11 గ్రామాల్లో ఉపాధికి గండి

Feb 8,2024 21:16

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అసలే వలసలు ఎక్కువగా ఉన్న జిల్లా…. ఆపై నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు ఎల్‌జిడి (లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరేట్‌) కోడ్‌ను రూపొందించకపోవడంతో గ్రామీణ జాతీయ ఉపాధి హామీ ఆయా గ్రామాలకు దూరమైంది. దీంతో, ఆయా గ్రామాల్లో వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. మూడు నెలలుగా ఉపాధి పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా వున్న 11 మధుర గ్రామాలను ఇటీవల ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఆయా పంచాయతీల ఎల్‌జిడి కోడ్‌ ఆధారంగానే ప్రభుత్వ పథకాల ప్రతిపాదనలు లేదా ఇతర డిమాండ్స్‌లు పంపడం లేదా ప్రభుత్వం మంజూరు చేయడం వంటి కార్యకలాపాలు జరుగుతాయి. దీన్ని రాష్ట్ర స్థాయిలో సిసిఎల్‌ఎ విభాగం కేటాయించాల్సివుంటుంది. నెలలు తరబడి కోడ్‌ను కేటాయించకపోవడంతో ఉపాధి పనుల ప్రతిపాదనలు పంపడం సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎల్‌జిడి కోడ్‌ ఎంటర్‌ చేస్తే తప్ప ఎన్‌ఐసి సాఫ్ట్‌వేర్‌లో ముందుకు నడిచే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ కారణంతో గడిచిన మూడు నెలలుగా ఆయా పంచాయతీల్లో ఉపాధి పనులు మూడు నెలలుగా జరగడం లేదు. ఇలాంటి సమస్య ఉన్నవాటిలో మెరకముడిదాం మండలం నరసయ్యపేట, ఎం.గదబవలస, గుర్ల మండలం ముద్దాడపేట, రౌతుపేట, కేశవుపేట, నెల్లిమర్ల మండలం పెదబూరాడపేట, మెంటాడ మండలం చింతాడివలస, విజయనగరం మండలం బడుకొండపేట, సుంకరపేట, గుండాలపేట, చిల్లపేట ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో సుమారు 2,871 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఉపాధి పనులు దొరక్కపోవడతో ఆర్థికంగా ఆయా కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. పండగ తరువాత ఉపాధి పనికి పోదమనుకుంటే ఏవో సమస్యలు ఉన్నాయంటూ పని కల్పించడం లేదని కేశవపేటకు చెందిన కొవ్వాడ దేవి, దొంతల రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి రెండో వారం వరకూ వ్యవసాయ పనులు ఉండడంతో ఉపాధి పనుల అవసరం పెద్దగా లేకపోయిందని, ఆ పనులు పూర్తికావడంతో ప్రస్తుతం ఉపాధి పనులే దిక్కని రైతుపేట గ్రామానికి చెందిన గేదెల సీతంనాయుడు, గేదెల పైడినాయుడు, రౌతు తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు తొలగుతాయనుకుంటే..
ప్రత్యేక పంచాయతీగా గుర్తింపు పొందడంతో చిటికీ మాటికీ పక్కూరు వెళ్లక్కరలేదని, ప్రభుత్వ పథకాలు కూడా మరింత అందుబాటులోకి వస్తాయని భావిస్తే మరింత జఠిలమయ్యాయి. గుర్తింపు లేని పంచాయతీలు ఎందుకు? పాలకుల నిర్లక్ష్యం తమను ఉపాధి పనులకు కూడా దూరం చేసింది. వ్యవసాయ పనులు లేక, ఇటు ఉపాధి పనులు దొరక్క ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
– పెనుమజ్జి అప్పలనారాయణ,నర్సయ్యపేట సర్పంచ్‌, మెరకముడిదాం మండలం
సిసిఎల్‌ఎ కమిషనర్‌కు డిఒ లెటర్‌
ఇప్పటికే సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. పంచాయతీలకు ఎల్‌జిడి (లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరేట్‌) కోడ్‌ విషయమై సిసిఎల్‌ఎ కమిషనర్‌కు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ డిఒ లెటర్‌ కూడా రాశారు. పనులు పునరుద్ధరించే ఏర్పాటు చేయాలంటూ ఆయా పంచాయతీలకు చెందిన ఉపాధి కూలీలనుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.
– ఉమాపరమేశ్వరి, డ్వామా పీడీ, విజయనగరం జిల్లా

➡️