251.31 కోట్లతో 4 విద్యుత్‌ ఉపకేంద్రాలు

Nov 28,2023 21:19

ప్రజాశక్తి – ఏలూరు

జిల్లా పరిధిలో రూ.251.31 కోట్లతో నాలుగు విద్యుత్‌ ఉప కేంద్రాలకు సిఎం జగన్‌ విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో మంగళవారం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పెదవేగి మండలం కొప్పాకలో రూ.139.66 కోట్ల వ్యయంతో 220/132/33 కెవి విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి ఎపి ట్రాన్స్‌ కో మంజూరు చేసిన విద్యుత్‌ ఉప కేంద్రానికి శంఖుస్ధాపన, టి.నరసాపురంలో రూ.60.20 కోట్ల వ్యయంతో ద్వారకాతిరుమలలో రూ.28.89 కోట్ల వ్యయంతో, నారాయణపురంలో(నల్లమాడు)లో రూ.22.62 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కెవి విద్యుత్‌ ఉపకేంద్రాలను వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. కొప్పాక విద్యుత్‌ ఉప కేంద్రం శంఖుస్థాపనకు విచ్చేసిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బి.లావణ్యవేణి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీప్రసాద్‌తో కలిసి వర్చువల్‌ ద్వారా సిఎం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోటగిరి మాట్లాడుతూ ఎంతో కాలంగా లోఓల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి విద్యుత్‌ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా నాణ్యమైన విద్యుత్‌ పొందొచ్చన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని, పారిశ్రామిక రంగానికి మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందింస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్‌ అందుతుందని, గృహరంగానికి మెరుగైన విద్యుత్‌ పొందుతామని తెలిపారు. సిఎం జగన్‌ నవరత్నాల ద్వారా విద్యుత్‌ సబ్సిడీలను అందజేస్తుందని తెలిపారు. జెడ్‌పి చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సిఎం జగన్‌ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజల ఆశయాలకనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. విద్యుత్‌ ఉప కేంద్రాల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న లోఓల్టేజీ సమస్య, రైతుల సమస్యలు తీరబోతున్నాయని ఆమె తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బి.లావణ్యవేణి మాట్లాడుతూ జిల్లాలో టి.నరసాపురం, ద్వారకాతిరుమల, నారాయణపురం మండలాల్లోని విద్యుత్‌ సమస్యను తీరబోతుందన్నారు. భీమడోలు, నూజివీడు, కామవరపుకోట, లైన్లు కలిపేందుకు కొప్పాక విద్యుత్‌ కేంద్రం నుండి డిసి లైన్లు కలుపుతామని తెలిపారు. కొప్పాక సబ్‌ స్టేషన్‌ ద్వారా రాబోయే రోజుల్లో ఏలూరు, పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు లబ్దిచేకూరుతుందని తెలిపారు. టి.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట మండలంలోని కొన్ని ప్రాంతాలు సుమారు రెండుల లక్షల విద్యుత్‌ వినియోగదారులకు లబ్ధిచేకూరుతుందన్నారు. ద్వారకాతిరుమల మండలం పెదవేగి, జంగారెడ్డిగూడెం, కామవరపుకోటలో 1.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఉంగుటూరు మండలం నల్లజర్ల, భీమడోలు, నిడమర్రు మండలాల్లోని సుమారు రెండు లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు లబ్దిచేకూరుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ సాల్మన్‌రాజు, సర్పంచి, జెడ్‌పిటిసి, ఎంపిటిసిలు, విద్యుత్‌ శాఖ ఎడిలు, డిఇలు, ఎఇలు, విద్యుత్‌ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల:మండలంలోని వెంకటకృష్ణా పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన 132/33 విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సిఎం జగన్‌ వర్చువల్‌గా మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సిఎం జనగ్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️