PAN: విద్యార్థి ‘పాన్‌’పై 46కోట్ల లావాదేవీలు!

మధ్యప్రదేశ్‌ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది. మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోతున్న ఐటి శాఖ… తన విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని ఇప్పటికే పలు విమర్శలు వినబడుతున్నాయి. కాగా, ప్రభుత్వ సేవలో తలమునకలవుతోన్న ఐటి శాఖ పరిధిలో భారీ మొత్తంలో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్‌లోని ఓ విద్యార్థి తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలను చూసి షాక్‌ అయ్యి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం… విద్యార్థి బ్యాంక్‌ ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. గ్వాలియర్‌లో నివసిస్తున్న ప్రమోద్‌ కుమార్‌ దండోటియా(25)కు తన పాన్‌ కార్డ్‌ ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్‌ చేయబడిందని ఆదాయపు పన్ను, జిఎస్‌టి నుండి నోటీసు రావడంతో విస్తుపోయాడు. ఈ లావాదేవీలన్నీ ముంబై, ఢిల్లీల నుండి జరిగాయి.

ఈ విషయంపై బాధితుడు దండోటియా మాట్లాడుతూ… ‘నేను గ్వాలియర్‌లో కళాశాల విద్యార్థిని. ఆదాయపు పన్ను, జిఎస్టీల నుండి నోటీసు వచ్చిన తర్వాతేనే… నా పాన్‌ కార్డ్‌ ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్‌ అయిందని, అది 2021 నుండి ముంబై, ఢిల్లీలలో నిర్వహించబడుతున్నట్లు తెలిసింది. నా పాన్‌ కార్డు ఎలా దుర్వినియోగం అయిందో, లావాదేవీలు ఎలా జరిగాయే నాకు తెలీదు” అని అన్నారు.

ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శుక్రవారం మరోసారి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఎస్‌పి షియాజ్‌ మీడియాతో మాట్లాడుతూ… ”తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు ఒక యువకుడి నుండి ఈరోజు దరఖాస్తు వచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నాం. పాన్‌ కార్డును దుర్వినియోగం చేసి, దాని ద్వారా ఒక కంపెనీని రిజిస్టర్‌ చేసి, భారీ మొత్తంలో లావాదేవీలు జరిగాయి” అని తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఎఎస్‌పి తెలిపారు.

➡️