మూడో రోజు 263 నామినేషన్లు

Apr 20,2024 23:19 #2024 election, #nomination
  •  పార్లమెంటుకు 40

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడో రోజు శనివారం అసెంబ్లీ స్థానాలకు 263, పార్లమెంటు స్థానాలకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసిన ఎంపి అభ్యర్థుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు నుంచి వైసిపి తరఫున చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నంద్యాల టిడిపి ఎంపి అభ్యర్థిగా బైరెడ్డి శబరి, కడప ఎంపి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైఎస్‌ షర్మిల ఉన్నారు. అసెంబ్లీకి పోటీచేసే ప్రముఖుల్లో చీపురుపల్లి నుంచి వైసిపి అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, ఆయన కుమారుడు బొత్స సందీప్‌, విజయనగరం నుంచి వైసిపి అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసిపి తరపున బొత్స సందీప్‌ రెండు, బొత్స సత్యనారాయణ ఒక నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండియా వేదిక అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి నామినేషన్‌ వేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మాగంటి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా మంత్రి విడదల రజని నామినేషన్‌ వేశారు. విశాఖ పశ్చిమ నుంచి కూటమి వేదిక బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా ఎ.విమల నామినేషన్‌ వేశారు.

➡️