64 పాఠశాలల్లో సిబిఎస్‌ఇ తరగతులు

పేద విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యా బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో
  • సిబిఎస్‌ఇ బోర్డు పరిధిలోకి పాఠశాలలు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
  • సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌.జయప్రకాష్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

పేద విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యా బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ)ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సమగ్ర శిక్ష అభియాన్‌ అదనపు సమన్వయకర్త డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌ తెలిపారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సిలబస్‌ ప్రారంభం కానుందన్నారు. జిల్లాలో సిబిఎస్‌ఇ కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి 64 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సిబిఎస్‌ఇ కోర్సుల నిర్వహణకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పలు అంశాలపై ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వివరించారు.సిబిఎస్‌ఇ సిలబస్‌ బోధనకు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? జిల్లాలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధన ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఆంగ్ల విద్యను రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నాం. ఎస్‌ఎస్‌సి బోర్డు పరిధిలోనే పరీక్షల నిర్వహణ జరుగుతోంది. విద్యార్థులకు జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సిలబస్‌ ద్వారా నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం. ఆ దిశగా జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 64 పాఠశాలల్లో సిబిఎస్‌ఇ విద్యా బోధన జరుగనుంది.ఈ కోర్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? రాష్ట్రస్థాయిలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విధానం అమల్లో ఉంది. దీనివల్ల తెలుగు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లను మాత్రమే నిర్వహిస్తున్నాం. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి సిబిఎస్‌ఇ సిలబస్‌ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆంగ్ల భాషలో విద్యా బోధనతో పాటు జాతీయ ప్రమాణాలు కలిగి ఉండడంతో విద్యార్థికి మేలు చేకూరుతుంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సిబిఎస్‌ఇ బోర్డు ఉన్నతాధికారులు స్కూళ్లను ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో ఈ పాఠశాలలు అనుసంధానం కావాల్సి ఉంటుంది. బోర్డు పరిధిలోనే జాతీయ స్థాయిలో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ దిశగా విద్యార్థులను తయారు చేయడానికి బోధనాంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇస్తారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి?ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. పెద్దఎత్తున ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో కార్పొరేట్‌స్థాయిలో వసతులు సమకూర్చాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం, భవనాల మరమ్మతులు, రంగులు మార్చడం, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, విద్యార్థులు కూర్చునేందుకు అనువైన బెంచీలు, గదుల్లో స్క్రీన్లు, ఫ్యాన్ల సదుపాయాలను సమకూర్చాం. పాఠశాలలో తరగతి గదిలో చదుకునే విద్యార్థులకు శ్రద్ధను పెంచడానికి తోడ్పడింది. ఇప్పుడు తనకు నచ్చిన కోర్సును చదువుకునేందుకు వీలుగా ఆంగ్ల బోధన, సిబిఎస్‌ఇ తరగతులు నిర్వహిస్తున్నాం. వారి ఆసక్తిని బట్టి ఈ కోర్సుల్లో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యాబోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడంతో చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.

➡️