కెసిఆర్‌ తుంటి ఎముకకు శస్త్రచికిత్స

Dec 9,2023 08:37 #health condition, #KCR
KCR suffers hip fracture after fall in washroo

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తుంటిఎముకకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద వైద్యులు తెలిపారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కెసిఆర్‌ గురువారం అర్ధరాత్రి బాత్‌ రూంలో కాలుజారి కిందపడ్డారు. కాలుకి గాయం కావడంతో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కెసిఆర్‌కు ఎడమ తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం సర్జరీ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అనుమతి లేనందున బిఆర్‌ఎస్‌ శ్రేణులు, కెసిఆర్‌ అభిమానులు ఆస్పత్రి వద్దకు రావొద్దని చెప్పారు. ఆస్పత్రిలో కెసిఆర్‌ను బిఆర్‌ఎస్‌ నేతలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పరామర్శించారు. కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సిఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్విని సిఎం ఆదేశించారు. కెసిఆర్‌ ఆరోగ్యంపై ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కెటిఆర్‌కు ఫోన్‌చేసి..కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ, ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

➡️