250 గ్రానైట్‌ పరిశ్రమలు మూసివేత

Mar 11,2024 08:03 #closed, #granite factories

– సమస్యలు పరిష్కరించే వరకూ తెరిచే ప్రసక్తే లేదు : పరిశ్రమల యాజమాన్యం

– వీధిన పడిన కార్మికులు

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ :ప్రభుత్వ విధానాలకు నిరసనగా గ్రానైట్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మార్టూరు ప్రాంతానికి చెందిన 250 గ్రానైట్‌ పరిశ్రమలను ఆయా యాజమాన్యాలు ఆదివారం నుంచి నిరవధికంగా పరిశ్రమను మూసివేశాయి. ఈ సందర్భంగా గ్రానైట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పత్తిపాటి సురేష్‌, షేక్‌ కాలేషావలి మాట్లాడుతూ గ్రానైట్‌ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ గ్రానైట్‌ పరిశ్రమలను తెరిచే ప్రసక్తి లేదని తెలిపారు. పరిశ్రమలు మూతపడడంతో వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్న వివిధ రాష్ట్రాల కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పరిశ్రమలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో, అప్పటి వరకూ తమ కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలో అర్థం కాక కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమలు మూసివేత ఇంకొద్ది రోజులు ఇలాగే కొనసాగితే మూటముల్లే సర్దుకొని తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడం తప్ప వేరే దారి లేదని వారు వాపోతున్నారు.

➡️