24 ఉప రంగాలపై డిపిఐఐటి దృష్టిఎగుమతుల పెంపు లక్ష్యం

Dec 26,2023 21:10 #Business

న్యూఢిల్లీ : దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి.. దిగుమతులను తగ్గించుకోవడానికి.. ఎగుమతులను పెంచుకోవడానికి 24 ఉప రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్లు డిపిఐఐటి తెలిపింది. వీటిలో ఫర్నీచర్‌, అల్యూమినియం, అగ్రోకెమికల్స్‌, టెక్స్‌టైల్స్‌, ఎయిర్‌ కండీషనర్లు, తోలు, పాదరక్షలు తదితర ఉప రంగాలున్నాయని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డిపిఐఐటి) ఓ ప్రకటనలో తెలిపింది. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రారంభించినప్పటి నుండి పలు ముఖ్యమైన విజయాలు సాధించామని.. ఇప్పుడు ‘మేక్‌ ఇన్‌ ఇండియా 2.0’ కింద 27 రంగాలపై దృష్టి సారిస్తోన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే డిపిఐఐటి 15 తయారీ రంగాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సమన్వయం చేస్తుండగా, వాణిజ్య శాఖ 12 సేవా రంగాలకు సమన్వయం చేస్తోందని వెల్లడించింది. పోటీతత్వం, దిగుమతి ప్రత్యామ్నాయం అవసరం, ఎగుమతి సామర్థ్యం పెంపు, ఉపాధిని దఅష్టిలో ఉంచుకుని ఎంచుకున్న 24 ఉపరంగాలతో కలిసి పని చేయనున్నట్లు తెలిపింది. ఇథనాల్‌, సిరామిక్స్‌, సెట్‌ టాప్‌ బాక్సులు, రోబోటిక్స్‌, టెలివిజన్లు, క్లోజ్‌ సర్క్యూట్‌ కెమెరాలు, బమ్మలు, డ్రోన్లు, వైద్య పరికరాలు, క్రీడా వస్తువులు, జిమ్‌ పరికరాలు తదితర విభాగాలపై కూడా దృష్టి సారించినట్లు పేర్కొంది. ఆయా ఉప రంగాల్లో పెట్టుబడులను సులభతరం చేయనున్నట్లు డిపిఐఐటి వెల్లడించింది.

➡️