు పెంచే ఈ యుద్ధ విన్యాసాలు నిలిపేయాలని ఉ.కొరియా, చైనాలు ఎంతగా విజ్ఞప్తి చేసినా అమెరికా వినలేదు. దానికి ప్రతిగా ఆత్మరక్షణ కోసం ఉ.కొరియా క్షిపణి ప్రయోగాలు నిర్వహి స్తుంటే సామ్రాజ్యవాదులు గగ్గోలు పెడుతున్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఉ.కొరియా పై మరింత ఎక్కువగా కాలుదువ్వడమే కాదు దానికి మద్దతిస్తోందన్న పేరుతో చైనా మీద కూడా ఆంక్షలు ప్రకటించాడు. ఉత్తర కొరియా బూచిని చూపించి ద.కొరియాలో అత్యాధునిక క్షిపణి వ్యతిరేక థాడ్ వ్యవస్థలను నెలకొల్పడం వివాదానికి దారితీసింది. నిజానికి ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబులు కేవలం 100 లోపు మాత్రమే. దాని క్షిపణుల సామర్ధ్యం కూడా అమెరికా తీరాన్ని తాకలేవు. కానీ అమెరికా వద్ద 7000 అణు బాంబులున్నాయి. వాటిలో 1700 బాంబులు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి. నేలమీద, నీటిలో సబ్ మెరైన్లపైనా, యుద్ధ నౌకలపైనా ఉన్న క్షిపణులు, యుద్ధ విమానాల సామర్ధ్యంతో పోలిస్తే ఉ.కొరియా క్షిపణుల, అణుబాంబుల సామర్ధ్యం ఏ మూలకూ సరిపోదు. అయినా సామ్రాజ్యవాద ప్రచార సాధనాలు ఉ.కొరియాను అణు భూతంగా చిత్రిస్తున్నాయంటే అసలు లక్ష్యం ఉ.కొరియా కాదు, చైనా. ఉ.కొరియాకు చైనాకు మధ్య 1961లో కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం ఒక దేశం మీద దాడి జరిగితే మరో దేశం తనకు రక్షణగా రావాలి. ట్రంప్ అధి కారంలోకి రాగానే ఉ.కొరియా సర్వనాశనం చేసే పథకాన్ని ప్రకటించాడు. ''ఫైర్ అండ్ ఫ్యూరీ'' అని దీనికి పేరు పెట్టాడు. ట్రంప్ దుష్ట వ్యూహాన్ని గ్రహించిన చైనా ఉ.కొరియా విషయంలో తన విధానాన్ని స్పష్టంగా ప్రకటిం చింది. దాని సారాంశం ఏమంటే: ''అమె రికా-ద.కొరియా సైనిక విన్యాసాల నుండి ఆత్మరక్షణ కోసమే అయినా ఉ.కొరియా చేస్తున్న అణు, క్షిపణి ప్రయోగాలను ఆపడానికి చైనా ప్రయత్నిస్తుంది. కానీ ఈ పేరుతో ఉ.కొరియాను ఏ దేశమైనా దురాక్రమణ చేయాలని ప్రయత్నిస్తే చైనా తటస్థంగా ఉండబోదు, జోక్యం చేసుకుం టుంది.'' చైనా నుండి స్పష్టమైన ఈ ప్రకటన వెలువడిన తరువాత ట్రంప్ తన 'ఫైర్ అండ్ ఫ్యూరీ' నుండి కొంత వెనక్కు తగ్గినప్పటికీ చైనాను నిలువరించే తన ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు.
చైనాను సైనికంగా చట్టుముట్టడానికి అమెరికా పన్నిన వ్యూహంలోకి జపాన్, దక్షిణకొరియా, భారత్, ఆస్ట్రేలియాలను కూడా లాగుతోంది. మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని విడిచిపెట్టి అమెరికా యుద్ధ వ్యూహం లో జూనియర్ భాగస్వామిగా మారడానికి ఉవ్విళ్లూరుతోంది.
ఎన్నికలకు ముందు రష్యాకు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు రష్యాపైన కూడా కాలుదువ్వుతున్నాడు. యూరప్‌ను కలుపుకొని దానిపై ఆంక్షలు ప్రకటిస్తున్నాడు. సిరియాలో, ఉక్రెయిన్, ఇరాన్లలో అమెరికా దుష్టపన్నాగా లకు అడ్డుపడుతన్నందుకు గాను రష్యాపై విరుచుకు పడుతున్నాడు
ఆర్థిక సంక్షోభం నుండి దృష్టి మళ్లించ డానికే
2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థ బయట పడలేదు. అది ప్రపంచ వ్యాపిత సంక్షోభంగా మారింది. అమెరికాలో గత దశాబ్ద కాలంగా ఆర్థిక అంతరాలు, నిరుద్యోగం, దారిద్య్రం విపరీతంగా పెరిగిపోయాయి. కార్మిక వర్గంలోనూ, ప్రజల్లో నూ అసంతృప్తి తీవ్రమవుతోంది. సమ్మెపోరా టాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ అసంతృప్తిని మళ్లించేందుకు పాలక వర్గాలు పచ్చి మితవాద శక్తులను ప్రోత్సహిస్తున్నాయి, దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నాయి.
సంక్షోభంతో అమెరికన్ సామ్రాజ్య వాదం బలహీనపడింది. దాని ఆర్థిక వ్యవస్థ ఊగిసలాటలో ఉంది. దాంతో ప్రపంచంపై దాని పట్టుకూడా సడలుతోంది. ఏకధృవ ప్రపం చాన్ని సవాలు చేసే శక్తులు ఊపందు కున్నాయి. చైనా, రష్యా వాటి నాయకత్వంలోని బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ), ఆసియా, ఐరోపా ఖండాలను కలుపుతూ చైనా నిర్మిస్తున్న సిల్క్ రోడ్ వాణిజ్య మార్గం... ఇవన్నీ అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సవాలు చేస్తు న్నాయి. మరోవైపు అమెరికాలో ఇటీవలి కాలం లో కార్మిక సమ్మెలు ఉధృతమవుతున్నాయి. వాల్‌స్ట్రీట్ వ్యతిరేక పోరాటాలు ముమ్మరమైనాయి. అన్ని జాతుల ప్రజలు కలిసికట్టుగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున శాంతి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో నియంతృత్వాన్ని, ప్రపంచంలో యుద్ధాలనూ ప్రోత్సహించడం ద్వారా బయటపడాలని సామ్రాజ్యవాద పాలక పక్షాలు భావిస్తున్నాయి. ఇంటా బయట ట్రంప్ అనుసరిస్తున్న ప్రమాదకర విధానాలు అందులో భాగమే.