నంద్యాలలో 44.9 డిగ్రీలు

  •  192 మండలాల్లో వడగాడ్పులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సూర్యుడు భగభగమంటున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురం గ్రామంలో అత్యధికంగా 44.9 డిగ్రీలు నమోదైంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.3 డిగ్రీలు చొప్పున, అనకాపల్లి జిల్లా రావికవతం, విజయనగరం జిల్లా రామభద్రాపురం, తుమ్మికాపల్లి, ప్రకాశం జిల్లా దొనకొండ, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.1 డిగ్రీల చొప్పున, కర్నూలు జిల్లా వగరూరు గ్రామంలో 43.9 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా 16 జిల్లాల్లో నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని, శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరంలో 22, పార్వతీపురం మన్యంలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4, అనకాపల్లిలో 11, కాకినాడలో 3, తూర్పుగోదావరి, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో రెండు మండలాలు చొప్పున, పల్నాడు జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

➡️