Bonds: 22,217 ఎన్నికల బాండ్ల జారీ

Mar 14,2024 07:55 #Electoral Bonds, #Supreme Court

సుప్రీంకోర్టులో ఎస్‌బిఐ అఫిడవిట్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్‌ బాండ్లను జారీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్‌ చేశారని వెల్లడించింది.ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఎస్‌బిఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖరా అఫిడవిట్‌ దాఖలు చేశారు. అలాగే, ఎన్నికల బాండ్లపై డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు కోర్టుకు ఎస్‌బిఐ తెలిపింది. ఇసికి పెన్‌డ్రైవ్‌లో ఆ సమాచారాన్ని చేరవేసినట్లు ఎస్‌బిఐ పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న పని వేళలు ముగిసేలోపు ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను అందుబాటులో ఉంచినట్లు ఎస్‌బిఐ తెలిపింది. ప్రతి ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదారు పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లు, కొనుగోలు చేసిన బాండ్ల డినామినేషన్‌తో సహా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించినట్లు పేర్కొంది.
ఫిబ్రవరి 15న వెలువరించిన ఒక మైలురాయి తీర్పులో, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అనామక రాజకీయ నిధులను అనుమతించే ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. దీనిని ”రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొంది. దాతలు, గ్రహీతలు విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది.

 

➡️