43 డిగ్రీలు ఎండ

Apr 11,2024 20:36

ప్రజాశక్తి- రేగిడి : ఎండ వేడి తీవ్రతతో పాటు వడగాల్పులకు ప్రజలు అల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలోనే వడగాలులు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 43 డిగ్రీల బానుడు భగ భగ మండుతుంటే వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వీధులు, ప్రధాన రహదారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పాలకొండ-విశాఖపట్నం ప్రధాన రహదారి వడగాల్పులకు నిర్మానుష్యంగా మారింది. మరో ఐదు రోజులు పాటు వడగాలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఎలా గడపాలోనన్న ఆయోమయంలో ప్రజలు ఉన్నారు. ఈ ఎండలకు వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికే విపత్తుల కేంద్రం నుంచి అనేక సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఎండలో తిరగవద్దని అవసరం మేరకు బయటికి వెళ్లాలని ఉన్ని దుస్తులు వేసి టోపీలు పెట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మ నీరు తప్పనిసరిగా తాగాలని చెబుతున్నారు. చల్లని ప్రదేశాల్లో ఉండాలని, వడదెబ్బకు గురికాకుండా ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు. రేగిడి, బూరాడ వైద్యాధికారులు అసిరి నాయుడు, చలమయ్య వడదెబ్బలకు కావలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

➡️