20 నుంచి ‘అనంత చిరుధాన్యల పండుగ’

విలేకరులతో మాట్లాడుతున్న వైవి.మల్లారెడ్డి

       అనంతపురం : ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘అనంత చిరుధాన్యల పండుగ’ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎఎఫ్‌.ఎకాలజీ డైరెక్టర్‌ వైవి.మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు అనంతపురం ఎఎఫ్‌ ఎకాలజీ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాదిగా జిల్లాలో ఆహార పంటల సాగు అధికంగా ఉండేదని తెలిపారు. హరిత విప్లవం నేపథ్యంలో పంటల సాగులో మార్పులు జరుగుతూ వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లారని పేర్కొన్నారు. దీంతో అంతకు మునుపు సాగవుతున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు బాగా తగ్గిపోయిందన్నారు. ఫలితంగా ఇక్కడి ప్రజలు వాడకం కూడా తగ్గిందని చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయంగా చూసుకుంటే మారుతున్న పరిస్థితుల్లో ఆరోగ్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చిరుధాన్యాల వాడకం పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో జిల్లాలోనూ చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. దేశంలో కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థతోపాటు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చిరుధాన్యాల ఆహారాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మన రాష్ట్రంలోనూ ప్రభుత్వం మిల్లెట్‌ మిషన్‌ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. చిరుధాన్యాల వాడకం పెరగడం ద్వారా రైతుకు ఆదాయం… అదే విధంగా ప్రజలకు ఆరోగ్యం లభిస్తాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎఎఫ్‌ ఎకాలజీతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం విభాగాలు అందరరూ కలసి మూడు రోజులపాటు అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ‘అనంత చిరుధాన్యాల పండుగ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినట్టు వివరించారు. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, స్టాల్స్‌లో చిరుధాన్యాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన వంటలు, ప్రాసెసింగు పద్ధతులు గురించి అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎఫ్‌ ఎకాలజీ ప్రతినిధులు మురళీకృష్ణ, లక్ష్మిరెడ్డి, మీడియా కో ఆర్డినేటర్‌ రమేష్‌ సుసర్ల, జన జాగృతి ప్రతినిధి బలరాం, స్వచ్ఛకడ్యమని ప్రతినిధి వి.విజయ భాస్కర్‌, తిరుమల ఫుడ్స్‌ ప్రతినిధి నరసింహులు, సీఆర్డీఎ ప్రతినిధి పి.నరసింహారెడ్డి, ఎపిఎఫ్‌పిఎస్‌ ప్రతినిధి అలెన్‌ మాథ్యూ, రెడ్స్‌ నుంచి వైఎ.అనిత పాల్గొన్నారు.

➡️