ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : అంగన్వాడిల సహనానికి పరీక్ష పెట్టొద్దని, వారి జీవితాలతో చెలగాటమొద్దని ప్రభుత్వాన్ని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ హెచ్చరించారు. స్థానిక తాలూకా సెంటర్‌ వద్ద సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమానికి సిఐటియు నాయకులు పి.మహేష్‌ అధ్యక్షత వహించారు. విజరుకుమార్‌ మాట్లాడుతూ అంగన్వాడిలకు వేతనాలు పెంచుతామనే ముఖ్యమంత్రి హామీ ఉత్త మాటలుగానే మిగిలిందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్చి 20న ఆందోళన చేసిన నేపథ్యంలో శాసన మండలిలో ఐసిడిఎస్‌ మంత్రి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని గుర్తు చేశారు. చాలీచాలని వేతనాలతో, పనిభారంతో, భద్రత లేని ఉద్యోగాలతో పని చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండివైఖరి సరికాదన్నారు. ఉద్యమిస్తున్న వారిపైనా పోలీసులను ప్రయోగించి నిర్బంధానికి పాల్పడ్డం దుర్మార్గమన్నారు. అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణ పేరుతో ఫుడ్‌ కమిషనర్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒలు, ఇతర రాజకీయ నాయకులు తనిఖీలు చేస్తూ అంగన్వాడీలను అవమానిస్తూ, వేధింపులకు గురించేస్తున్నారని మండిపడ్డారు. మినీ సెంటర్ల ప్రధాన సెంటర్లుగా మార్చలేదని, హెల్పర్ల ప్రమోషన్‌ సంబంధించి చర్యలూ చేపట్టలేదని విమర్శించారు. సెంటర్ల నిర్వహణకు అంగన్వాడిలే పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సర్వీసులో ఉండి మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా సమ్మెకు యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు విజయకుమారి, మండలం అధ్యక్షులు రవీంద్రనాత్‌ ఠాగూర్‌, ఎస్‌టియు నాయకులు ఎస్‌ఎం సుభాని, రైతు సంఘ మండల అధ్యక్షులు ఎం.నరసింహారావు, సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, ఐద్వా నాయకులు జి.ఉమశ్రీ, జి.రజినీ, సిపిఐ నాయకులు వేణుగోపాల్‌, జనసేన నాయకులు కె.సాంబశివరావు, డివైఎఫ్‌ఐ నాయకులు జె.రాజ్‌ కుమార్‌ మద్దతు తెలిపారు. అంగన్వాడీ నాయకులు జి.సుజాత, ఎస్‌.అహల్య, జ్యోతి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, ఉమాదేవి, రామాదేవి పాల్గొన్నారు.


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నా చౌక్‌ వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి మాట్లాడారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఆరోగ్య పరంగా బాగుంటున్నారంటే అందుకు అంగన్వాడీలు చేస్తున్న సేవలే కారణమనే విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు. అయితే వారికి మాత్రం అరకర వేతనాలే ఇస్తున్నారని, దీనికితోడు పని ఒత్తిడి, రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. సమ్మెకు టిడిపి, వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. శిబిరాన్ని సందర్శించిన టిడిపి డాక్టర్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ గౌతమి సంఘీభావంగా మాట్లాడుతూ సమగ్ర శిశు సంక్షేమ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మెను ప్రభుత్వం దిగొచ్చేదాకా కొనసాగించాలన్నారు. హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసిపి ఇప్పుడు హామీలను విస్మరించడమే కాకుండా అన్ని వ్యవస్థలనూ బ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్‌ సిలార్‌ మసూద్‌, ఎస్‌.వెంకటేశ్వరరాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి టి.పెద్దిరాజు, నాయకులు కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.


ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లో సమ్మె శిబిరాన్ని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ సందర్శించి మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న వారికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను రద్దు చేయాలని, అన్నింటినీ ఒకే యాప్‌గా మార్చాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లు మానుకోవాలని, ఎన్నికలప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ మాట్లాడుతూ తొలినాళ్లలో అంగన్వాడీ వర్కర్లకు రూ.2500 ఇచ్చేవారని పోరాటాల ఫలితంగా ప్రస్తుతం రూ.10,500 ఇస్తున్నారని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ దక్కాయని గుర్తు చేశారు. ప్రస్తుతం న్యాయమైన అంశాలపై చేపట్టిన సమ్మెకు అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. అంగన్వాడీల పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. మద్దతు తెలిపిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య, విద్యుత్‌ శాఖ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.రాజశేఖర్‌, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.విల్సన్‌, సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, యడ్లపాడు మండల నాయకులు టి.కోటేశ్వరరావు ఉన్నారు. సమ్మె శిబిరంలో అంగన్వాడీ నాయకులు జి.సావిత్రి, కె.రమాదేవి తదితరులున్నారు.

ప్రజాశక్తి -పిడుగురాళ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే యరపతినేనీ శ్రీనివాసరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలపై వైసిపి ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందని, సరైన వేతనాలు అమలు చేయడం లేదని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు సమ్మె శిబిరాన్ని సందర్శిం మద్దతుగా మాట్లాడారు. తెలంగాణలో కంటే అధికంగా వేతనం ఇస్తామని హామీనిచ్చి నాలుగున్నరేళ్లయినా నెరవేర్చలేదని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం, గ్రాట్యుటీ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారథి, మండల కార్యదర్శి శ్రీనివాసరావు, ఎఐటియుసి నాయకులు కృష్ణనాయక్‌, పి.సుజాత మద్దతు తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, అంగన్వాడీ నాయకులు డి.శాంతమణి, షేక్‌ హాజర, శివరంజని, కవిత, ఆనందకుమారి, పీర్‌ మాబీ, అరుణ, భ్రమరాంబ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – దాచేపల్లి : నియోజకవర్గ కేంద్రమైన గురజాలలో ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరాన్ని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు సందర్శించి మద్దతు తెలిపారు. యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి దేవకుమారి మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించపోగా నిర్బంధం విధిస్తోందని, సెంటర్‌ తాళాలు పగలగొడతామని బెదిరించడం హేయమని మండిపడ్డారు. ఇదేతీరు కొనసాగితే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.రత్నం, బి.రాధా, జ్యోతి, ప్రమీల, మల్లేశ్వరి, సుమతి, సైదాబి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – వినుకొండ : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా శిబిరం నుండి శివయ్య స్తూపం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌రెడ్డి మద్దతుగా మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు. అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి, కోశాధికారి ఎఎల్‌ ప్రసన్నకుమారి, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సారమ్మ, వందన, సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎ.ఆంజనేయులు, నాసర్‌బి, పాల్గొన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల : తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద గురజాల ఆర్‌డిఒ రమణకాంత్‌రెడ్డిని అంగన్వాడీలు కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సమ్మెకు టిడిపి మహిళా నాయకులు కృష్ణవేణి, బి.రాజేశ్వరి, జన విజ్ఞాన వేదిక నాయకులు కేళం ఆదినారాయణ, జెవికెఎస్‌ ప్రసాదు, ఆయేషాసుల్తానా సంఘీభావం తెలిపారు. ఉషారాణి, రుక్మిణి, మహలక్ష్మీ, పద్మావతి, శివపార్వతీ, జిజిభారు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-పెదకూరపాడు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహశీల్దార్‌ జియాకు వినతి పత్రాన్ని అందించారు.

ప్రజాశక్తి-ఈపూరు : మండల కేంద్రమైన ఈపూరులోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద ఈపూరు, బొల్లాపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరాన్ని కొనసాగించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సిఐటియు అధ్యక్షులు కె.హనుమంతురెడ్డి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️