40 ఏళ్లుగా ఎదురుచూపులే మిగిల్చారు..

Feb 25,2024 23:51

విలేకర్లతో మాట్లాడుతున్న రాధాకృష్ణ, తదితరులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట : వరికపూడిశెల ప్రాజెక్టు కోసం వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, గురజాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర మండలాల ప్రజలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, పాలకులు మాత్రం శంకుస్థాపనలతోనే సరిపెడుతున్నారని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు స్థానిక పండరిపురంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడారు. అభివృద్ధి గురించి పాలకులు పదేపదే చెబుతున్నారని, అందుకు కీలకం నీటి వనరులు అనే విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటి అవసరాలూ తీరతాయని చెప్పారు. భూగర్భ జలాల మట్టం పెరుగుతుందన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రాజెక్టుకు 1996 మార్చి 5న అప్పటి సిఎం నారా చంద్రబాబు నాయుడు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులోని వీరస్వామి గుడివద్ద, 2008 జూన్‌ 6వ తేదీన అప్పటి సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద శంకుస్థాపన చేశారని, అయితే శిలాఫలకాలు దాటి పనులు కదల్లేదని అన్నారు. తాజాగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది నవంబర్‌ 15న మాచర్లలో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదని విమర్శించారు. పైన పేర్కొన్న మండలాల్లో 30 ఏళ్ల క్రితం బోరు వేస్తే 30 అడుగల్లోనే నీరు వచ్చేదని, ఇప్పుడు 1300 అడుగులు వేసినా ఫలితం ఉండడం లేదని తెలిపారు. వేసవిలో తాగునీటికి జనం అల్లాడుతున్నారన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ.వెయ్యి పెట్టి తాగునీరు కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. ఈ ప్రాంత యువతకు ఇక్కడ ఉపాధి కరువై హైదరాబాద్‌, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్లో కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన సాగర్‌ చీలికలో నిలిచి ఉండే నికర జలాలు, మిగులు జలాలను వజ్రాలపాడు తండా వరకు నీరు వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారన్నారు. దాంతో 50 వేల ఎకరాలకు నేరుగా సాగునీరు అందుతుందని, 225 ఎకరాలున్న వజ్రాలపాడు చెరువు మొదట నిండితే దాని ద్వారా వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పుల్లలచెరువు మండలాల్లో 60కి పైగా చెరువులు నిండుతాయని, తద్వారా భూగర్భ జలాలు పెరిగి 150 గ్రామాల్లో, తండాల్లో, 1.20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. నాలుగున్నర లక్షల మంది రైతులు లబ్ధి పొందటమే కాక ఈ ప్రాజెక్టు పూర్తయితే విద్య, వైద్య, రవాణ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని, ప్రాజెక్టుకు కేటాయించాల్సిన రూ.3500 కోట్లతో తొలి విడతగా రూ.1600 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారని, లేకుంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో రైతుసంఘం సీనియర్‌ నాయకులు బి.శంకరరావు, సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️